ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో మరో తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: ఏపి అవినీతి నిరోధక శాఖాధికారుల దాడుల్లో మరో అవినీతి తిమింగలం ఆస్తులు రట్టయ్యాయి. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఆర్జించిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఇడబ్ల్యూఐడిసి) చీఫ్ ఇంజనీరు భూమిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇళ్ళపై ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 16కోట్ల రూపాయల అక్రమాస్తులు కనుగొన్నారు. వీటి విలువ మార్కెట్ అంచనా ప్రకారం వందల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. జగదీశ్వర్‌రెడ్డితోపాటు భార్య, పిల్లలు, సన్నిహితుల పేర్లతో ఉన్న ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న స్థిర, చరాస్తులు గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. ఏపి ఏసిబి కేంద్ర దర్యాప్తు బృందం డిఎస్పీ రమాదేవి నేతృత్వంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన భూమిరెడ్డి జగదీశ్వరరెడ్డి (59) ఏపి పంచాయతీరాజ్ శాఖలో చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. కాగా ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఏపి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఇడబ్ల్యూఐడిసి)లో చీఫ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలో 1980 మే 22వ తేదీన ప్రవేశించిన జగదీశ్వరరెడ్డి పంచాయతీరాజ్ శాఖ రూరల్ వాటర్ సప్లై జూనియర్ ఇంజనీరుగా తొలి పోస్టింగ్ నిర్వహించారు. తెలంగాణాలోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, తదితర చోట్ల పని చేశారు. ప్రస్తుతం ఏపిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఈయన విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పని చేస్తుండగా కుటుంబం హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట శ్రీనివాసనగర్ కాలనీలో నివాసముంటోంది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు కొద్దికాలంగా ఈయనపై ఏసిబి అధికారులకు ఫిర్యాదులు అందాయి. డిఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిబ్బంది సోమవారం విజయవాడలోని కార్యాలయంతోపాటు హైదరాబాద్ నివాసం, మహబూబ్‌నగర్ జిల్లా, చెన్నై, నల్గొండ, సూర్యాపేట తదితర చోట్ల సోదాలు నిర్వహించారు.
భార్య హైమావతి పేరుతో హైదరాబాద్ పంజాగుట్టలో 20లక్షలు విలువ చేసే 2120 చ.అడుగుల ఫ్లాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో పది లక్షలు విలువైన నాలుగువేల చదరపు అడుగుల కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 30 లక్షలు విలువ చేసే ఐదువేల చదరపు గజాల ఇల్లు, పది లక్షలు విలువైన నిర్మాణంలో ఉన్న భవనం గుర్తించారు. పెద్ద కుమార్తె ఇందిరా ప్రియదర్శిని అలియాస్ విజయ పేరుతో హైదరాబాద్ శ్రీనివాసనగర్ కాలనీలో కోటి రూపాయలు విలువ చేసే పెంట్ హౌస్, మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు చోట్ల సుమారు కోటి రూపాయలు విలువ చేసే 30.49 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కొనుగొన్నారు. రెండో కుమార్తె స్నిగ్ధ పేరుతో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో 87లక్షల 50వేల రూపాయలు విలువైన ఫ్లాటు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం అజ్జకొల్లు గ్రామంలో సుమారు 35లక్షలు విలువైన పది ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. మూడో కుమార్తె రవళి పేరుతో మహబూబ్‌నగర్‌లోనే సుమారు 13లక్షలు విలువైన పది ఎకరాల వ్యవసాయ భూమిని కనుగొన్నారు. వీటితోపాటు ఇన్నోవా కారు, 250 గ్రాముల బంగారం, పది కేజీల వెండి, 83వేల రూపాయలు నగదు, 12లక్షలు విలువైన పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్వర్‌రెడ్డి, ఆయన కుమార్తెల పేరు మీద హైదరాబాద్‌లోని ఆంధ్రాబ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, విజయబ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరిచారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిజి ఆర్‌పి ఠాకూర్ తెలిపారు.