ఆంధ్రప్రదేశ్‌

అంతటా నిబంధనల ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: విజయవాడలోని నారాయణ, చైతన్య సహా దాదాపు 20 కార్పొరేట్ పాఠశాలల్లో శనివారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు జరిపాయి. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూళ్లు, అర్హతలు లేని టీచర్ల నియామకాలు, స్టోర్స్ ఏర్పాటుతో వ్యాపారాలు, తరగతి గదుల్లో కిక్కిరిసిన విద్యార్థులు, తదితర అభియోగాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కృష్ణా ఎస్‌పి రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు డిఎస్‌పి ఆర్ విజయ్‌పాల్ నేతృత్వంలో ఐదు బృందాలు దాదాపు 25 పాఠశాలల్లో తనిఖీలు జరిపాయి. తొలిసారిగా జరిగిన ఈ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు బట్టబయలయ్యాయి. వీటన్నింటినీ నమోదు చేసుకుని యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌చే సంతకాలు చేయించుకుని అధ్యయనం నిమిత్తం విజిలెన్స్ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే విద్యాశాఖకు సంబంధించి జీవోఎంఎస్ నెం.1, 42ల్లో గుర్తింపు పొందిన పాఠశాలలు అనుసరించాల్సిన నియమ నిబంధనలున్నాయి కానీ నిషిద్ధ అంశాలు ప్రస్తావన మాత్రం లేదు. దీనిని కొన్ని యాజమాన్యాలు ఇంతకాలం తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజిలెన్స్ డిఎస్‌పి విజయ్‌పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐదు బృందాల్లోనూ ఒక్కో బృందంలో ఒక్కో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. ప్రధానంగా అత్యధిక పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్ నడుస్తున్నాయి. వాటిల్లో లక్షలాది రూపాయల మేర వ్యాపారం జరుగుతున్నది. నిబంధనల ప్రకారం తమ విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్‌ను ముద్రించి విక్రయించుకోవచ్చు. అయితే వెలుపలి కంపెనీలు ఉత్పత్తి చేసే బూట్లు, బ్యాగ్‌లు, నోట్ పుస్తకాలు, జామెంట్రీ బాక్స్‌లు వంటి వాటిని అత్యధిక ధరలకు విక్రయిస్తుండటం కన్పించింది.
ప్రధానంగా నిబంధనల మేరకు వసూలుచేసే ఫీజుల వివరాలతో కూడిన బోర్డులను వెలుపల అందరికీ కన్పించేలా ప్రదర్శించాలి. అయితే ఏ ఒక్క విద్యాసంస్థలోనూ అలాంటి బోర్డులు కన్పించలేదు. పైగా పలు సంస్థలు అడ్మిషన్ కోసం భారీఎత్తున డొనేషన్లు వసూలు చేస్తున్నాయనే అభియోగాలు తల్లిదండ్రుల నుంచి వినవచ్చాయి. నిబంధనల ప్రకారం కిండర్ గార్డెన్ తరగతుల్లో 40 మంది విద్యార్థులు ఆపై తరగతుల్లో సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు ఉండాల్సి రాగా పలు పాఠశాలల్లో 50 మందికి పైగా ఉండటం కళ్లారా కన్పించింది. ఇక ఈ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల అర్హత గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేనివారు సైతం పనిచేస్తుండటం కన్పించింది. అత్యధిక పాఠశాలలకు క్రీడా స్థలాలు లేవు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. కనీస వౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక లోపాలు విజిలెన్స్ తనిఖీల్లో కొట్టొచ్చినట్లు కన్పించాయి.

చిత్రం.. ప్రైవేటు పాఠశాలలో స్టోర్స్‌ను తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు