ఆంధ్రప్రదేశ్‌

పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. నాలుగేళ్లుగా నలుగుతున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక ప్రాజెక్టు పట్టాలెక్కడమే మిగిలిందన్న భావన వ్యక్తమవుతోంది. విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టును మూడు కారిడార్లుగా రూ.13,500 కోట్లతో చేపట్టాలన్న ప్రతిపాదనకు మోక్షం కలిగింది.
మూడేళ్లుగా ఊరిస్తున్న విశాఖ మెట్రోరైల్‌ను పక్కనపెట్టి, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చదన్న భావం వ్యక్తమైంది. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు విశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైల్ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ప్రభుత్వాలు మారడంతో ప్రాధాన్యతలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో విశాఖ స్థానే విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు వేగవంతం అవుతున్నాయి. విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి విదితమే. తొలుత రూ.6000 కోట్లతో 20 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టాలని భావించారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడం, గుంటూరు - విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు నిర్ణయం చకచకా జరిగిపోయాయి. దీంతో రాజధాని అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడకు మెట్రోరైల్ ప్రాజెక్టు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. అప్పటికే విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాధమిక సర్వే సహా డిపిఆర్ రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)కి ప్రభుత్వం అప్పగించింది. తొలుత అనుకున్నట్టు విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును 20 కిమీ నుంచి 43 కిమీకి పొడిగించారు. మూడు కారిడార్లుగా దీన్ని ఏర్పాటు చేయాలని, అందుకు రూ.13,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గాజువాక నుంచి కొమ్మాది వరకూ 30.38 కిమీ ఒకకారిడార్‌గాను, గురుద్వార నుంచి పాతపోస్ట్ఫాస్‌కు 5.92 కిమీ మేర రెండో కారిడార్‌ను, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.9 కిమీ మేర మూడో కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌లో భోగాపురంలో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించాలని కూడా ప్రతిపాదించారు. మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి భౌగోళిక, తదితర సర్వేలను పూర్తి చేశారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయంలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం, మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, మిగిలిన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం అప్పట్లో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జెఐసిఎ) విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో జెఐసిఎ మెట్రోరైల్ ప్రాజెక్టులో పెట్టుబడులపై వెనక్కు తగ్గింది. దీంతో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ఆశలు గల్లంతవుతున్న తరుణంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే జర్మనీ ఆర్థిక సంస్థ మాత్రం రాష్ట్రంలో మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి విజయవాడకే ప్రాధాన్యత ఇచ్చిందని, గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించించడం ఇక్కడ కొసమెరుపు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.