ఆంధ్రప్రదేశ్‌

దగాపడ్డ చదువుల తల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: చదువుల తల్లి దగా పడింది. నలుగురికి విజ్ఞానాన్ని అందించాల్సిన జిల్లా గ్రంథాలయం పరాయి పంచకు చేరి, అక్కడ కూడా నిలువ నీడ లేకపోవడంతో వేరేచోటికి తరలిపోయే దుర్ఘతి పట్టింది. ఐదేళ్ల కిందటి వరకూ ఎంతో వైభవంగా నడిచిన జిల్లా గ్రంథాలయానికి నేడు ఎక్కడుందో వెతుక్కునే దుస్థితి ఏర్పడింది. విలువైన గ్రంథాలు, పుస్తకాలకు ఆయుష్షు చెల్లిపోతున్నా ప్రభువుల్లో చలనం లేదు.
స్థానిక ప్రహ్లాద కళ్యాణ మండపాన్ని ఆనుకుని జిల్లా గ్రంథాలయం ఉండేది. విలువైన గ్రంథాలతో అలరారుతున్న ఈ గ్రంథాలయం పాతబడడంతో దాన్ని అభివృద్ధి చేయడానికి జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఐదేళ్ల కిందట ముందుకు వచ్చింది. 30 కోట్ల రూపాయలతో 1,50,000 ఎస్‌ఎఫ్‌టితో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదించింది. ఇందులో 30 వేల ఎస్‌ఎఫ్‌టిలో జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి, మిగిలిన భవనాన్ని వాణిజ్య సముదాయంగా వినియోగించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యూష కంపెనీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద సమయంలో ఓ బ్యాంక్ కూడా గ్రంథాలయ సంస్థకు గ్యారెంటీ ఇచ్చింది. కొత్త భవనం వస్తుందన్న ఆశతో ఉన్న గ్రంథాలయాన్ని ఓ అపార్ట్‌మెంట్‌లోకి మార్చారు. నిర్మాణం చేపట్టడానికి నాలుగేళ్ల కిందటే ఉన్న గ్రంథాలయ భవనాన్ని కూల్చేశారు. అనివార్య కారణాల వలన తాము భవనాన్ని నిర్మించలేకపోతున్నామని ప్రత్యూష కంపెనీ చేతులెత్తేసింది. ఈ విషయాన్ని అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వౌనం వహించారు.
గ్రంథాలయ నిర్మాణానికి కావల్సిన ప్లాన్‌లను ఆమోదించడంలో గ్రంథాలయ సంస్థ జాప్యం చేసిందని ప్రత్యూష కంపెనీ ఆరోపిస్తూ, భవనాన్ని కూల్చినందుకు కోటి 40 లక్షల రూపాయలు తమకే పరిహారం చెల్లించాలంటూ 2012 అక్టోబర్‌లో ప్రత్యూష కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గ్రంథాలయ భవనాన్ని ప్రభుత్వమే నిర్మిస్తుందని విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు 2014లోనే ప్రకటించారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ కార్య రూపం దాల్చలేదు.
నిధుల కొరత లేదు!
50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ స్థలంలో అత్యాధునిక గ్రంథాలయ భవనాన్ని నిర్మించడానికి నిధుల కొరత లేదు. గ్రంథాలయ సంస్థ వద్ద పెద్దఎత్తున నిధులున్నాయి. అవి ఖర్చు చేయచ్చు. కాదంటే, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకు జివిఎంసి సుమారు 20 కోట్ల రూపాయలు సెస్ కింద చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని జివిఎంసి చెల్లించలేకపోచ్చు. కానీ భవన నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే, చేపట్టే అవకాశం ఉందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ చెప్పారు. ఈ గ్రంథాలయ వ్యవహారాన్ని ఆయన గురువారం సిట్ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు ఉన్నాయని, దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం మెలొడి థియేటర్ దగ్గర ఓ పాడుబడిన భవనంలో కొనఊపిరితో ఉన్న చదువుల సరస్వతిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న భవనాన్ని కూడా ఖాళీ చేయమని భవన యజమాని కోరడంతో, గత్యంతరం లేక దీన్ని గాజువాకకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భూకబ్జాలతో కోల్పోయిన ప్రతిష్ఠను కాస్తంతైనా తిరిగి తెచ్చుకోవాలంటే, ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ భవనాన్ని వెంటనే నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిత్రం.. ప్రస్తుతం ఖాళీగా మిగిలిన జిల్లా గ్రంథాలయ స్థలం