ఆంధ్రప్రదేశ్‌

వణికిస్తున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 18: మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరిక శ్రీకాకుళాన్ని వణికిస్తోంది. అల్పపీడన ద్రోణి గోపాల్‌పూర్ నుంచి పారాదీప్‌కు పయనం అవుతుందన్న సంకేతాలతో కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అధికారులను మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నాగావళిలో వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ, ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ ప్రాంతంలో పంటపొలాలు దాటుకుని రోడ్డెక్కేసింది. దీంతో మంగళవారం ఉదయం నుంచి ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేసారు. మరో 24 గంటల వరకూ నిమ్మతొర్లాడ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉండగా, ఆ చుట్టుపక్కల పదిహేను పంచాయతీలకు విద్యుత్ సరఫరా ఉండదు. వంగర, రేగిడి ఆమదాలవలస, బూర్జ, ఆమదాలవలస ప్రాంతాల్లో సుమారు 5,600 హెక్టార్ల వరి పంటకు సిద్ధం చేసిన ఆకు నీటిలో మునిగిపోయింది. నాలుగు రోజులు దాటితే ఆ వరి ఆకు అంతా కుళ్ళిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారుల భావన. ఆయా ప్రాంతాల్లో నీట మునిగిన పంటపొలాల నుంచి మోటార్లు పెట్టి నీటిని తోడించి రైతాంగానికి నష్టం వాటిల్లకుండా పరిరక్షించే పని చేస్తున్నారు. జిల్లాలో ఎటువంటి వరద పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ధనుంజయరెడ్డి ‘ఆంధ్రభూమి’కి మంగళవారం చెప్పారు. జిల్లాలో ఇప్పటికే రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ఒక ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం, విపత్తులు అగ్నిప్రమాదాల నివారణ టాస్క్‌పోర్సు బృందం ఒకటి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. తొటపల్లి వద్ద నాగావళి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో నాలుగు గేట్లు మూసివేసి మరో నాలుగు గేట్ల ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. అయితే, ఒడిశా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదు తగ్గినప్పటికీ, ఆంధ్రా పైభాగంలో గల డ్యాంల గేట్లు ఎత్తివేయడంతో వంశధారలో వరద నీటి ప్రవాహం ఎక్కువే ఉంది. మంగళవారం రాత్రి సమయానికి 41 వేల క్యూసెక్కులు ఉన్నప్పటికీ (ప్రమాద హెచ్చరిక కాదు) మరో 48 గంటలు ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే వంశధారకు వరద ముంపు వచ్చే ప్రమాదం ఉందంటూ అక్కడి అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించడంతో జిల్లా అంతటా అన్నీ శాఖలను అప్రమత్తం చేసారు. నాగావళి వరద భయం లేకపోయినా, వంశధార ముంపు భయం ఇంకా వెంటాడుతునే ఉంది.

చిత్రం.. నిమ్మతొర్లాడ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న నాగావళి నది నీరు