ఆంధ్రప్రదేశ్‌

జాతీయ పర్యాటక కేంద్రంగా కోరంగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 16: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) సిద్ధంచేసే పనిలో సంబంధిత శాఖల అధికారులున్నారు. ప్రస్తుతం కోరంగి అభయారణ్యాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎకో టూరిజం కింద ఈ అభయారణ్యాన్ని ఇటీవలి కాలంలో అభివృద్ధిచేస్తున్నారు. అయితే దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్‌బాన్ అభయారణ్యం తర్వాత అంత విశిష్టమైన అరణ్యం ఇదే కావడంతో ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మడ అడవులు కలిగిన ప్రాంతంగా కోరంగి ప్రసిద్ధిచెందింది. సుమారు 23,500 హెక్టార్ల విస్తీర్ణం కలిగివున్న ఈ అభయారణ్యం అరుదైన జంతుజాలం, విదేశీ, స్వదేశీ పక్షులకు కేంద్రంగా మారింది. ఔషధ గుణాలు కలిగిన అనేక రకాల అరుదైన వృక్షజాతులకు ఈ మడ అడవులు నెలవుగా మారాయి. కాకినాడ నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం ఏనాడో అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మరుగున పడింది. గత నాలుగైదు సంవత్సరాలుగా అభయారణ్యం విశిష్టత బాహ్య ప్రపంచానికి తెలిసింది. క్రమంగా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం వారాంతపు దినాల్లో ఈ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.
ఇటీవలి కాలంలో కోరంగి అభయారణంలో విహరించేందుకు వీలుగా బోటు షికారు సౌకర్యం కల్పించారు. మర బోట్లలో మహారణ్యాన్ని వీక్షించే అవకాశం ఉంది. అలాగే అభయారణ్యం, మడ అడవుల అందాలను, వివిధ రకాల పక్షులు, జంతువులను కనులారా తిలకించి, ఆనందించే అవకాశం ఉంది. ఈ అభయారణ్యంలో ప్రత్యేకించి, ఆకర్షణీయంగా రూపొందించిన ఉడెన్ వంతెనపై కాలి నడకన పర్యటించి, అడవుల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. అలాగే మడ అడవుల నుండి మహా సముద్రం వరకు బోటులో షికారు చేసి తిలకించవచ్చు. కాకినాడ-యానాం ప్రధాన రహదారిలోని కోరంగి గ్రామం నుండి నేరుగా అభయారణ్యానికి చేరుకోవచ్చు. అయితే ఈ మార్గం సక్రమంగా లేకపోవడంతో పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. కోరంగి అభయారణ్యం అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులను డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఇటీవల కోరంగి అభయారణ్యంలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. కోరంగి సహా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చిర్ర యానాంను కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధంచేయాలని మంత్రి సూచించారు.

చిత్రం.. .కోరంగి అభయారణ్యంలోని చెక్కల వంతెన