ఆంధ్రప్రదేశ్‌

వరద వచ్చినా కాంక్రీట్ పనులు ఆపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: వరద వచ్చినా నష్టం జరగని లెవల్ వరకు కాంక్రీట్ పనులు పూర్తిచేయాలని, ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. ఈ వారంలో 19,266 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని, ఈ నెలాఖరులోగా లక్ష క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తిచేయాలని చెప్పారు. వచ్చే నెలలో రెండు లక్షల క్యూబిట్ మీటర్లు మేర కాంక్రీట్ పనులు జరగాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వరద వచ్చినా నష్టం జరగకుండా ఉండాలంటే అన్ని బ్లాకుల్లోనూ 16వ లెవెల్ వరకు పనులు జరగాలని, అందుకు 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాల్సి ఉందని అధికారులు చెప్పగా, ఆగస్టు నెలాఖరుకల్లా ఈ పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్ జరిపారు. ఈ వారం జరిగిన పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నుంచి పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేష్ ముఖ్యమంత్రికి వివరాలు తెలియజేశారు. మొత్తం 52 బ్లాకుల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై ఛిల్లింగ్ పద్ధతిలో కాంక్రీట్ చేయాల్సి ఉన్నందున దానికి సంబంధించిన కూలింగ్ ప్లాంట్ మరో రెండు వారాల్లో సిద్ధం చేస్తామని ఇఎన్‌సి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ ప్లాంటు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 6వేల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరుగుతాయని తెలిపారు. నిర్దేశించిన వ్యవధిలోగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తిచేయగలమని సమావేశంలో ఎల్ అండ్ టి-బావర్ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. అందుకు సంబంధించిన సూక్ష్మ కార్య ప్రణాళికలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రణాళికను అనుసరించి మిగిలిన నిర్మాణ సంస్థలు తమకు సహకరిస్తే నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తిచేయగలమని తెలిపారు. 2018 నాటికి పోలవరం నీళ్లు అందించాలన్న లక్ష్యానికి తగ్గట్టుగా నిర్మాణ సంస్థలన్నీ తమ కార్య ప్రణాళికలు తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ పనులపై నిరంతర పర్యవేక్షణ జరిపి నిర్మాణ సంస్థలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖకు చెప్పారు. డెడ్‌లైన్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అంటూ, చెప్పిన సమయంలో పనులు పూర్తిచేయకపోతే సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కోర్టులకెక్కి చిక్కులు తేవద్దు
ప్రాజెక్టుల పరిహారం అందజేతలో కొంత మంది నిర్వాసితుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశ్యంతో రాష్ట్రాన్ని కరవు రహిత మాగాణంగా మలచాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, పరిహారం కూడా గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత మొత్తంలో అందిస్తున్నామనీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. పరిహారం విషయంలో వ్యాజ్యాలు వేసే వారు అభివృద్ధి పట్ల బాధ్యతగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వంశధార నిర్వాసితులకు ఈ వారంలోగా వంద శాతం పరిహారం అందజేస్తామని అధికారులు వివరించిన సందర్భంలో ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. కొంతమంది న్యాయ స్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేయడం వల్ల పరిహారం అందజేయడంలో కొంత అవాంతరాలు ఎదురవుతున్నాయని అదికారులు చెప్పగా వ్యాజ్యాలు వేసే వారు తమ ప్రాంతాభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని, ఈ ప్రాజెక్టు పూర్తయితే కలిగే ప్రయోజనాలను గమనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై అధికారులు నిర్వాసితుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయని నిర్మాణ సంస్థలను జీవితకాలం మరే ప్రభుత్వ శాఖలో పని చేయకుండా శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. చిన్న చిన్న పనులను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరుపుతున్నా కదలిక లేకపోతే ఎలా అని నిలదీశారు. వివిధ ప్రాజెక్టుల్లో పనులు దక్కించుకుని సక్రమంగా చేయని ఏజెన్సీలకు గమనిస్తున్నానని, ఎవరినీ వదలిపెట్టే ప్రసక్తేలేదని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఏజెన్సీలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రాజెక్టులన్నింటికీ ప్రారంభోత్సవం తేదీలను అందరితో మాట్లాడి ఖరారు చేశారు. మీరు నిద్రపోతారో లేదో నాకు అనవసరం. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వారం వారం సమీక్షలు తమాషా కోసం పెట్టడం లేదని, పనుల్లో వేగం పెంచకపోతే ఊరుకునేది లేదన్నారు. నాగావళి వరద హెచ్చరికలతో అప్రమత్తమై ఏ విధమైన నష్టం జరగకుండా గత రాత్రంతా మేలుకుని ఉండి అనుక్షణం పరిస్థితులను పర్యవేక్షించిన అధికారులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మిగిలి వున్న లక్షా, 30 వేల ఫామ్ పాండ్స్ పూర్తి చేసి, 2 లక్షల ఫామ్ పాండ్స్ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం.. పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు