ఆంధ్రప్రదేశ్‌

పొగ పెట్టిన ‘పెండింగ్’ పాలసీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నాయకత్వం అనుసరిస్తోన్న అలసత్వ విధానం పార్టీ కొంపముంచుతోందన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో పెరుగుతోంది. ఎప్పటి నిర్ణయాలు అప్పుడు తీసుకోకుండా సమావేశాలు, రాయబారాల పేరుతో చేస్తున్న కాలయాపన, చేతులు కాలిన తర్వాత చర్యలకు దిగుతున్న తీరు బలమైన నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు దోహదపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న నాన్చుడు విధానానికి విసిగి వేసారి పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరుతున్నట్లు చేసిన ప్రకటన టిడిపి నాయకత్వానికి షాక్ కలిగించింది. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ధిత్వంపై చాలాకాలం నుంచీ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. శిల్పాకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందన్న విషయం కూడా నాయకత్వానికి తెలుసు.
తనపై తన వర్గీయుల ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నందున ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని, లేకపోతే తానే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ఆయన బాబుకు స్పష్టంగా చెప్పారు. నిజానికి అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచే శిల్పా బ్రదర్స్‌లో అసంతృప్తి మొదలయింది. అందుకే పార్టీ నాయకత్వం జిల్లా పార్టీ అధ్యక్షుడైన శిల్పా చక్రపాణిరెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి అసంతృప్తి పోగొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందడంతో ఆయన కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆమె నంద్యాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. ఇది నచ్చని శిల్పా మోహన్‌రెడ్డి అనేకసార్లు బాబుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు శిల్పా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో అప్రమత్తమైన నాయకత్వం ఆయనతోపాటు అఖిలప్రియను పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. బాబు వారితో విడి విడిగా కూడా మాట్లాడారు. తన సోదరుడైన బ్రహ్మానందరెడ్డికి సీటు ఇవ్వాల్సిందేనని అఖిల పట్టుపట్టగా, తన వర్గాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా సిద్ధమేనని శిల్పా స్పష్టం చేశారు. దానితో తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని, అప్పటివరకూ ఎవరూ తొందరపడవద్దని బాబు చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, రోజురోజుకూ తనపై ఒత్తిళ్లు పెరుగుతుండటం, బాబు మంత్రి అఖిలకే ప్రాధాన్యం ఇస్తున్నారని గ్రహించడంతో శిల్పా వైసీపీ వైపు అడుగులు వేశారు. ఈ మొత్తం పరిణామాలకు పార్టీ నాయకత్వమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శిల్పాకు ఇవ్వనప్పుడు ఆ విషయం ముందుగానే చెబితే సరిపోయేదని, దానికి ఇంతకాలం నాన్చాల్సిన పనిలేదని స్పష్టం చేస్తున్నారు. శిల్పానే నంద్యాలలో సరైన అభ్యర్థి అని, అఖిల సూచించిన బ్రహ్మానందరెడ్డికి స్థానికంగా బలం లేదని, భూమా నాగిరెడ్డి సానుభూతి ఉప ఎన్నికలో అక్కరకు రాదని పార్టీ వర్గాలు నాయకత్వానికి స్పష్టం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అవలంబించిన నాన్చుడు ధోరణే దీనికి కారణమని సీనియర్లు విశే్లషిస్తున్నారు. వర్గ రాజకీయాలతో నడిచే కీలక నేతలపై స్థానికంగా అనేక ఒత్తిళ్లు ఉంటాయని, ఆ విషయం తెలిసి కూడా బాబు నంద్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని వైనమే శిల్పా రాజీనామాకు కారణమంటున్నారు. ఇప్పటివరకూ టిటిడి, శాప్ వంటి నామినేటెడ్ పదవులను భర్తీ చేయని వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అటు కడపలో రామసుబ్బారెడ్డి, ప్రకాశం కరణం-గొట్టిపాటి వ్యవహారం కూడా సాగదీస్తున్న క్రమంలో అక్కడి నాయకులు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో కూడా త్వరలో సంచలన ప్రకటనలు ఉండవచ్చంటున్నారు. కాగా, పార్టీలో అసంతృప్తిపరులపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్న విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు, పార్టీకి ఎక్కువ సేపు సమయం కేటాయించకపోవడం, కొంపమునిగిపోయే ముందు మేల్కొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ దెబ్బతింటోందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.