ఆంధ్రప్రదేశ్‌

అఖిలకు అగ్నిపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 26: మంత్రి అఖిలప్రియ ప్రతిభకు నంద్యాల ఉప ఎన్నిక పరీక్ష కానుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సోదరుడైన భూమా బ్రహ్మానందరెడ్డిని ఎంపిక చేసుకోవడంలో ఆమె విజయం సాధించినప్పటికీ, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే పడింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి అదంత సులభంగా ఉన్నట్టు కనిపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు పర్యటనలో జనసమీకరణ అంశంలో నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీ స్థాయిలో సమీకరణ ఉంటుందని చెప్పినా అందులో కొంతశాతం కూడా లేకపోవడమే దానికి కారణమంటున్నారు. టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి-వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి ఖరారైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి ఊపందుకుంది. మూడేళ్ల తర్వాత టిడిపి-వైసీపీ మధ్య జరగనున్న తొలి ఉప ఎన్నిక కావడమే దానికి కారణం. ముస్లిం-బలిజ వర్గాల సంఖ్య ఎక్కువగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ఎవరిని సమర్థిస్తుందన్న ఉత్కంఠ మొదలయింది. ఇందులో ఎక్కువగా ఉన్న ముస్లింలు మెజారిటీ శాతం వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరూఖ్‌కు ఇప్పటివరకూ ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై పార్టీకి చెందిన మైనారిటీలు అసంతృప్తితో ఉండగా, గత ఎన్నికల్లో వైసీపీని బలపరిచిన మైనారిటీలు చెక్కుచెదరకుండా ఉన్నారని చెబుతున్నారు. అందువల్లే వైసీపీ భరోసాతో ఉందంటున్నారు. ఇక అభ్యర్థులిద్దరూ రెడ్డి సామాజికవర్గీయులే కావడంతో రెండు వర్గాలుగా చీలిపోవడంతో, వారు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్న ఉత్కంఠ మొదలయింది. ఇక అత్యంత కీలకమైన బలిజ సామాజికవర్గం ఎటు వైపు మొగ్గు చూపితే విజయలక్ష్మి వారినే వరించనుంది. టిడిపికి చెందిన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉండటంతో ఆ వర్గం అంతా టిడిపి వైపు మొగ్గు చూపుతుందన్న అంచనా వ్యక్తమవుతుండగా, కాపులను బీసీల్లో చేర్చకుండా నాన్చుతున్న వైనంపై ఉన్న అసంతృప్తిని, వైసీపీ వినియోగించుకుంటే మళ్లీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. కాగా, మంత్రి అఖిల ప్రియ పనితీరుపై ఇప్పటికే సొంత పార్టీలోనే అసంతృప్తిగా ఉన్న నాయకులు, ఇప్పుడు పైకి మద్దతునిస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఎన్నిక నాటికి విభీషణుల అవతారం ఎత్తే ప్రమాదం లేకపోలేదన్న బహిరంగ ప్రచారం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి చెందిన తర్వాత ఆయనకు సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి మొదలుకుని, నాగిరెడ్డి సొంత అనుచరులను అఖిల పక్కకుపెట్టిన అసంతృప్తి ఇంకా తొలగిపోలేదంటున్నారు. ఆమె తన కుటుంబసభ్యులకు పెత్తనం ఇచ్చి, తమను చిన్నచూపు చూస్తున్నారన్న అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. సుబ్బారెడ్డి పైకి పార్టీ అభ్యర్థికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, అది ఎంతవరకూ అమలవుతుందోనన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థికి స్థానికంగా పరిచయాలు లేకపోవడం, అఖిల ఒంటెత్తు పోకడలు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని, మంత్రి తనకంటే పెద్ద వారిని కూడా పేరు పెట్టి పిలుస్తున్న తీరుపై ఇప్పటికే ఫిర్యాదులున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా, టిడిపిలో ఉన్న మండల స్థాయి నేతలతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పటికీ టచ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అవసరాల మేరకు టిడిపిలో కొనసాగుతున్న వారంతా ఎన్నిక సమయంలో ఆయనకు పరోక్ష సాయం చేస్తామని ఈపాటికే మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బ్రహ్మానందరెడ్డి ఓడినా, గెలిచినా ఇక్కడే ఉంటారన్న నమ్మకం లేదని, ఒకవేళ గెలిచినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకు కాకుండా అఖిల సోదరికి ఇస్తారన్న ప్రచారంపై స్పష్టత లేకపోవడం కూడా గందరగోళానికి కారణమవుతోంది. దీనికితోడు కాంగ్రెస్ బలిజ అభ్యర్థిని బరిలోకి దింపుతుందన్న ప్రచారంతో ఆయన ఎవరి ఓట్లు చీల్చి ఎవరి పుట్టి ముంచుతారన్న ఉత్కంఠ మొదలయింది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో సోదరుడిని నెగ్గించుకోకపోతే అఖిల పరిస్థితి రాజకీయంగా ప్రమాదంలో పడినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా తన సోదరుడు గెలవకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అఖిల, దానిపై మరోసారి స్పష్టత ఇస్తే తాను కూడా స్పందిస్తానని శిల్పా చేసిన ప్రతి సవాల్ చర్చనీయాంశమయింది.