ఆంధ్రప్రదేశ్‌

ప్రజలపై పెరిగిపోతున్న పన్నుల భారాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: మహాత్మా గాంధీ ఆశయాల్లో మద్యపాన నిషేధం ఒకటి. అయితే దాన్ని అమలు చేస్తే ప్రభుత్వాలకు కొంత ఆదాయం తగ్గుతుంది. ఆ ఆర్థిక లోటును భర్తీ చేయటానికి మహామేధావి చక్రవర్తుల రాజగోపాలాచారి రూపాయికి దమ్మిడీ అమ్మకం పన్నును విధించారు. దేశంలో అదే తొలి అమ్మకం పన్ను. అయితే కాలం గడిచిన కొద్దీ పాలకులు పన్నుల శాతం అనూహ్యంగా పెంచేశారు. విచిత్రమేమిటంటే అమ్మకం పన్ను పెరగటంతో పాటు నేడు మద్యం కూడా ఏరులై పారుతోంది. ఈ రెండు కలిసి అన్ని వర్గాల ప్రజల వెన్ను విరిచేస్తున్నాయి. దేశ ప్రజలపై ఆరకంగా తొలిసారి విధించిన పన్ను తరువాతి కాలంలో అనేక రూపాలుగా మారి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విపరీతంగా పెరిగిపోయింది. తరువాత మల్టిపుల్ టాక్స్ విధానాన్ని తీసేసి సింగిల్ పాయింట్ టాక్స్‌ని అమలు చేశారు. 2005లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒక వస్తువుపై ఒకే పన్ను ఉండాలన్న నిబంధనతో వ్యాల్యూ యాడెడ్ టాక్సు (వ్యాట్) చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలో ఉండే కొన్ని సందిగ్ధ విషయాల వల్ల ఒకే వస్తువుకు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పన్ను రేటు కుదరలేదు. అమల్లో కూడా వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెపుతున్నారు. కట్టిన పన్ను ముదరా తెచ్చుకోవటంలో గాని (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్), అపరాధ రుసుము, ఆడిట్లు, మ్యాచింగ్ ఆఫ్ ఇన్‌వాయిసెస్, అడ్వాన్స్ వేబిల్లులు, వగైరా వగైరాలతో ‘వ్యాట్’ అంటేనే విసిగిపోయామని వ్యాపారులు చెపుతుంటారు. ఈ దశలో ఎడారిలో ఒయాసిస్సులా జిఎస్టీ వస్తోందంటే వెయ్యికళ్లతో ఎదురుచూశామని, కానీ అదీ భారంగా మారబోతోందని వాపోతున్నారు.
వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) అంటే చాలా సులభతరమైన పన్ను విధానం. అన్నిరకాలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వస్తువులు, సేవలపై పన్నులను మొత్తం 12 శాతం కంటే ఎక్కువకు ఏకీకృతం చేయడం ద్వారా ఏకైక మార్కెట్‌ను జీఎస్టీ సృష్టిస్తుంది. జిఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్నది ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇది దేశ ఆర్థిక సంస్కరణలకు మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం విశదపరుస్తోంది. వ్యాపార, వాణిజ్య వర్గాలవారు జిఎస్టీని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. 2005 నుంచి వ్యాట్ అమలుతో పడుతున్న కష్టనష్టాలు తొలగిపోతాయని ఆశించారు. జిఎస్టీ ఎప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా? అని ఎదురుచూశారు. జిఎస్టీ అంటే అప్పట్లో పాలకులు ఏమి చెప్పారనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. వారు చెప్పిందేమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులన్నీ కలిపి ఒకేచోట, అంటే మాన్యుఫాక్చరింగ్ (తయారీ కేంద్రం) దగ్గరే వేస్తారని వివరించారు. అంటే తయారీదారుడు ఒకే ఒక రూపంలో పన్ను వసూలు చేస్తాడు. ఇక ఆపైన వాళ్లెవరూ పన్నులు వసూలు చేయవలసిన అవసరం లేదు. వసూలైన పన్నును రాష్ట్ర ప్రభుత్వాలకు దామాషా ప్రకారం కేంద్రం పంచుతుంది. పన్ను భారం ఒకచోటే, అదీ వస్తువు తయారయ్యేచోటే ఉంటుందన్న జిఎస్టీని వ్యాపారులు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అయితే రాన్రానూ దాని రూపురేఖలు మారిపోయాయి. తయారీదారుడి నుంచి పంపిణీదారుడికి, అక్కడి నుంచి టోకు వ్యాపారికి, అక్కడ నుంచి డీలరుకు, డీలరు నుండి చిల్లర వ్యాపారం ద్వారా వినియోగదారునికి సరుకులు చేరతాయి. జిఎస్టీలో ప్రతి దశలోనూ పన్ను చెల్లించాలి. కట్టిన పన్నును ముదరా తీసుకోవాలి (ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్-ఐటిసి). దీంతో వ్యాట్ చట్టం కంటే భారమైందిగా మారింది జిఎస్టీ. ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదం ఆచరణలోకి వచ్చేసరికి మేలు చేయటం లేదంటున్నారు వ్యాపార, వాణిజ్యవేత్తలు. పన్నురేటు ఒకటే కాకుండా ఆరు రకాలుగా ఉంది. 0, 3, 5, 12, 18, 28 శాతాలుగా విభజించారు. ఇతర దేశాల్లో జిఎస్టీ పన్ను 7 శాతం. సూది దగ్గర నుంచి ఏ వస్తువైనా అదే పన్ను. ఆస్ట్రేలియా 10, కొరియా 10, ఇండోనేషియా 10, సింగపూర్ 7, స్విట్జర్లాండ్ 8, థాయ్‌లాండ్ 7, జపాన్ 8, మలేషియా 6, మయన్మార్ 3, యుఎఇ 5, అమెరికా 7 శాతం పన్ను వుంటే, మన దేశంలో మాత్రం అది 0 శాతం నుంచి 28 శాతం వరకూ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం వినియోగదారుడు 28 శాతం పన్ను చెల్లించటానికి సంసిద్ధత వెలిబుచ్చటం లేదు. పైగా ఇంత పన్నురేటా? అని ఆందోళన చెందుతున్నాడు. వికేంద్రీకరణగా ఉన్నప్పుడు తెలియకుండా సరుకుల మీద పన్నులు చెల్లించారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఒకేసారి ఒకేచోట చెల్లించాలంటే ఆందోళన చెందుతున్నాడు. ఉదాహరణకు రూ.100ల వస్తువు మీద 12.5 శాతం ఎక్సైజ్ సుంకం తయారీ సంస్థ వద్ద చెల్లిస్తారు. ఆ వస్తువు మీద 14.5 శాతం పన్ను వినియోగదారుడు చెల్లిస్తాడు. ఇది వ్యాట్ చట్టంలోని నిబంధన. కానీ జిఎస్టీలో 12.5, దాని మీద 14.5 శాతం వెరశి 28 శాతం పన్ను పడుతోంది. ఒకేచోట వినియోగదారుడి దగ్గర వసూలు చేసి ప్రభుత్వానికి వ్యాపారస్తులు కట్టాలంటే కష్టసాధ్యవౌతుందని అంటున్నారు. ఒక వంద రూపాయల కొనుగోలుపై 28 రూపాయలు పన్ను చెల్లించటానికి వినియోగదారుడు మానసికంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు. కనుక జిఎస్టీ అమల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వ్యతిరేకత వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
జిఎస్టీ వల్ల సామాన్య గృహిణికి లాభమా, భారమా? అని ఆలోచిస్తే.. 5నుంచి 18శాతం దాకా పన్నులున్నాయి. వంటింటి వస్తువులు, సబ్బులు, షాంపూలూ, టూత్‌పేస్ట్‌ల రేట్లు కొంత పెరుగుతాయి. ప్యాకింగ్ చేసి అమ్మే వస్తువులపై పన్ను భారం పడుతుంది. టెలిఫోన్, మొబైల్స్, బీమా వంటి వాటి మీద సర్వీసు టాక్స్ పెరుగుతుంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబం నెలకు షుమారు 4వేల రూపాయల భారాన్ని అదనంగా మోయాల్సి వస్తుందంటున్నారు. ఈమధ్యకాలంలో భారీగా డిస్కౌంట్లు ఇచ్చి ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు వగైరా వస్తువులను అమ్మటానికి కారణమేమిటి? అని విచారిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వ్యాట్ చట్టంలో కట్టిన టాక్స్ ముదరా తీసుకుని (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్-ఐటిసి) మరలా అమ్మేటప్పుడు కొనుగోలుదారు నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి కట్టాలి. అలా ఈ సంవత్సరంలో మే నెల కొనుగోళ్ల వరకు వ్యాపారులు ఐటిసిని పొందారు. కానీ జూన్‌లో కొన్న సరుకులకు ఎంత శాతం ఐటిసి ఇస్తారో తెలియదు. ఎక్సైజ్ డ్యూటీ బిల్లులో చూపిస్తే ఇస్తారు, అన్నీ కలిపి ఒకే రేటు వేసి బిల్లు రాస్తే ఇవ్వరు. ఈ ఐటిసి 40 శాతం, 60 శాతం మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. జూలైలో ఇచ్చే రిటర్న్స్ ఫారమ్‌లో మినహాయించగా కూడా ఇంకా మిగిలిన ఐటిసి ఎంతకాలంలో మినహాయింపు చేయిస్తారో తెలియదు. గతంలో ఈ అనుభవం వ్యాపారస్తులకు ఉంది. వాళ్లకు రావల్సిన ఐటిసి లక్షల్లో ఉంటే ‘దాన్ని తరువాత ఇస్తాం. ముందు ఈ నెలకు మీరు కట్టాల్సిన పన్ను కట్టండ’ని చెప్పి కట్టించుకుని, సుమారు ఏడాది తరువాత వ్యాపారులకు ఇవ్వవలసిన ఐటిసి ఇచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ఇప్పుడు భారీ డిస్కౌంట్లు ఇచ్చి సరుకులు అమ్ముతున్నారు. ఒకే రకం వస్తువుల మీద రెండు రకాల పన్ను శ్లాబులున్నాయి. ఈరకంగా జిఎస్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని వ్యాపారులు భయపడుతున్నారు.