ఆంధ్రప్రదేశ్‌

ఇక సర్దుబాటు సమస్యలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 27: టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. దానిపై కేంద్రం సుముఖంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. తెలుగుదేశంలో కొనసాగుతున్న కొత్త-పాత నేతల్లో అయోమయం, తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళం మొదలయింది. ప్రధానంగా వైకాపా నుంచి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతోపాటు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం బ్రదర్స్ వంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో ఫలానా నియోజకవర్గం కేటాయిస్తామని, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నందున రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవలసిన పనిలేదని, పార్టీలో చేరేముందు వారికి బాబు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ఆశలు నీరుగారిపోయి ఇప్పట్లో నియోజకవర్గాల సంఖ్య పెరగవని తేలిపోవడంతో వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలయింది. సదరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరే సమయానికి, అప్పటికే నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్న టిడిపి సీనియర్లతో ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుంచి చేరిన వారితో కలసి సమన్వయంతో పనిచేసుకోవాలని, బాబు ఎన్నిసార్లు ఆదేశించినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. అక్కడికీ సమస్యాత్మకంగా మారిన కరణం బలరాం, పోతుల సునీత (ప్రకాశం), రామసుబ్బారెడ్డి (కడప) వంటి నేతలకు ఎమ్మెల్సీ; కెఇ ప్రభాకర్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చి సర్దుబాటు చేసినా, అవేమీ ఫలించిన దాఖలాలు కనిపించలేదు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవితో కరణం బలరామ్, జమ్మలమడుగులో వైసీపీ నుంచి చేరిన మంత్రి ఆదినారాయణరెడ్డితో రామసుబ్బారెడ్డికి ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్నందున, కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తామని కరణం వెంకటేష్, రామసుబ్బారెడ్డి వంటి నేతలకు టిడిపి అధిష్ఠానం హామీ ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల చేరిక వల్ల నష్టపోయిన మాజీ ఎమ్మెల్యేలు అనె్న రాంబాబు, దివి శివరాంకూ నాయకత్వం ఇలాంటి హామీనే ఇచ్చింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో, పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్లకు ఎక్కడ స్థానం కల్పించాలో తెలియక టిడిపి నాయకత్వం కొత్త సమస్యల్లో పడింది. ఇకపై పార్టీ నాయకత్వానికి సర్దుబాటు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని తేలడంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అదే సీటు దక్కుతుందా? లేదా? లేకపోతే సర్వేల పేరుతో సీటు ఎగ్గొడతారా? ఒకవేళ సీటు దక్కినా తమపై గత ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థి విజయానికి సహకరిస్తారా? లేదా? అన్న అనుమానాలు అప్పుడే వెన్నాడుతున్నాయి. ‘సీట్ల సంఖ్య పెరుగుతుంది. మీకేం ఢోకాలేదని చెబితేనే పార్టీలో చేరాం. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. అటు చూస్తే వైసీపీ పుంజుకుంటోంది. మళ్లీ వెనక్కివెళదామంటే మొహం చెల్లడం లేదు. అక్కడికీ జగన్ నన్ను వెళ్లవద్దు. కేసులుంటే ఏమైతాయి? నన్ను జైలుకే పంపారు, అంతకంటే ఎక్కువనా అని కోరినా వినకుండా వచ్చాం. పోనీ ఇక్కడేమైనా గౌరవం ఉందా అంటే అదీ లేదు. ఇక్కడ రోజూ టిడిపి వాళ్లతో కొట్లాటలే. వాళ్లు మాతో కలసిపనిచేయడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేద’ని వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. అయితే, తమ నాయకత్వం అనుసరించిన విధానమే ఈ దుస్థితికి కారణమని టిడిపి సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. పునర్విభజన జరగకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్నట్లు పార్టీ వ్యవహారశైలి కనిపించిందని, ఇప్పుడు సీట్ల పెంపు లేదని తెలిసిన తర్వాత తలపట్టుకుందని వివరించారు. ఒకరకంగా ఇది పార్టీ మంచికేనని మెజారిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పార్టీలో కొనసాగేదెవరు? సీట్ల కోసం వచ్చిన వారెవరన్నది తేలిపోతుందని చెబుతున్నారు. సీట్ల కోసం వచ్చిన వారెవరూ పార్టీలో ఉండరని, వైసీపీలో చోటు లేని వారు గత్యంతరం లేక కొనసాగుతారని, జనసేనలో భవిష్యత్తు చూసుకునే వారు కొనసాగబోరని విశే్లషిస్తున్నారు. అసలు సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా, ఉన్న పార్టీ నేతల భవిష్యత్తును తీర్చిదిద్దకుండా, ఒకపార్టీని బలహీనం చేసి దాని ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకునే విధానమే మంచిదికాదంటున్నారు. ఈ విషయం తమ నాయకత్వానికి ఇప్పటికైనా తెలిసి ఉండాలని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేసి, దిద్దుబాటు చేసుకుంటే పునర్విభజన లేకపోయినా క్యాడర్ పార్టీగా మళ్లీ ఖాయంగా గెలుస్తామని స్పష్టం చేస్తున్నారు.