ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పదవి దక్కక చింతమనేని అలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 2: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యం పశ్చిమగోదావరి జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టించింది. మంత్రివర్గ కూర్పులో తనకు స్థానం లభిస్తుందని భావించిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అలకబూనారు. చింతమనేనికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్న ఊహాగానాలు చాలా రోజుల నుంచి వినిపిస్తూ వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారన్న ప్రచారం కూడా మొదలైంది. వాస్తవానికి దెందులూరు నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేనికి తొలి విడత మంత్రివర్గ కూర్పులోనే అవకాశం లభిస్తుందని ఊహించినా ఆయన స్థానంలో అప్పుడు కూడా మరొకరికి అవకాశం ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఎలాగైనా ఈసారి మాత్రం మంత్రివర్గ బెర్త్ ఖాయమనుకున్న చింతమనేని వర్గాన్ని ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. ఈ పరిణామాల పట్ల చింతమనేని ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలోనే దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలను ఏలూరులోని జడ్పీ అతిధిగృహానికి పిలిపించారు. అక్కడ ముఖ్యులతో ఆయన సమాలోచనలు జరిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన పరిణామాలు తనను చిన్నబుచ్చుకునేలా చేశాయన్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య తాను పదవిలో కొనసాగలేనని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నానని, ప్రస్తుతం నేరుగా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. కాగా తాను ఏ పార్టీలోనూ చేరే సమస్యేలేదని, అంతగా అవసరమైతే తానే సొంతంగా పార్టీ పెడతానని చెప్పారు. అంతేతప్ప ఎవరి వద్దకు వెళ్లి దేహీ అంటూ అభ్యర్ధించనని స్పష్టం చేశారు. ఈ సమయంలో అనుచరులు కూడా మీరు లేకుండా మేం మాత్రం ఎందుకు వుంటామని ప్రశ్నించారు. మీతో పాటే మేము కూడా రాజీనామాలు చేస్తామని చెప్పారు. కాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, మరికొందరు కలిసి ప్రభాకర్‌ను చల్లబరిచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మాట్లాడుతూ చింతమనేని విషయంలో తమ స్నేహం అన్నింటికన్నా మించిందని, ఏం జరిగినా ఆయన్ను ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అనంతరం చింతమనేని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తన ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు. ఈ దశలో అధిష్ఠానం నుంచి ఫోన్ రావడంతో ప్రభాకర్ కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఆయన ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి రాజధాని వెళ్లారు. కాగా ఆదివారం సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శి ఇంటికి వెళ్లి మరీ చింతమనేని తన రాజీనామా లేఖను అందించారు. అనంతరం ఆయన సిఎం క్యాంపుకార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.