ఆంధ్రప్రదేశ్‌

యువ ఇంజనీర్లు తికమక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: క్షేత్రస్థాయిలో కనీసం ఒక్కరోజైనా సందర్శనలు జరపకుండా నాలుగు గోడల మధ్యనే చదువులకు పరిమితమైతే తాము నిర్వహించబోయే కీలకమైన విధుల పట్ల కొత్త ఇంజనీర్లకు ఎలాంటి అవగాహన ఉంటుందో సుప్రసిద్ధ ఇంజనీర్, దివంగత మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు 115వ జయంతి వేదికగా తేటతెల్లమైంది. ఎపిపిఎస్‌సి ద్వారా జలవనరుల శాఖలో 518 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులు ఇటీవలే భర్తీ అయ్యాయి. పోస్టింగ్‌ల కోసం అన్నిస్థాయిల్లో పైరవీలు కూడా పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన కెఎల్ రావు జయంతి సభకు యువ ఇంజనీర్లంతా తరలివచ్చారు. ఈసందర్భంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ప్రసంగాన్ని ముగించి ఉన్నపళంగా టీచర్ అవతారమెత్తారు. యువ ఇంజనీర్లందరినీ వారి సీట్ల వద్దనే నిలబెట్టి దాదాపు గంటసేపు నీటి పథకాలపై ఆయన ప్రశ్నలు సంధిస్తే కనీసం ఒక్కరి నుంచి కూడా సరైన సమాధానం రాకపోవటంతో నోరువెళ్లబెట్టారు. వీరంతా భలే ఇంజనీర్లు బాసూ..! అంటూ వేదికపై ఉన్న వారితో పాటు హాజరైన ఇంజనీరింగ్ అధికారులంతా ముక్కున వేలేసుకోటంతో నవ్వులు విరిశాయి. ఇక మంత్రి ఉమాకు చిర్రెత్తుకొచ్చి రెండు నెలల పాటు ఎవరికీ పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయొద్దని, తక్షణం ఫీల్డ్ వర్క్‌తో శిక్షణ ఇవ్వాలంటూ వేదికపై ఉన్న జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంతకీ మంత్రి ఏమి ప్రశ్నించారు.. యువ ఇంజనీర్లు ఏమి సమాధానమిచ్చారో ఒక్కసారి చూద్దాం.
ఉమా: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన నిర్మాణంలోని పోలవరం ప్రాజెక్టును ఎవరైనా సందర్శించారా? సందర్శిస్తే చేతులెత్తండి..
... (ఒక్కరూ చేతులెత్తలేదు)
ఉమా: ఒక టిఎంసికి ఎన్ని క్యూసెక్కులు?
(సమాధానం లేదు)
ఇక జిల్లాల వారీగా ఎవరెంతమంది ఉన్నారని ఆరాతీస్తే కృష్ణా, కడప, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి ఒకరిద్దరు చేతులెత్తారు. మంత్రి నివ్వెరపోయి మీరంతా ఇతర రాష్ట్రాల్లో చదివి వచ్చినవారా? అని ప్రశ్నించారు.
నందిగామ ప్రాంతానికి చెందిన రోజా అనే యువతిని ప్రశ్నించే ముందు మా గ్రామీణప్రాంత యువ ఇంజనీర్ అంటూ మంత్రి ప్రశంసించారు.
ఉమా: నందిగామ, చందర్లపాడు భూములకు సాగునీరు ఎక్కడ నుంచి వస్తుంది?
సమాధానం: కృష్ణాడెల్టా నుంచి..
ఉమా: నాగార్జునసాగర్ నీరు అనే విషయం తెలియదా? వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు తీసుకొచ్చారు?
సమాధానం: ????
అనంతరం దివిసీమలోని కోడూరు మండలానికి చెందిన స్వాతికి మైక్ ఇచ్చారు.
ఉమా: మీ మండలం కృష్ణాడెల్టాలో ఏ ప్రాంతాన ఉంది?
సమాధానం: కృష్ణాడెల్టా మధ్యలో ఉంది!
ఆమె సమాధానానికి నవ్వులు విరిశాయి.
ఉమా: అసలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఎలా చేరుతుందో అయినా తెలుసా?
సమాధానం: ????
ఉమా: ప్రకాశం బ్యారేజీకి ఏ ప్రాజెక్టు నుంచి నీరు వస్తుంది?
సమాధానం: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి..
ఉమా: మధ్యలో పులిచింతల ప్రాజెక్టు ఉందనేది తెలియదా?
అమ్మా.. ఇది కెఎల్ రావు పుణ్యమేనంటూ మంత్రి ఉమ వివరించారు.
అనంతరం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫణికుమార్‌రెడ్డి మైక్ అందుకున్నారు.
ఉమా: మీ కరవు ప్రాంతాలకు సాగునీరు ఎలా చేరుతోంది?
సమాధానం: సార్.. వెలిగొండ టనె్నల్ ద్వారా..
ఉమా: ఆ టనె్నల్‌లోకి ఎప్పుడైనా వెళ్లావా? చూశావా?
సమాధానం: లేదు సార్
ఉమా: నేను ఇప్పటికి నాలుగుసార్లు లోపలికెళ్లి చూసివచ్చా.
పులివెందుల ప్రాంతానికి తొలిసారిగా తాము నీరు అందిస్తున్నామని కడప, అనంతపురం యువ ఇంజనీర్ల నుంచి చెప్పించడానికి కూడా మంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరగా మంత్రి సహనం కోల్పోయారు. ఫీల్డ్ వర్క్ లేకుండా వచ్చారు.
ఉమా: రేపు రైతులకు సాగునీరు ఎలా అందిస్తారు?
సమాధానం: ఏం చేస్తాం సార్! గ్రేడ్లు, మార్క్‌ల కోసం పుస్తకాల పురుగులుగా మారిపోయాం.. అంటూ పలువురు ముక్తకంఠంతో బదులివ్వటంతో మంత్రితో పాటు అందరూ నివ్వెరపోయారు.
మంత్రి ఉమా వెంటనే తేరుకుని 45రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల సందర్శన, మూడు వారాలపాటు పోలవరం ప్రాజెక్టు పనులు, 15 రోజులపాటు నాలుగు గోడల మధ్య వర్క్‌షాపు నిర్వహించండి. ఆపైనే పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వండి.. అంటూ వేదికపై నుంచే అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పనిచేయాలనేది ఏ ఒక్కరిలో, ఏకోశానా కన్పించడం లేదు. ఎవరికి వారు తమ సొంత ఊరు, బంధువుల ఊళ్లలో పోస్టింగ్‌లు కావాలంటూ అప్పుడే ఒత్తిళ్లు తెస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.