ఆంధ్రప్రదేశ్‌

కరవు నిజం... వలస నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాలకు లేని కనికరం కరవుకు ఎందుకుంటుంది? దానికి కబళించడమే తెలుసు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తుంటే కరవు కరాళనృత్యం సాగిస్తోంది. ఆ మాటకొస్తే అనంతపురం కరవు చరిత్రలో ఇదేమీ కొత్త ఘట్టం కాదు..ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే. కాకపోతే, కరవన్నది మచ్చుకైనా లేదని ఢంకా బజాయిస్తున్న పాలకుల కళ్లకు కనబడటం లేదంతే. నిలదీయాల్సిన విపక్షమూ నిస్తేజమైపోయిన వేళ అయ్యో పాపం అనేవారు లేక, అన్నమో రామచంద్రా అంటూ ఇతర ప్రాంతాలకు వలస పోతున్న అనంతపురం జిల్లావాసుల వలస కష్టాలపై ‘ఆంధ్రభూమి’ వరుస కథనాలను వెలువరిస్తోంది.
**
అనంతపురం, ఫిబ్రవరి 27:్భర్త ఒక చోట.. భార్య మరోచోట,, పిల్లలు, ముసలి తల్లిదండ్రులు ఇంకోచోట.. ఇదీ వలస జీవుల బతుకు చిత్రం. కరవువెంటాడడంతో అనంతపురం జిల్లా నుంచి సుమారు లక్ష మంది వలసబాట పట్టారు. భర్తలు కూలీ పనులకు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లగా వారి భార్యలు భాగ్యనగరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో భిక్షమెత్తుకునేందుకు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద ముసలివాళ్లు జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.
జిల్లాలో కరవు అంతగా లేదని, ఉపాధి పనులు కల్పించినందున వలసలు తగ్గాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో వరుస కరవు దరువుతో వందలాది గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కొందరు కుటుంబాలతో సహా వలసవెళ్లగా, ఇంకొందరు భార్యభర్తలు, పిల్లలు తలో దిక్కు కూలి పనులు, భవన నిర్మాణ పనులు, భిక్షాటనకు వెళ్తున్నారు. కనీసం లక్ష మంది దాకా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాదు, బళ్లారి, హోసూరు తదితర ప్రాంతాలకు పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లారు. అయితే అధికారిక గణాంకాల మేరకు శాశ్వత జాబ్‌కార్డులున్న 49 వేల కుటుంబాల్లో కేవలం 12 వేల కుటుంబాల మాత్రమే వలస వెళ్లినట్లు తేల్చారు. మెరుగైన ఉపాధి కోసం ఎక్కువగా వెళ్లారని అంటున్నారు.
గోరంట్ల మండలం డి.గంగంపల్లితండా నుంచి సుమారు 40 కుటుంబాలకు చెందిన 60 మంది గ్రామం వదిలిపోయారు. ఇక్కడ ఉన్న చిన్నతండా, పెద్దతండాకు చెందిన వారు గత జనవరిలోనే బెంగళూరు, హైదరాబాదుకు వెళ్లారు. గోరంట్ల మండలంలో 102 గ్రామాలుండగా, అందులో 80 గ్రామాల నుంచి 10 వేల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. డి.గంగంపల్లి చిన్నతండా, పెద్దతండాలో ఆడవారు, వృద్ధులు హైదరాబాదుకు భిక్షాటనకు వెళ్లారు. మగవారు కూలీ పనులకు బెంగళూరు వెళ్లారు. వృద్ధులు ఖాళీ ఇళ్లకు కాపలాగా ఉన్నారు. గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉన్న వారికి ఉపాధి పనులు లేవు. వంద రూపాయలు గిట్టుబాటైనా పనులు కల్పిస్తే చాలని స్థానికంగా ఉన్న ఆడవారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు రాకపోవడంతో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగంపల్లికి పిల్లలు నడిచి వెళ్తున్నారు. ఆటోలున్నా చార్జీలకు డబ్బుల్లేవని తల్లులు వాపోయారు. అలాగే గంగంపల్లి గిరిజన పెద్దతండాలో దాదాపు 50 కుటుంబాలకు చెందిన 100 మంది వలసెల్లిపోయారు. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామ పంచాయతీలో దాదాపు 300 మంది దాకా పనుల కోసం వలస వెళ్లారు. కదిరి మండల పరిధిలోని మరువతండా, కారెడ్డిపల్లి, ఎగువతండా, ఎటిగట్టుతండా, మీటేనాయక్‌తండా, ముష్టిపల్లికి చెందిన రైతులు, కూలీలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్టక్రు వలస వెళ్లారు. అక్కడ కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుండగా, కేరళకు వెళ్లిన వారిలో అనేక మంది భిక్షాటన చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నల్లచెరువు మండలం నుంచి తిరుపతి, పళని, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లి కాశీదారాలు, ఫ్యాన్సీ వస్తువులు అమ్ముకుంటూటు జీవనం గడుపుతున్నారు. అమడగూరు మండలం రైతులు, కూలీలు వెయ్యి మంది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హోటళ్లలో సర్వర్లుగా, తాపీ పనివారుగా, దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. గాండ్లపెంట, తనకల్లు, చేనేత పట్టుకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం మండలంలో గత కొనే్నళ్లుగా వలసలు నిత్యకృత్యమయ్యాయి. చేనేత పరిశ్రమ భారీగా దెబ్బ తీయడంతో మగ్గాల కార్మికులు, అరకొర ఆదాయాన్ని పొందే చేనేతలు వలస వెళ్లక తప్పలేదు. ధర్మవరం మండలం నుంచి 500 కుటుంబాలు వలస వెళ్లాయి. తాడిమర్రి మండలం నుంచి పది వేల కుటుంబాలకు గాను 150 కుటుంబాలు వలస వెళ్లాయి. బత్తలపల్లి మండంలో 52 కుటుంబాలు వెళ్లగా, అధికారులు 100 మంది మాత్రమే వెళ్లినట్లు చెబుతున్నారు. పుట్టపర్తి మండలంలోని 1500 కుటుంబాల్లో సుమారు 6 వేల మంది వలస వెళ్లారు. గోనేనాయక్‌తండాలో 52 కుటుంబాలకు గాను 37 కుటుంబాలు పొట్ట చేతపట్టుకుని వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. బుక్కపట్నం మండలంలో వెయ్యి కుటుంబాలకు చెందిన వారు వలస బాటపట్టారు. కొత్తచెరువు మండలంలో 12,500 కుటుంబాలకుగాను 50 కుటుంబాలు వలస వెళ్లినట్లు సమాచారం. రాప్తాడు, కనగానపల్లి మండలాల్లో సైతం 20వేల కుటుంబాలకు గాను పెద్దసంఖ్యలో కూలీ పనులకు వలస వెళ్లారు. రాయదుర్గం మండలం రాయదుర్గం, గుమ్మఘట్ట, కణేకల్, డీ.హిరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో అత్యధికంగా ప్రజలు వలస వెళ్లారు. గత పదేళుగా గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడంతో ఆయకట్టు భూములు బీడు పడ్డంతో రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధిని వెదుక్కోక తప్పలేదు. బెంగళూరు, చిక్కమంగళూలరు, చిత్రదుర్గం, బళ్లారి తదితర ప్రాంతాలకు 15 వేల మంది దాకా వలస వెళ్లినట్లు సమాచారం. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు బెంగళూరు వెళ్లారు. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 50 మంది వరకు మైసూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు.

