ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 15: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్ల పెట్టుబడులతో రెండు దఫాలుగా పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన ప్రపంచ నైపుణ్య దినోత్సవానికి చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నిర్వహించిన మెగా మేళాలకు అనూహ్య స్పందన వచ్చిందని, అనంతరం రాష్ట్రంపై దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు సదభిప్రాయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాల పెంపుదలకు కృషి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, అందుకనుగుణంగా వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, మరింత పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, అటువంటి పరిశ్రమలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డిఆర్‌డిఎ ద్వారా ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తోందన్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సర్వీస్ కమీషన్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, పోలీస్ శాఖలో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా పోలీస్ శాఖలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సామాజికవర్గానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు 10 లక్షల ఆర్ధిక సహాయం, సివిల్ సర్వీస్‌కు వెళ్ళేవారికి ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు శిక్షణ నిమిత్తం పంపుతున్నట్టు చినరాజప్ప తెలియజేశారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎస్ వర్మ, వివిధ శాఖల అధికారులు, వివిధ నైపుణ్య అంశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.
చిత్రం.. సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప