ఆంధ్రప్రదేశ్‌

బాబు ఇమేజీకి తమ్ముళ్ల డామేజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: చంద్రబాబు సీఎం అయితే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, అరాచకానికి తెరపడుతుందనుకున్న ప్రజల నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వమ్ము చేస్తున్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తమ నేతలు ప్రజాక్షేత్రంలో రెచ్చిపోతున్న తీరు పార్టీ పరువుతో పాటు చంద్రబాబు నాయుడు ప్రజల్లో సంపాదించుకున్న ఇమేజీని డామేజీ చేస్తున్నారనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తవౌతోంది. తాజాగా విజయవాడలో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టిడిపి ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రెండ్రోజుల క్రితమే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన నాగుల్‌మీరా చేసిన దాడి పార్టీ పరువు తీసిందన్న భావన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తవౌతోంది. రాష్ట్రంలో అక్రమ పద్దతుల్లో నడుస్తున్న ప్రైవేటు బస్సులపై సొంత పార్టీ ఎంపి కేశినేని చేసిన ఆరోపణ, తాజాగా నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణలు ఒకటే కావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం చేసిన ఆరోపణలు నిజమని నమ్మేందుకు కారణమయ్యాయని విశే్లషిస్తున్నారు. నిజాయతీపరుడిగా పేరున్న సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై తమ పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో చేసిన దాడి పార్టీని ఇరుకునపెట్టి విపక్షానికి అస్త్రం అందించిందంటున్నారు. ‘నందిగామలో అధికారిపై దాడి చేశారని ప్రభుత్వం జగన్‌పై కేసులు పెట్టించగా, మరిప్పుడు ఐపిఎస్, ఆయన గన్‌మెన్‌పై దాడి చేసిన వైనం అన్ని టీవీ చానళ్లలో ప్రసారమైంది. అయినా మేం ఎవరిపైనా కేసులు పెట్టలేదు. ఈ రెండింటినీ ప్రజలు గమనిస్తారు కదా. ఇలాంటి అవకాశాన్ని మనమే ప్రతిపక్షానికి ఇస్తున్నామ’ని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. కొద్దినెలల నుండి కోస్తా జిల్లాల్లో తమ పార్టీ నేతల విచ్చలవిడితనం వల్ల ఇతర వర్గాలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందన్న విపక్షాల ఆరోపణలను నిజం చేయడమే అవుతుందని అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, వారి వారసులు చేస్తున్న పంచాయతీలు, అరాచకాలతో ఇప్పటికే వివిధ వర్గాలు దూరవౌతున్నాయని, ఇలాంటి చర్యలతో ఉద్యోగులు కూడా పార్టీకి దూరం కావడం ఖాయమనే ఆందోళన వ్యక్తవౌతోంది. ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వైనాన్ని కొందరు సీనియర్లు గుర్తుచేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరికించేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేసి, తిరిగి వారికి క్షమాపణ చెప్పడంతో తాము దొరికిపోయినట్టుందని సీనియర్లు విశే్లషిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల దాదాగిరి చర్యలతో మొత్తం పార్టీనే ఇబ్బందుల్లో పడుతోంని ఇతర జిల్లాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల నేతలను నియంత్రించడంలో నాయకత్వం విఫలమవుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు పరిశీలిస్తున్న వారికి పార్టీ నేతలపై చంద్రబాబుకు పట్టు తప్పుతోందనే భావన ఏర్పడేందుకు దారితీస్తున్నాయంటున్నారు. కమిషనర్‌పై దాడి వ్యవహారంలో ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, తదితర నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేబదులు వారితో క్షమాపణ చెప్పించడం వల్ల సమస్యను తాత్కాలికంగా సర్దుబాటు చేసినా ఉద్యోగులు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను పోగొట్టటం కష్టమేనంటున్నారు. బాబును గెలిపిస్తే శాంతిభద్రతల పరిస్థితి బాగుంటుందని, రౌడీయిజానికి కళ్లెం వేస్తారని, సమైక్య రాష్ట్రం మాదిరిగానే నవ్యాంధ్రప్రదేశ్‌లో అందరికీ రక్షణ లభిస్తుందని విశ్వసించిన ప్రజల్లో ఇప్పుడు తమ నేతలే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే భావన పెరగటం పార్టీకి మంచిదికాదని, దీనిపై బాబు దృష్టి సారించకపోతే, ఈ అంశాన్ని ప్రతిపక్షం తనకు అనుకూలంగా వినియోగించుకోవటం ఖాయమని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.