ఆంధ్రప్రదేశ్‌

హడలిపోతున్న జివిఎంసి ఇంజనీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్ పాండురంగారావు అరెస్టుతో పలువురు ఇంజనీర్లు హడలిపోతున్నారు. ముఖ్యంగా మహా విశాఖ నగరపాలక సంస్థతో ఆయనకున్న అనుబంధంతో ఇక్కడ పనిచేసిన, పనిచేసి వెళ్లిన ఇంజనీర్లలో కలవరం మొదలైంది. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసుగా పాండురంగారావు వ్యవహారం ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.1000 కోట్లను దాటిన ఈ అవినీతి వ్యవహారంలో పాండురంగా రావు కీలకపాత్ర పాత్ర పోషిస్తుండగా, పలువురు కింది స్థాయి అధికారులు సైతం ఆయన అవినీతికి ఇతోధిక సాయం చేసినట్టు తెలుస్తోంది. పాండురంగా రావు ఎక్కువ కాలం పనిచేసింది మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లోనే. అదికూడా నీటి సరఫరా విభాగంలోనే. తదనతరం పదోన్నతులు పొందిన పాండురంగా రావు ఏకంగా జివిఎంసి చీఫ్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు.
ఈ కాలంలోనే జివిఎంసిలో ఆయన పెద్ద సంఖ్యలో అనుయాయులను తయారు చేసుకున్నట్టు జివిఎంసిలో ప్రచారం జరుగుతోంది. వీరంతా ఇప్పటికీ జివిఎంసిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట హుదూద్ తుపాను సంభవించగా అత్యవసర పనుల నిమిత్తం జివిఎంసి దాదాపు రూ.64 కోట్లు ఖర్చు చేసింది. వీటిలో ఇంజనీరింగ్ సంబంధిత పనులకే 90 శాతం నిధులు వెచ్చించారు. హుదూద్ తుపానుతో నేలకొరిగిన చెట్లు తొలగింపు, వాటిని తరలించే పనుల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్టు అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. పారిశుద్ధ్య పనులు, వ్యర్ధాల తొలగింపు, డ్రెయిన్ల మరమ్మతులు తదితర పనుల్లో ఇంజనీరింగ్ అధికారులు కోట్ల రూపాయలు దారిమళ్లించారని, దీనిపై విచారణ జరగాలని విపక్షాలు సైతం పట్టుబట్టాయి. దాదాపు 15 రోజుల పాటు ప్రజారోగ్య విభాగం ఇఎన్‌సి ఇక్కడే ఉండి ఈ పనులను పర్యవేక్షించడం గమనార్హం. పాండురంగా రావు, అతని బినామీల అవినీతి వ్యవహారం ఒకటొకటిగా వెలుగుచూస్తుండటంతో జివిఎంసి అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ఎటునుంచి ఎటొచ్చి తమ మెడకు ఉచ్చు బిగుసుకుంటుందాని ఆందోళనకు గురవుతున్నారు. గతంలో పాండురంగా రావు జివిఎంసి నీటి సరఫరా విభాగంలో పనిచేసిన సందర్భంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పలువురు కింది స్థాయి అధికారుల్లో కలవరం మొదలైంది. ఒకరిద్దరు ఉద్యోగులు ఇప్పటికే సెలవుపై వెళ్లినట్టు జివిఎంసి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాండురంగా రావును ఇప్పటికే ఎసిబి అధికారులు కస్టడీకి కోరిన నేపథ్యంలో ఆయన నోరువిప్పితే తమకేం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.