ఆంధ్రప్రదేశ్‌

గెలిచి ఓడామా! ఓడి గెలిచామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: ‘మనం గెలిచి ఓడామా? ఓడి గెలిచామా?’.. ఇదీ నేడు తెలుగుదేశం నేతల్లో సాగుతున్న అంతర్మథనం. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి మూడు సీట్లలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి టీచర్, పట్ట్భద్రుల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావడం షాకిచ్చింది. మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రధానంగా కడపలో ఘన విజయం మూటకట్టుకోవటంతో సోమవారం ఉదయం అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సంబరాలు చేసుకోగా, రాత్రికి వెలువడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో పరిస్థితి గంభీరంగా మారింది. ఈ ఓటమి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతంగా గుర్తించి దిద్దుబాటు చర్యలకు దిగకపోతే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు, సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన దానికి, ప్రజలు నేరుగా పాల్గొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకూ తేడా ఉన్న విషయాన్ని విస్మరించకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం 9 జిల్లాల పరిధిలో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో కొన్ని లక్షల మంది టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ముందు తొలిసారి ప్రత్యక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. దీంతో తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపతోనే సంతృప్తిచెందాల్సి వచ్చిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఒకరకంగా ఇవి శాంపిల్ ఎన్నికలు. స్థానిక ఎన్నికలంటే జెడ్పీటీసీల నుంచి కౌన్సిలర్ల వరకూ అందరినీ మేనేజ్ చేయవచ్చు. ఏదిచేసినా విజయం విజయమే. ఎన్నికల్లో ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా, లేదా? అన్నదే ముఖ్యం. కాబట్టి మా విజయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ప్రజలు నేరుగా ఓట్లేసిన టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో ఫలితాలు మొత్తం మాకు వ్యతిరేకంగా రావడమే ఇబ్బందికరం. అంటే ఉద్యోగులకు ఎంతచేసినా ఇంకా వారిలో టిడిపిపై వ్యతిరేకత పోలేదని తేలిపోయింది. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మేం మోసం చేశామన్న జగన్, ఆయన మీడియా ప్రచారాన్ని గ్రాడ్యుయేట్లు నమ్మి మాకు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. 9 జిల్లాల్లో మాకు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. దీనిపై ఆత్మవిమర్శ చేసుకోకపోతే మరింత నష్టపోతాం’ అని ఓ సీనియర్ నేత హెచ్చరించారు. ఈ రెండున్నరేళ్లలో భజనపరులు, కార్పొరేట్లు, దళారీలను పక్కకుపెట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని విశే్లషిస్తున్నారు. కాగా, టీచర్ నియోజకవర్గాల్లో తమకు బలం లేకపోయినా ఎందుకు పోటీ చేశామో, ఈ సలహా ఎవరిచ్చారో కూడా అర్థంకావడం లేదని పార్టీ నేతలు వాపోతున్నారు. వామపక్షాలకు మొదటి నుంచీ టీచర్లపై పట్టుందని, తాము ఆమేరకు టీచరు వర్గాలకు చేరవయ్యే ప్రయత్నాలు చేయలేకపోయామన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం కూడా కొంపముంచిదని విశే్లషిస్తున్నారు. నెల్లూరులో పట్ట్భారెడ్డిని అందరూ వ్యతిరేకించినా ఆయన మంత్రి నారాయణ మనిషి కాబట్టి ఎవరు చెప్పినా నాయకత్వం వినలేదని, ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినందున దానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరు కంటే పక్కనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే దానికి నారాయణ వైఫల్యం, శిద్దా వ్యూహవిజయమే కారణమని విశే్లషిస్తున్నారు. నారాయణ సూచించిన అభ్యర్థిపై వ్యక్తిగతంగా, పార్టీపరంగా వ్యతిరేకత ఉన్న విషయాన్ని పార్టీ సీనియర్లు చంద్రబాబు, లోకేష్ వద్ద వాదించినా ఫలితం కనిపించలేదని వాపోతున్నారు. ఈ ఎన్నికలతో నారాయణ సమర్థత ఏమిటో తెలిసింది కనుక కార్పొరేట్ల పనితనాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో నాయకత్వం చేసిన ఆలస్యం కూడా పార్టీని దెబ్బతీసిందంటున్నారు. ఆఖరి నిముషం వరకూ తేల్చకుండా నానే్చ ధోరణి వల్ల గెలిచే సీట్లు కూడా పోయాయంటున్నారు. చిత్తూరులో వాసుదేవనాయుడును ముందుగానే అభ్యర్థిగా ప్రకటిస్తే ఫలితం మరోలా ఉండేదని, చివరలో ప్రకటించినందునే ఓడిపోయారంటున్నారు.
ఇక ప్రకాశం-నెల్లూరులో పట్ట్భారెడ్డి బదులు బలిజ లేదా కమ్మ అభ్యర్థికి సీటిస్తే సునాయాసంగా గెలిచేవారని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలకు ఇన్చార్జిలుగా ఉన్న ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాలను ఖాతరు చేయలేదంటున్నారు. ఉత్తరాంధ్ర సీటు బిజెపికి ఇవ్వాలని ఆఖరి నిమిషంలో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే బిజెపి నేత సోము వీర్రాజు, తదితరులు ముందుజాగ్రత్త వహించి లకా 20 ఓట్లు నమోదుచేయించడం ద్వారా ఆ పార్టీ తెలివిగా వ్యవహరించిందని ఉత్తరాంధ్రకు చెందిన మరో టిడిపి నేత విశే్లషించారు. ఇదిలాఉండగా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాల పైనా చర్చ మొదలయింది. తమ అధినేత ఇటీవల ఎవరినడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థంకావడం లేదని, గతంలో ప్రతి అంశం పైనా అభిప్రాయాలు అడిగే బాబు ఇప్పుడు ఎవరినీ సంప్రదించడం మానేసి తాను అనుకున్నదే చేస్తున్నందున పార్టీ జయాపజయాలతో తమకు సంబంధం లేకుండాపోయిందని మరో సీనియర్ నేత విశే్లషించారు. తాజా ఫలితాలతో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు పార్టీకి, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు వెళ్లినందున ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. పథకాలు ప్రజల్లోకి వెళ్లకపోవడం, ప్రత్యర్థుల విమర్శలకు జవాబు ఇవ్వకపోవడం, ముఖ్యంగా కీలక అంశాలపై నాయకత్వం మునుపటిలా సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే తాజా ఫలితాలకు కారణమని స్పష్టం చేస్తున్నారు.