ఆంధ్రప్రదేశ్‌

సైకిల్ స్పీడు వెనుక.. ‘ఆ నలుగురు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 20: స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తెలుగుదేశం పార్టీ విజయం వెనుక నలుగురు ఇన్చార్జి మంత్రుల కృషిని పార్టీ శ్రేణులు అభినందిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకమైన కడప ఎన్నికలపై మూడుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి లోకేష్ గత నెలరోజుల నుంచి గుంటూరు కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించారు. కడపకు ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నామని, చివరకు కుప్పంను కూడా కాదని ముందు పులివెందులకే నీళ్లిచ్చామని, ఈ ఎన్నికలో వైఎస్ కుటుంబాన్ని ఓడించి రాకపోతే, ఇక మీ జిల్లాను ఒదిలేస్తామని బాబు, లోకేష్ తీవ్రస్థాయిలో చేసిన హెచ్చరికలు కూడా ఫలించి, వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడపలో వైసీపీని చావుదెబ్బతీసేందుకు కారణమయ్యాయి. తెదేపాకు ప్రాణప్రతిష్ఠగా మారిన కడప అభ్యర్థి ఎంపికపై మొదట్లో పార్టీ నేతల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమయింది. దానితో తొలుత కొన్ని వర్గాలు అసంతృప్తితో సహాయ నిరాకరణ చేశాయి. దానితో పార్టీ వ్యూహంలో పదును తగ్గింది. పలువురు వైసీపీ నుంచి చేరినప్పటికీ పోలింగ్‌న క్రాస్ ఓటింగ్ చేస్తారన్న భయం పట్టుకుంది. దీనితో సమస్య తీవ్రతను గుర్తించిన నాయకత్వం అనుభవజ్ఞుడైన మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రంగంలోకి దింపింది. దానితో ఆయన ఒకవైపు తన సొంత నెల్లూరు జిల్లాలో ఎన్నికల వ్యూహం రచిస్తూనే, రోజూ కడప జిల్లాకు వెళ్లి అక్కడి సీనియర్లను బుజ్జగించారు. దానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. సీనియర్లను ఏకతాటిమీదకు తీసుకురావడంపైనే ఎక్కువ దృష్టి సారించిన సోమిరెడ్డి శిబిరాన్ని పాండిచ్చేరికి తరలించిన తర్వాత, అక్కడ ప్రజాప్రతినిధులు తప్పులు చేయకుండా రాజ్యసభ ఎన్నికల మాదిరిగా కోడ్ విధానం తెరపైకి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో నిర్వహించిన మాక్ పోలింగ్‌లో అనుకున్నట్లుగానే కొందరు సభ్యులు పొరపాటు చేసిన క్రమంలో కోడ్ ఆధారంగా ఎవరు తప్పు చేశారో వెల్లడించడం ద్వారా, అందరినీ దారిలోకి తీసుకువచ్చారు. అదే సమయంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అధికార మార్పిడి వ్యవహారం రెండు వర్గాల మధ్య విబేధాలకు దారితీసి, దాని ప్రభావం ఎన్నికలపై పడిన నేపథ్యంలో ఇరు వర్గాలతో చర్చించి ప్రస్తుత చైర్మన్ రాజీనామా చేయించడం ద్వారా సమస్క పరిష్కరించారు. అటు నెల్లూరు జిల్లాలో కూడా పార్టీ వర్గాలను సమన్వయం చేయడంలో సోమిరెడ్డి సఫలీకృతులయ్యారు. గత ఎన్నికల్లో కర్నూలు ఎన్నికల్లో ఇదే విధానం అవలంబించడం ద్వారా పార్టీ అభ్యర్ధిని గెలిపించిన సోమిరెడ్డి, ఇప్పుడు కడప ఎన్నికల్లోనూ కీలక పాత్ర నిర్వహించారు. సోమిరెడ్డి సమన్వయం ఫలితంగా పార్టీ ఖాతాలో తొలిసారిగా కడప జమయింది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు నెల్లూరు జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, సోమిరెడ్డి, ఆనం, ఆదాలతో నెలరోజులు అవిశ్రాంతంగా పనిచేసి, పార్టీ అభ్యర్ధి వాకాటిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సహకారంతో ఆయన అటు నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా స్థానిక సంస్థలు, టీచర్-గ్రాడ్యుయేట్ ఎన్నికలను సమన్వయపరుస్తూనే, ఇటు తన సొంత ప్రకాశం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఎక్కడెక్కడో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను తీసుకువచ్చేందుకు ఆయన సొంత ఖర్చుతో ప్రత్యేక యంత్రాంగమే ఏర్పాటుచేశారు. ఒకవైపు సొంత ప్రకాశంతోపాటు, ఇన్చార్జిగా ఉన్న నెల్లూరు జిల్లా బాధ్యతలతోపాటు, మహాబలిపురంలో నిర్వహించిన శిబిరానికీ హాజరయి, మాక్ పోలింగ్‌లో తగిన సూచనలిచ్చి నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కాగా, పార్టీకి సవాల్‌గా మారిన కడప స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయంలో ఇన్చార్జిమంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య భూమిక పోషించారు. నెలరోజుల నుంచీ ఆయన వ్యూహరచనలో కీలకపాత్ర పోషించారు. ఓటర్లను పార్టీలో చేర్పించడం, చేరిన వారిని సమన్వయపరచడంతోపాటు ముఖ్యమైన అన్ని విభాగాల్లోనూ గంటా కీలకపాత్ర పోషించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పు పొందారు. గంటా క్రియాశీల పాత్ర ఫలితంగా వైఎస్ కుటుంబానికి గుండెకాయ వంటి కడపను పట్టుకోగలిగారు. ఆయన ముఖ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సాయంతో పులివెందుల పైనే దృష్టి సారించారు. అభ్యర్ధిపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడంతోపాటు, మధ్యలో దూరంగా ఉన్న కొన్ని వర్గాలను పిలిపించి వారిని కూడా భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు. కడపలో వైఎస్ కుటుంబ ఓటమికి ఎంత ప్రాధాన్యం వచ్చిందో, అందులో కీలకపాత్ర పోషించిన గంటాకూ అంతే ప్రాధాన్యం వచ్చింది. ఫలితంగా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన గంటాను అభినందనలతో ముంచెత్తారు. ఇక కర్నూలు జిల్లాలో పార్టీ విజయానికి అక్కడి జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషి కూడా ఫలించింది. అక్కడ వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సహకారం, అనుభవంతో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో అచ్చెన్నాయుడు ముఖ్యపాత్ర పోషించారు. దాంతోపాటు ఇటీవల మృతి చెందిన భూమా వర్గీయులను సమన్వయం చేసుకోవడంలోనూ ఆయన సఫలీకృతులయ్యారు.