ఆంధ్రప్రదేశ్‌

హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు, మే 7: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కడప మున్సిపల్ మైదానంలో శనివారం ఉద్యాన రైతులకు రుణ విమోచన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగరంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీలను ఎర్పాటు చేయించి, విదేశీ కంపెనీలను ఇక్కడికి రప్పించి రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో రూ.24వేల కోట్ల మేర రైతులకు పంట రుణాల మాఫీ ఎక్కడా జరగలేదన్నారు. కేవలం మన రాష్ట్రంలోనే తాము చేసి చూపించామన్నారు. అదే విధంగా పండ్లతోటల రైతాంగాన్ని ఆదుకునేందుకు 2.23 లక్షల మంది ఉద్యాన రైతులకు రూ.384.67 కోట్ల మేర రుణ విముక్తి కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఉద్యాన రైతులకు రుణ విమోచన పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి భాగోలేకున్నా రైతులు తీసుకున్న రుణంలో 20శాతం మొదటి విడతగా మాఫీ చేసి మొత్తం నాలుగు విడతల్లో రైతులకు రుణ విముక్తి కల్పిస్తున్నామన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణ విమోచన కింద రూ.10వేల కోట్లు జమచేశామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 15లక్షల పంపుసెట్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తామని ఏ ఒక్కటి మరమ్మతుకు వచ్చినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. రైతులు వ్యవసాయం కంటే ఉద్యానవన పంటలపైనే ఆసక్తి చూపుతున్నారని, ఉద్యానవన పంటలు సాగుచేస్తే రైతుకు అధిక లాభాలు ఉంటాయని, ఓ పక్క వ్యవసాయం, మరో పక్క ఉద్యాన పంటలు సాగుచేసి ఆర్థికంగా రైతులు ముందుకు దూసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో పండ్లతోటల పెంపకానికి మంచి అనువగా ఉన్నందున్న హర్చికల్చర్ హబ్‌గా అధివృద్ధి చేసి, ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెడతానన్నారు. గత పాలకులు రాయలసీమను రాళ్లసీమగా మార్చారని, రాజకీయాలకు అతీతంగా అందరు సహకరిస్తే రాయలసీమ ప్రాంతాన్ని రతనాలసీమగా మార్చేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వవిప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం కడపలో ఉద్యాన రైతులకు రుణ విమోచన పత్రాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు