ఆంధ్రప్రదేశ్‌

ఆ ‘అయిదు’ ఫలితాలపై అప్రమత్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 17: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమవుతోంది. మణిపూర్, పంజాబ్, యుపి, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటమిపాలవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. రానున్న కర్నాటక ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్థానంలో బిజెపి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బిజెపిలో దూకుడు పెరుగుతుండటాన్ని గ్రహించిన తెదేపా నాయకత్వం, రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై బిజెపి దక్షిణాదిపైనా దృష్టి సారిస్తుందన్న విషయాన్ని పసిగట్టిన బాబు, ఆ మేరకు ఆ పార్టీతో అన్ని స్థాయుల్లోనూ మరింత సఖ్యతగా ఉండాలని భావిస్తున్నారు. రెండురోజుల క్రితం జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షలో తొలిసారిగా ఆయన బిజెపితో గొడవలు పడవద్దని, వచ్చే ఎన్నికల్లోనూ కమలంతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్న విషయాన్ని వెల్లడించారు. అదే సమయంలో ఇప్పటివరకూ జిల్లా నుంచి మండల స్థాయి వరకూ బిజెపి నేతలకు ప్రాధాన్యం ఇవ్వని వైనం గుర్తించిన నాయకత్వం, ఇకపై తన వ్యూహం మార్చుకోవాలని భావిస్తోంది. బిజెపి కార్యకర్తలకు పనులు చేయకపోవడంతోపాటు, వారికి కేటాయించి రేషన్ దుకాణాల నుంచి ఇతర సౌకర్యాలు తొలగించడం, అగ్రనేతలకు గతంలో ఉన్న గన్‌మెన్లను తొలగించడం వంటి చర్యలతో బిజెపికి తెదేపాకు క్షేత్రస్థాయిలో దూరం పెరిగేందుకు కారణమయింది. జాతీయ స్థాయిలో బాబుకు బిజెపి అగ్రనేతలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ తమను లెక్కచేయని వైనంపై చాలామంది బిజెపి సీనియర్లు తెదేపా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా వెంకయ్యనాయుడుతో ఉన్న సంబంధాల కోణంలో బాబు రాష్ట్ర నేతలను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్న పలువురు సీనియర్లు బాబు ప్రభుత్వ విధానాలను సమయం వచ్చినప్పుడల్లా తూర్పారపడుతున్నారు. ఇటీవల పురంధ్రీశ్వరి కూడా ఎన్నికల నాటికి పొత్తులు ఎలా ఉంటాయో తెలియదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానికితోడు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్నా వాటి గురించి ప్రచారం చేయన వైనంపై ఆగ్రహంతో ఉన్న బిజెపిలోకి ఒక వర్గ నేతలు, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తమ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ, తమను ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని దేశం నాయకత్వం విశే్లషించుకుంది. ఈ ఫిర్యాదులకు కారణమైన కిందిస్థాయిలో రెండు పార్టీల వైరంతోపాటు దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడమే మంచిదని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దానితోపాటు, బిజెపిలో పురంధ్రీశ్వరి మినహా మిగిలిన నాయకులెవరితో పెద్దగా వ్యక్తిగత విభేదాలు లేనందున వారితోనూ సఖ్యతగా ఉండటం ద్వారా, స్థానికంగా తలెత్తే తలనొప్పులు తగ్గించుకుంటే ఎన్నికల నాటికి పూర్తి ధీమాతో వ్యూహరచన చేయవచ్చన్న ఆలోచన నాయకత్వంలో ప్రారంభమయిందని పార్టీ సీనియర్లు వివరిస్తున్నారు.
‘బిజెపి వాళ్లు ఇప్పుడు బలోపేతమవుతారు. ఇక్కడ పురంధ్రీశ్వరితో తప్ప మిగిలినవాళ్లతో మాకేమీ గొడవల్లేవు. వాళ్లంతా వాళ్ల పార్టీకోసం పనిచేస్తున్న వాళ్లే. అందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మాపై ఫిర్యాదు చేసే నాయకులకు కావలసింది గౌరవం. వాళ్ల జిల్లాల్లో చెప్పిన పనులు చేయడం. అది లేకపోవడం వల్లే వాళ్ల అహం దెబ్బతిని మాపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీన్ని మేము కూడా నెగటివ్‌గా తీసుకున్నందుకే సమస్యలు వస్తున్నాయి. రేపు వాళ్ల అవసరం మాకే ఎక్కువ ఉంటుంది. పైగా కార్పొరేషన్ ఎన్నికలూ ఉన్నాయి. మేమిద్దరం గొడవ పడితే వైసీపీకి లాభం. అందుకే బిజెపి నాయకులకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తే అసలు గొడవలే ఉండవుకదా? అప్పుడు రేపు ఎన్నికల్లో ప్రశాంతంగా కొత్త వ్యూహాలతో వెళ్లవచ్చు. లేకపోతే ఇదే తలనొప్పి ఉంటే మేమే దెబ్బతింటామ’ని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ తమ ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంతోపాటు, కొత్త పోలింగ్ టెక్నిక్కులను అమలుచేసిందుకే విజయం సాధించిందని గ్రహించిన తెదేపా నాయకత్వం, ఇక ప్రచారానికి పదునుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దానిపై దృష్టి సారించకుండా, కేవలం మీడియతో మాట్లాడి ఆరోజుకు సరిపెడుతున్నారే తప్ప, నేరుగా జనంతో మమేకం కావడం లేదన్న విషయాన్ని గ్రహించి, ఆ మేరకు కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించింది. పోలింగ్‌బూత్ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపడితే తప్ప, ప్రభుత్వ పథకాలు జనంలోకి వెళ్లవని గ్రహించి, ఆ మేరకు కార్యక్రమాలు రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.