ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల వేదికగా ఆళ్లగడ్డ రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 19 : ఫ్యాక్షన్ రక్కసితో అట్టుడికిన ఆళ్లగడ్డ రాజకీయాలు క్రమేణా నంద్యాలకు చేరుతున్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్‌లో నిర్వహించే ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ ప్రత్యర్థులైన భూమా, గంగుల కుటుంబాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయా పార్టీల నేతల ద్వారా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నంద్యాల శాసనసభా నియోజకవర్గ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. భారత రాష్టప్రతి ఎన్నిక జూలై నెలలో నిర్వహించాల్సి ఉండటంతో దేశ వ్యాప్తంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలు ఎక్కడా ఖాళీ లేకుండా ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దాంతో నంద్యాల స్థానానికి ఆగస్టు వరకూ గడువు ఉన్నా జూన్‌లోనే ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు సైతం అందుకు తగ్గట్లుగా కసరత్తు ప్రారంభించాయి. భూమా నాగిరెడ్డి వారసురాలిగా ఆయన చిన్న కుమార్తె నాగవౌనిక కాని నాగిరెడ్డి సోదరుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా వీరశేఖరరెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి కానీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భూమా కుటుంబాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గంగుల కుటుంబాన్ని రంగంలోకి దించడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన గంగుల ప్రభాకరరెడ్డి సతీమణి ఇందిర లేదంటే కుమారుడు బ్రిజేంద్రనాథరెడ్డి పోటీలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే నంద్యాలలో ముస్లిం ఓట్లను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న ముస్లిం నేతను పోటీ చేయించాలన్న ఆలోచన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.