ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిర్వాసితులకు గుండెకోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: పోలవరం నిర్వాసితులు ఎడాపెడా అన్యాయానికి గురవుతున్నారు. అధికార యంత్రాంగం గతంలో నిర్వాసితుల భూములను సర్వేచేయకుండా పరిహారాన్ని నిర్ధారించడంతో క్షేత్రస్థాయిలో లెక్కలకు పొంతన కుదరక నష్టపోతున్నారు. క్షేత్ర స్థాయి భూములకు, అధికారుల రికార్డులకు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న భూములకు పొంతన లేకుండావుంది. ఫలితంగా భూములకు రికార్డుల్లో ఉన్నమేర మినహా క్షేత్ర స్థాయిలో ఉన్నట్టుగా పరిహారం అందడంలేదు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో అధికారుల నిర్వాకం బయటపడుతోంది. పాత సర్వే రికార్డుల ప్రకారం భూములకు పరిహారం చెల్లిస్తున్నారని, దీనివల్ల చాలా నష్టపోతున్నామని నిర్వాసితులు గ్రామసభల్లో గగ్గోలు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూముల వివరాలు ఒక విధంగా వుంటే..సాగులో ఉన్న భూమి మరోలావుంటోంది. అధికారులు రికార్డుల ప్రకారమే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వాస్తవంగా నిర్వాసితులు కోల్పోతున్న భూమికి, వారికి చెల్లించే పరిహారానికి పొంతన కుదరడంలేదు. అధికారులు ఇచ్చినంత పరిహారం తీసుకోవాల్సిందే అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. సర్వేచేసి భూమిని కొలిచి, వాస్తవ విస్తీర్ణం మేరకు పరిహారం ఇవ్వాలని ఎవరైనా అభ్యంతరం తెలిపితే, అటువంటి వారికి పరిహారం చెల్లించకుండా పక్కనబెడుతున్నారు. ఇదంతా ఎందుకొచ్చిందిలే అన్నట్టుగా అధికారులు చెప్పినట్టుగా ఇచ్చినంత తీసుకుని వెళ్తున్నారు. అధికారులు లెక్కల్లో వున్న భూములకే పరిహారం లెక్కకట్టి ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. పోలవరం ఎడమ కాల్వ కోసం సేకరించిన భూముల్లో శంఖవరం మండలంలో రెవెన్యూ రికార్డుల్లో ఒక విధంగా వుంటే, పరిహారం తగ్గించి ఇచ్చారని నిర్వాసితులు వాపోతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆరెంపూడి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 29లో ఎకరం పట్టా భూమి వుంటే, నోటిఫికేషన్ ప్రకారం 70 సెంట్లకే పరిహారం అందజేశారు. ఇలా నోటిఫికేషన్‌లో ప్రకటించిన విస్తీర్ణానికి, పట్టాల్లో వున్న విస్తీర్ణానికి పొంతనలేని స్థితి కేసులు ఎనె్నన్నో బయటపడుతున్నాయి. అలాగే నిర్వాసితుల సామాజిక సర్వే సక్రమంగా జరగలేదని తెలుస్తోంది. ఇళ్లకు నష్టపరిహారం లెక్క కట్టడం సరిగా జరగలేదని బాధితులు పేర్కొంటున్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన వారికి పునరావాస ప్యాకేజీ వర్తింపజేయకపోవడంతో మోసానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రాజెక్టు కోసం భూములు సేకరించిన దాదాపు పదేళ్లు దాటిన తర్వాత పునరావాసం పంపిణీకి చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం మండలాల్లో కొన్ని గ్రామాలను ఎపుడో నేలమట్టం చేశారు. గ్రామాలు ఖాళీ చేయించి పదేళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పునరావాస ఇళ్ళను నిర్మించలేకపోయారు. ఉదాహరణకు దేవీపట్నం మండలంలో ముందుగా ఖాళీ చేయించిన 7 గ్రామాల్లో 899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి వుంది, ఇప్పటి వరకు 200 ఇళ్లు మాత్రమే నిర్మించారంటున్నారు. దేవీపట్నం మండలంలో నాలుగు దశల్లో పరిహారం అందించడానికి సర్వే నిర్వహించారు. ఈ మండలంలో మొత్తం 7881 కుటుంబాల వారు నిర్వాసితులవుతున్నారు. దాదాపు 51వేల ఇళ్లు కట్టాల్సివుంది. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంది.
ఇక దేవీపట్నం మండలంలో 42 గ్రామాలకు భూమికి భూమి ఇవ్వాల్సి వుంది. నేటికీ ఒక గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో భూమికి భూమి ఇవ్వలేదు. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దేవీపట్నం, పోలవరం మండలాల్లో నేటి వరకు పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తికాలేదు. కొండపోడు భూములకు, డి పట్టా భూములకు జిరాయితీ భూములకిచ్చే రేటు ఇవ్వాలని, అటవీ హక్కులను కాపాడాలని కోరుతున్నారు. గిరిజనులు, గిరిజనేతరుల ఇళ్ళకు రూ.5లక్షల చొప్పు న ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. అలాగే గతంలో పాత చట్టం ప్రకారం ఎకరాకు రెండు లక్షల లోపు పరిహారాన్ని ఇచ్చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం పదేళ్లు దాటిపోంది కాబట్టి కొత్త చట్టం ప్రకారం సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అధికార యంత్రాంగం సక్రమంగా పరిహారాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, భూములను తాజాగా సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితుల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండు చేస్తున్నారు.