ఆంధ్రప్రదేశ్‌

తీర భద్రతను నిర్లక్ష్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: తీర భద్రతను నిర్లక్ష్యం చేయడం వలనే ముంబై దాడులు సంభవించాయని, దీని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. మిషన్ 974 పేరిట విశాఖలో రెండు రోజులపాటు జరగనున్న నేషనల్ వర్క్‌షాప్‌లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టలేషన్ ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అన్న అంశంపై శనివారం చర్చ ప్రారంభమైంది. ఈ సదస్సుకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తీర ప్రాంత పోలీస్ అధికారులు, మెరైన్ పోలీస్ అధికారులు, పలువురు డిఐజిలు, మాజీ డిజిపిలు, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య తదితరులు హాజరయ్యారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (సిహెచ్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముంబై దాడులకు ముందు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలపైనే నేవీ దృష్టి సారించేదని అన్నారు. భద్రతా బలగాలన్నీ ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండేవని అన్నారు. ముంబై దాడుల తరువాత తూర్పు నౌకాదళంపై కూడా బాధ్యత పెరిగిందని చెప్పారు. అప్పటి నుంచి తీర ప్రాంత భద్రతకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. తీరం వెంబడి అత్యాధునిక ఆయుధాలతో కూడిన నౌకలు, సిబ్బంది ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో నిఘా లేకపోతే శత్రువులను నిరోధించలేమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై శిక్షణ చేపట్టాలని జైన్ సూచించారు. తూర్పు నౌకాదళం విశాఖ జిల్లా రాంబిల్లి వద్ద వ్యూహాత్మ నేవల్ బేస్ నిర్మిస్తోందని ఆయన చెప్పారు. గడచిన ఎనిమిది, పదేళ్ళల్లో తీర ప్రాంతంలో వాణిజ్యం పెరిగిందని ఆయన చెప్పారు. ఇందుకు అనుగుణంగా భద్రతను కూడా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.
హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ సముద్ర జలాల మీద సాగే స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు 1978లో కోస్ట్‌గార్డ్‌ను ఏర్పాటైందని, ఎల్‌టిటిఇలను నిరోధించేందుకు తమిళనాడు ప్రభుత్వం కోస్టల్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 2005 కోస్టల్ సెక్యూరిటీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకవచ్చామని చెప్పారు. తీర ప్రాంతంలో నేవీ మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసిందని, వీటిని పర్యవేక్షించేందుకు కొంతమంది ప్రత్యేకాధికారులను నియమించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 46 కోస్టల్ రాడార్లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మైనర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లలో నిఘా, భద్రత లోపాలు అధికంగా ఉన్నాయని, ముందు వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిఐడి అడిషనల్ డైరక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సేఫ్టీ, సెక్యూరిటీ ఇప్పుడు ఒక సవాలుగా మారిందని అన్నారు. ఇప్పటికీ భద్రతా దళాలపై ముష్కర సేనలు దాడులు జరుపుతునే ఉన్నాయని అన్నారు. భూ భాగం మీద ఉగ్రవాదులు జరిపే దాడులను ఎదుర్కోవడంలో మనం కొంత వరకూ విజయం సాధిస్తున్నామని అన్నారు. జల మార్గాల మీదుగా వచ్చే టెర్రరిస్ట్‌లను పసిగట్టి, వారిని మట్టుపెట్టడానికి మన దగ్గర సుశిక్షిత బలగాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారిందని అన్నారు. ముంబై దాడుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాం. అలాగే 2008లో బలిమెల రిజర్వాయర్‌లో సుమారు 30 మంది గ్రేహౌండ్ పోలీసులను మావోయిస్ట్‌లు మట్టుబెట్టారు. ఒక్క గ్రేహౌండ్స్ కమాండో మరణిస్తే, ఆ దళానికి భారీ నష్టం వాటిల్లినట్టే. ఒక్కసారిగా ఇంత మంది చనిపోవడం వలన గ్రేహౌండ్స్ భారీ మూల్యాన్ని చవి చూడాల్సి వచ్చిందని అన్నారు. మనం శాంతిని కాంక్షిస్తున్నా, శత్రు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయని, దీనిని ఎదుర్కొనేందుకు రాజకీయ నిర్ణయం కావాలని ఆయన సూచించారు. మాజీ డిజిపిలు ఎంవి కృష్ణారావు, కెసి రెడ్డి, విశాఖ నగర పోలీస్ కమిషనర్ యోగానంద, సిహెచ్‌ఎస్‌ఎస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కనె్నగంటి రమేష్ బాబు తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్