ఆంధ్రప్రదేశ్‌

మహిళా సదస్సు సక్సెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 12: అమరావతి సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ తీరాన మూడురోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సంపూర్ణంగా ముగిసింది. దీనికోసం గత నాలుగునెలల నుంచి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన వరస సమీక్షలు, పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులు చేసిన కృషి ఫలించింది. దేశంలోనే తొలిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడం ద్వారా దేశ, విదేశాల దృష్టిని అమరావతి వైపు మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయం సాధించారు. గత రెండున్నరేళ్ల నుంచి వరసగా రాజధాని శంకుస్థాపన, విశాఖలో రెండుసార్లు భాగస్వామ్య సదస్సు, గోదావరి, కృష్ణా పుష్కరాలు, హ్యాపీసండే, నేవీ విన్యాసాలు, మచిలీపట్నం పడవల పోటీలు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఎయిర్‌షోలతో నవ్యాంధ్రను దేశ, విదేశాలకు మరోసారి గుర్తు చేసి, అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మహిళా సదస్సు ద్వారా, అమరావతిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేయడంలో బాబు విజయం సాధించారు. ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ల స్థాయిలో నిర్వహించడంలో అందవేసిన చెయ్యి అయిన బాబు, మహిళా సదస్సు నిర్వహణ ద్వారా కొత్త రాష్ట్రం అందరి దృష్టినీ ఆకర్షించేలా చేయగలిగారు. అటు స్పీకర్ కోడెల కూడా తన నిర్వహణా సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పారు. సదస్సు కోసం ఆయన గత నాలుగునెలల నుంచి విపరీతంగా కృషి చేశారు. ప్రణాళికలు రూపొందించారు.
ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానపత్రాలు అందించారు. విదేశాలకు వెళ్లినప్పుడు సైతం అమరావతి గొప్పతనాన్ని, పెట్టుబడుల అవసరాలను వివరిస్తూనే సదస్సుకు రావాలని ఆహ్వానించారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలను సైతం జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించేంత స్థాయిలో కష్టపడిన కోడెల, ఇప్పుడు ఈ సదస్సు విజయంలోనూ కీలకపాత్ర పోషించారు. ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటే అది విజయం సాధించేంత వరకూ విశ్రమించని కోడెల కష్టానికి ఫలితం లభించింది. అటు పోలీసులు కూడా సదస్సు నిర్వహణలో శ్రమించారు. సహజంగా ఇలాంటి భారీ ఈవెంట్ల సందర్భంలో పోలీసులపై విమర్శలు వినిపిస్తుంటాయి. సందర్శకులు, నాయకులతో ఘర్షణ పడుతుండటం సహజం. కానీ ఈ సదస్సులో మాత్రం అలాంటివి వినిపించకపోవడం విశేషం. డిజిపి నండూరి సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ నేతృత్వంలో డిసిపి గడిసె పాలరాజ్, కాంతిరాణా టాటా, జివిజి అశోక్ ఆధ్వర్యాన తీసుకున్న ముందస్తు చర్యలే దీనికి కారణం. నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ బాబు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సలోని గత నెలరోజుల నుంచి సదస్సు విజయవంతం కోసం శ్రమించారు.
కాగా సదస్సులో తొలిరోజు 29మంది, రెండోరోజు 31, మూడవ రోజు 15 మంది స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. వైబ్‌సైట్‌లో 6 కోట్ల 50వేల మంది నెటిజన్లు లైక్ చేశారు. కోటి ఇరవై లక్షల మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 1700 కాలేజీలకు చెందిన విద్యార్థినులు నేరుగా సదస్సుకు హాజరయ్యారు. వీరితోపాటు మరో 300 మంది విద్యార్ధినులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా భాగస్వాములయ్యారు. 54 రౌండ్ టేబుళ్లతో, ఒక్కో టేబుల్‌కు 108 మంది చొప్పున విద్యార్థినులతో బృందచర్చలు నిర్వహించారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా గత మూడురోజుల నుంచి సదస్సు కోసం పడిన కష్టం ఫలించింది. అయితే అందరూ ఊహించినట్టు అమరావతి డిక్లరేషన్ ప్రకటించకుండానే సదస్సు ముగిసింది.

చిత్రాలు..లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను సత్కరిస్తున్న చక్రపాణి, చంద్రబాబు, కోడెల, తదితరులు. వేదికపై నవ్వులు చిందిస్తున్న సుమిత్రా మహాజన్, చంద్రబాబు