ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు కోర్టుకు అగ్రిగోల్డ్ నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూన్ 20: ఆర్ధిక నేరాలకు పాల్పడి డిపాజిటర్ల వద్ద అక్రమంగా నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, వైస్ చైర్మన్ అవ్వా వెంకటనరసింహరావు, ఇడి ఎహెచ్‌ఎస్‌వి ప్రసాద్‌లతోపాటు మరో తొమ్మిదిమంది డైరక్టర్లు మంగళవారం ఒంగోలులోని జిల్లాకోర్టుకు హాజరయ్యారు. హాజరైన డైరక్టర్లల్లో ఎస్ శ్రీనివాసరావు, ఇఎస్‌ఎస్‌వి ప్రసాద్‌రావు, పిఎల్‌ఏ ఖాన్, కెఎస్ రామచంద్రరావు, కిశోర్, ఉదయభాస్కర్, సాయిరాం, బాబురావు, మణిశర్మ ఉన్నారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతోపాటు మరో ఏడుగురు ఏలూరు జిల్లా జైలు నుండి, మరో నలుగురు నెల్లూరు జిల్లా జైలునుండి భారీబందోబస్తుమధ్య ఒంగోలులోని జిల్లాకోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. ఉదయం 11.45గంటలకు జిల్లాకోర్టుకు చేరుకున్న అగ్రిగోల్డ్ యజమాన్యాన్ని 1.50గంటలకు జిల్లా జడ్జి ప్రియదర్శిని ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కేసును పరిశీలించిన ఆమె వచ్చేనెల నాల్గవతేదీకి వాయిదావేశారు. ఆర్ధికనేరాలకు, మోసాలకు పాల్పడ్డారనే అభియోగంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ యజమాన్యంపై కేసులు నమోదు అయ్యాయి. 7500కోట్లరూపాయలు మోసం చేసి 42లక్షలమంది డిపాజిట్ దారులకు అన్యాయం చేశారని ఒంగోలు కోర్టులో కేసులు నమోదు అయ్యాయి. ప్రధానంగా కందుకూరు, కంభం, ఒంగోలులోని ఒకటవపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దాదాపు రెండు వందలమందికి పైగా చెక్‌బౌన్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను పరిశీలించేందుకు అగ్రిగోల్డ్ యజమాన్యాన్ని జిల్లా జడ్జి ప్రశ్నించిన తరువాత వాయిదా వేశారు. వచ్చేనెల 4వతేదీకి వాయిదా పడటంతో జిల్లావ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఆరోజున పెద్దఎత్తున వచ్చేందుకు ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు ప్రయత్నాలు చేపట్టారు. ఇదిలాఉండగా అగ్రిగోల్డ్ యజమాన్యం జిల్లాకోర్టుకు వస్తుందని తెలుసుకున్న బాధితుల సంఘం ప్రతినిధులు కోర్టు ఎదుట భారీగా మోహరించారు. రెండుగంటలపాటు కోర్టు ఎదుట ప్రధానరహదారిపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ట్రాఫిక్ అదుపుతప్పటంతో ఒకటవ పట్టణ సిఐ రామారావు రంగంలోకి దిగి అగ్రిగోల్డ్‌బాధితులతో మాట్లాడి కొంచెం దూరంగా వెళ్లి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈసందర్భంగా అగ్రిగోల్డ్ పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు జి జడ్సన్, నాయకులు అద్దంకి కోటేశ్వరరావు, ఏ నరసయ్య, ఎన్‌వి శ్రీను, ప్రసాదు, ఐ శివ, సత్యనారాయణ, కె వెంకట్రావు, ఉమాకుమారి, శోభాదేవి, లక్ష్మి, సుబ్బమ్మ, విశాలక్ష్మి తదితరులు మాట్లాడుతూ తమ జీవితాలతో చెలగాటం ఆడి తమ జీవితాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ చైర్మన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను నడిబజారులో ఉరితీయాలని డిమాండ్ చేశారు. కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. నాలుగైదు రాష్ట్రాల్లో భారీఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టిన వాటిని ఎందుకు వేలం వేయటంలేదని వారు ప్రశ్నించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వచ్చేనెల 4న జిల్లాలోని వేలాదిమందితో జిల్లాకోర్టును ముట్టడిస్తామన్నారు.