ఆంధ్రప్రదేశ్‌

పక్షం రోజుల్లో ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వారాల్లో రాజధానికి తుది డిజైన్లు
పరిపాలనా నగరంపై కసరత్తు
మార్పులు, చేర్పులు సూచించిన సిఎం చంద్రబాబు

విజయవాడ, మే 22: రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పరిపాలనా నగరం తుది డిజైన్లను మరో రెండువారాల్లో నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి, ఒక అవగాహనకు వచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు, చేర్పులు సూచించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడం లేదని దాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండేలా చూడాలని నిర్దేశించారు. వీటికి నడుమ అమరావతి నగరమంతా వీక్షించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సచివాలయం, హెచ్‌ఓడిల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరం పూర్తిగా ప్రభుత్వ సొత్తు అని, ప్రైవేట్ ఆస్తులకు ఎక్కడా చోటులేదన్నారు. అన్ని రకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని ప్రస్తుతం నిర్ణయించిన కనె్వన్షన్ సెంటర్ సమీపంలోనే నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాల్ ఉండాలని అన్నారు. నగరానికి రెండువైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ బస్‌వేల గురించి ముఖ్యమంత్రికి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు.
ఓవైపు పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కనె్వన్షన్ సెంటర్, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్యకూడలి, పార్కులు ఉండాలంటూ తన ఆలోచనలను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని, న్యాయ నగరానికి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలపైనా చర్చ జరిగింది. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం రానుంది.

చిత్రం... నార్మన్ ఫోస్టర్ సంస్థ అందజేసిన డిజైన్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు