ఆంధ్రప్రదేశ్‌

బొత్స వ్యాఖ్యలు బూమరాంగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: తెలుగుదేశం పార్టీ బిజెపిని విడిచిపెడితే తాము బిజెపితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు ప్లీనరీ విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న శ్రేణులు, నేతలను బొత్స వ్యాఖ్యలు నిరాశపరిచినట్లు పార్టీ నాయకుల అంతర్గత చర్చలు తెలియజెపుతున్నాయి. ‘టిడిపి-బిజెపి భార్యాభర్తల్లా కలిసి ఉన్నాయి. వారు విడాకులు తీసుకుంటే బిజెపితో వైసీపీ కలిసే విషయం అప్పుడు చూస్తాం. బిజెపి-టిడిపి విడిపోతే తప్పకుండా ఆలోచిస్తాం’ అని.. ‘వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తారా?’ అన్న మీడియా ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బొత్స అక్కడ చేసిన వ్యాఖ్యలు పార్టీని కలవరపరుస్తున్నాయి. రాష్టప్రతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ తమ పార్టీ అధినేత జగన్ అందుకు కారణాలు వివరించడంతో క్రైస్తవులు, ముస్లింలు అర్థం చేసుకున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కానీ బిజెపిని టిడిపి విడిచిపెడితే తాము కలుస్తామని బొత్స బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే పార్టీ కొంపముంచేలా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీకి తిరుగులేని మద్దతుదారుగా ఉన్న ముస్లిం, క్రైస్తవులను ఆకర్షించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని పథకాలు, ఆయా వర్గాలకు చెందిన నేతలకు పదవులిస్తున్నా ఇప్పటికీ వారంతా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వేలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో బొత్స చేసిన వ్యాఖ్యలు అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం వచ్చిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో జరిగే పరిణామాలు, పార్టీ అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకోవాలన్న సూత్రప్రాయ నిర్ణయం ఒకటి జరిగిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ బిజెపినే వస్తుందని, తిరిగి మోదీనే ప్రధాని అవుతారని తెలిసినప్పటికీ రాష్ట్రంలో ఉన్న కుల-మత పరిస్థితుల దృష్ట్యా ముందుగానే బిజెపికి మద్దతు ప్రకటించడం గానీ, ఆ పార్టీతో కలిసి వెళదామని నిర్ణయించడం గానీ ఆత్మహత్యా సదృశమే అవుతుందని ఓ నేత అన్నారు. పార్టీకి పెట్టనికోటయిన ముస్లిం, క్రైస్తవుల ఓట్లను ముందుగానే ఏవిధంగా వదులుకుంటామని, ఇది తెలివైన పార్టీ తీసుకునే నిర్ణయమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడై ఉండీ బొత్స ఏవిధంగా మాట్లాడారో తమకు అర్థం కావడం లేదని మరికొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్లీనరీ ఉత్సాహంలో ఉన్న శ్రేణులను అయోమయ పరచడమేనంటున్నారు. కాగా, బొత్స వ్యాఖ్యలు అడ్డుపెట్టుకుని పార్టీని ఇరికించేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలు తమకు ఇబ్బందికరమేనని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఈసందర్భంగా గత ఎన్నికల ముందు బిజెపిని మతతత్వ పార్టీ అని తాము చేసిన ఆరోపణలను టిడిపి ప్రముఖంగా గుర్తుచేయడం రాజకీయంగా తమకు ఇరకాటమేనంటున్నారు. పైగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలో విఫలమయినందున టిడిపి మంత్రులు కేంద్రం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించాలని తరచూ తాము చేస్తున్న డిమాండ్ వెనుక.. ‘టిడిపి వెళ్లిపోతే తాము చేరాలన్న ఉబలాటాన్ని’ బొత్స వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయని వైసీపీ నేతలు విశే్లషిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, కాంగ్రెస్ సంప్రదాయం కొనసాగితే కష్టమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ పార్టీలో ఏది మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఎవరిపై మాట్లాడినా చెల్లుతుందని, కానీ ప్రాంతీయ పార్టీలు చేసే ప్రతి వ్యాఖ్య కీలకమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అగ్ర నాయకుల ప్రకటనలపై జగన్ దృష్టిసారించాల్సి ఉందని చెబుతున్నారు.