ఆంధ్రప్రదేశ్‌

దోమల ఉత్పత్తి నిరోధక చట్టం పేరుతో ప్రజలపై బాదుడుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: పెరుగుతున్న దోమల బెడదను తగ్గించేందుకు దోమల ఉత్పత్తి నిరోధక చట్టం అమల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇళ్ళ దగ్గర దోమలు పెరిగే వాతావరణం ఉంటే ఆయా ఇళ్ల యజమానులకు జరిమానా విధించడం ఈ చట్టంలోని కీలక అంశం. పట్టణాల్లో, గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేని అంశాన్ని పక్కన పెట్టి, చట్టం పేరుతో ఆదాయంపై దృష్టి సారిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వీటి వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ 279 మంది డెంగీ కారణంగా, 632 మంది మలేరియా కారణంగా మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇటీవల ప్రకటించింది. అధికారిక లెక్కలే ఇలా ఉంటే ఇంక వెలుగుచూడని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్నదబహిరంగ రహస్యమే. డెంగీ కేసులు నమోదు అవుతుంటే, విదేశీ పర్యాటకుల రాకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విజయవాడలో దోమల బెడద గురించి రాష్ట్ర శాసన మండలిలో సైతం చర్చ జరగడం తెలిసిందే. రాష్ట్రంలో దోమలు లేకుండా చేసేందుకు గత ఏడాది దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని దాదాపు 300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టింది. అది ప్రచార ఆర్భాటంగానే మిగిలిందన్న విమర్శలను మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దోమలను నియంత్రించేందుకు దోమల ఉత్పత్తి నిరోధక చట్టం పేరుతో మరో చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ తరహా చట్టం శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు, ముంబయి కార్పొరేషన్‌లో అమల్లో ఉంది. ఆయా దేశాల్లో డెంగీ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో ఈడిస్ దోమలను నియంత్రించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. అక్కడి అధికారులు ఇళ్లను, వాటి పరిసరాలను పరిశీలించి, దోమలు పెరిగేందుకు వీలైన వాతావరణం, దోమ లార్వాతో నీటి నిలువ ఉంటే హెచ్చరికలు జారీ చేస్తారు. తరువాతి దశలో జరిమానా విధిస్తారు. అవసరమైతే భవన యజమానిపై కోర్టులో కేసు వేస్తారు. ఇదే విధానం ముంబయి నగరంలో కూడా అమలు చేస్తున్నారు. ఇళ్లలోని పూల కుండీల్లో, వాటర్ ట్యాంక్‌లు, ఇతర నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి, దోమల లార్వా ఉంటే జరిమానా విధిస్తున్నారు. గత ఏడాది ముంబయిలో 5000 మంది వరకూ నోటీసులు జారీ చేసి, దాదాపు 20 లక్షల రూపాయలను జరిమానా కింద వసూలు చేశారు. ముంబయిలో జరిగిన తనిఖీల్లో ఐదుగురు ఐఎఎస్ అధికారుల ఇళ్లలో కూడా పూల కుండీల్లో దోమల లార్వాలను గుర్తించడం గమనార్హం. సినీ ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వడంతో దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అదే తరహాలో రాష్ట్రంలో కూడా చట్టాన్ని రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయితీరాజ్ శాఖ కసరత్తు చేస్తున్నాయి. ముసాయిదాను రూపొందించి, వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మురుగు కాలువల వ్యవస్థ సరిగాలేదు. మురుగుపారేందుకు వీలు లేక ఇళ్ల ముందే నిల్వ ఉండే పరిస్థితి నెలకొంది. మురుగు నీరు పారుదలకు సరైన వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం విమర్శలకు తావీయనుంది. మంచినీటిలోనే ఈడిస్, తదితర దోమలు పెరుగుతాయి. ప్రజలకు వీటిపై సరైన అవగాహన కల్పించకుండా చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా సరికాదంటున్నారు. దోమల నియంత్రణకు గంబూషియ చేపలు, కప్పలను వినియోగించడం ద్వారా ఫలితాలు ఉంటాయని, చట్టం ద్వారా ఆశించిన ఫలితాలు రావన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దోమల బెడదను అధిగమించేందుకు రాష్ట్రంలో మస్కిటో కాయిల్స్ , ఇతర రిపెల్లెంట్‌లకు 4000 కోట్ల రూపాయల వరకూ ప్రజలు ఖర్చు చేస్తున్నారు. కొత్త చట్టంతో మరోరూపంలో ప్రజలపై భారం పడనుంది.