మూడెకరాల్లో పంట పోయింది
మూడెకరాల్లో వేరుశెనగ కంది వేశాం. నీళ్లు లేక పంట ఎండిపోయింది. బతకలేక భర్త రామస్వామినాయక్ బెంగళూరు వలస వెళ్లాడు. రోజుకు రూ.250 కూలీ వస్తుంది. కూతురు, కొడుకు చిన్నవాళ్లు కావడంతో వాళ్లను చూసుకునేందుకు నేను ఇంటివద్దే ఉండిపోయా.
- నిర్మలాబాయి, డి.గంగంపల్లి చిన్నతండా

బిచ్చమెత్తుకుంటున్నారు
మా గ్రామంలో చాలామంది మహిళలు హైదరాబాదుకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. రంజాన్ వస్తే బురఖాలు వేసుకుని భిక్షమెత్తుకుంటారు. వాళ్లిచ్చే దానం డబ్బు, బియ్యం కూడబెట్టుకుని ఇంటికొస్తారు.
-డి.గంగంపల్లి తండా మహిళలు

చిత్రాలు..అనంతపురం జిల్లా గోరంట్ల మండలం డి.గంగంపల్లితండాలో జనం వలస వెళ్లడంతో ఖాళీగా ఉన్న ఇళ్లు
*కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న గంగంపల్లితండా