ఆంధ్రప్రదేశ్‌

కమిటీలే తప్ప.. చర్యలేవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: రాష్ట్రంలో విద్యార్థులకు సంవత్సరాది పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొనే్నళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర కొనసాగుతూ వస్తోంది. లీక్‌లు వెలుగుచూసినప్పుడు ప్రభుత్వాలు కమిటీ వేసి చేతులు దులుపుకోవడమే తప్ప సంబంధిత లీకువీరులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్య, ఉన్నత విద్యశాఖల్లో నెలకొన్న ఈ దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీక్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం కావటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 8 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే లీక్‌లు ఎక్కువగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. 2015లో బిఎస్సీ ఆఖరి సంవత్సరం గణితం పేపరు విశాఖలో లీకయింది. 2016లో బిఎస్సీ కెమిస్ట్రీ పేపరు కూడా లీకయింది. కొద్దిరోజుల క్రితం బిఎస్సీ ఆఖరి సంవత్సరం గణితం పేపరు లీక్ కావడంతో పరీక్షను రద్దుచేశారు. బొబ్బిలి కళాశాలలో ఒక పేపరుకు బదులు విద్యార్థులకు మరో పేపరు ఇచ్చారు. ఇక 100 మార్కులకు ఇవ్వాల్సిన పేపరును 70 మార్కులకే ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గత ఏడాది కూడా ఎయు పరిధిలో 75 మార్కులకు ఇవ్సాల్సిన పేపరును 100 మార్కులకు ఇచ్చారు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల ఈ నిబంధన పాటించకపోవడంతో అనుచిత సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక టెన్త్‌కు సంబంధించి మడకశిరలో పరీక్ష పేపరు లీక్ కాగా, 8, 9 తరగతులకు సంబంధించి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పేపరు కూడా లీక్ కావడం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినపుడు విచారణకు కమిటీని నియమించడం మినహా ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నివేదిక ఎప్పటిలోగా ఇవ్వాలి, నివేదికలో ఎవరిని బాధ్యులుగా చేశారు? అనే అంశాలు వెలుగుచూడకుండా పోతున్నాయి. ఒత్తిళ్ల కారణంగా ఇలా కమిటీలకే పరిమితం అవుతున్నారనే విమర్శలున్నాయి. గత మూడు సంవత్సరాల్లో లీకేజీల వ్యవహారాలపై వేసిన కమిటీల నివేదికలు, తీసుకున్న చర్యలను వెబ్‌సైట్‌లో ఉంచాల్సి ఉంది. తూతూమంత్రంగా కమిటీ వ్యవహారం ఉంటే లీక్‌లకు మరింత ఊతం ఇచ్చినట్లే అవుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.