ఆంధ్రప్రదేశ్‌

మందుపై ప్రచారం బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: ‘మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా చూడటం లేదు!’.. ఇది తరచుగా ఆబ్కారీ శాఖ మంత్రి చేసే ప్రకటన. అక్రమ మద్యాన్ని నిరోధించేందుకు మాత్రమే మద్యం విక్రయాలపై దృష్టి పెట్టామంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తున్నప్పటికీ మద్యం వల్ల కలిగే చెడు ఫలితాలపై ప్రచారం చేసేందుకు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. మద్యం మహమ్మారికి అనేక కుటుంబాలు బలైపోతూ రోడ్డున పడుతున్నప్పటికీ కనీస స్థాయిలో ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సు ఫీజులు, మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు 13 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తోంది. వివిధ పన్నుల చెల్లింపుల తరువాత 3600 కోట్ల రూపాయల మేర నికరంగా ఆదాయం వస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి స్వయంగా ఇటీవల ప్రకటించారు. అయితే కల్తీ మద్యం, మద్యం తాగడం వల్ల కలిగే దుష్ఫలితాలపై కూడా ప్రజలను జాగృతం చేయాల్సి ఉంది. ఇందుకు ఆ శాఖ కేవలం 1.4 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మద్యం వల్ల నాశనమవుతున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కనీస ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ మొత్తాన్ని 13 జిల్లాల్లో జాగృతం చేసేందుకు ప్రకటనల కోసం ఖర్చు చేస్తారు. 4 లక్షల కరపత్రాలు, 1.5 లక్షల గోడపత్రికలు, 15 వేల క్యాలెండర్లు ముద్రించి ఆ శాఖ డిప్యూటీ కమిషనర్లకు ప్రచారం కోసం పంపుతారు. అయితే వీటి పంపిణీ, ప్రచారం ఎక్కడ జరుగుతుందన్నది చిదంబర రహస్యం! మద్యపానం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆ శాఖ అనేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మద్యపాన బానిసలుగా మారిన వ్యక్తుల్లో మార్పు కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన సమాచారం ప్రకటనల ద్వారా తెలియచేయాల్సి వుంది. ఈ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేసిందీ ఆబ్కారీ శాఖ సిబ్బందికి కూడా తెలియదేమో! ఆ కార్యాలయంలో వైద్య సలహాదారు, ఒక ఎన్జీవోను ఏర్పాటు చేసి ప్రతి శనివారం తాగుడుకు బానిసలైన వారికి కౌనె్సలింగ్ నిర్వహించాలి. ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో గ్రామసభలు, ర్యాలీలు నిర్వహించి మద్యపాన ప్రభావాన్ని తెలియచేసే ప్రయత్నం చేయాలి. మొదటి శనివారం ర్యాలీ, రెండో శనివారం, శుక్రవారం మద్యపాన ప్రభావంపై వ్యాస రచన, చిత్రలేఖన పొటీలు నిర్వహించాలి. మూడో శనివారం గ్రామసభలో మద్యపానం వల్ల ప్రతికూల ప్రభావంపై చర్చించాలి. నాలుగో శనివారం జిల్లాస్థాయిలో డిప్యూటీ కమిషనర్ సభ ఏర్పాటు చేసి చెడు ప్రభావాల గురించి వివరించాల్సి వుంది. కానీ ఇవి ఎక్కడా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. మద్యపానం వల్ల కెరీర్‌ను కోల్పోతున్న యువత, నాశనమవుతున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేయాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా మద్యానికి టార్గెట్లు ఇచ్చి మరీ విక్రయించే ప్రయత్నం జరుగుతోంది. లక్ష్యాన్ని చేరుకోని అధికారులపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేయడం మరో వైపరీత్యం. మద్యం విక్రయాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో ఉపాధి పనుల ద్వారా లభించిన వేతనంలో ఎక్కువ భాగాన్ని బడుగు వర్గాలవారు మద్యం కోసం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం అమ్మకాల లక్ష్యంతో పాటు దుష్ప్రభావాలపై ప్రచారం కూడా అంతే విస్తృతంగా చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.