ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో అద్భుతంగా కళాక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: తెలుగు నేల కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. నేటి అమరావతి ప్రాంతం నుండి ఎందరో కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. అనితర సాధ్యమైన వారి ప్రతిభకు ఇక్కడి కళాక్షేత్రాలు పులకించాయి. ఈ క్రమంలోనే విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ఆవరణలో అత్యాధునిక కళాక్షేత్రం రూపుదిద్దుకోనుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఇందుకు పెద్ద కసరత్తు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాల ఆవరణ 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఎకరం విస్తీర్ణంలోని భవన సముదాయాన్ని మినహాయిస్తే మూడు ఎకరాల స్థలం ఇక్కడ సిద్ధంగా ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సమైక్య రాష్ట్రంలో రవీంద్రభారతి కళావేదికగా సేవలు అందించగా నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆ లోటును తీర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు అనుగుణంగా దాదాపు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కళాక్షేత్రం ఏర్పాటు చేసేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంతం వేదికగా అత్యాధునిక కళాక్షేత్రం అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలు అతి త్వరలోనే కార్యరూపం దాల్చుతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ఆవరణలో దీన్ని నిర్మించాలన్నది తాజా ప్రతిపాదనగా ఉందన్నారు. ఆధునిక హంగులతో పాటు అన్ని రకాల భద్రత, రక్షణ చర్యలతో ఇది రూపుదిద్దుకుంటుందన్నారు. అగ్నిమాపక పరికరాలు, సిసి టివిల ఏర్పాటు వంటి వాటికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కళాత్మకత ఉట్టిపడేలా కళాక్షేత్రం అంతర్భాగం ఉంటుందని, కళాకారుల గళం ప్రతిధ్వనించేలా ఆడియో పరికరాలు కూడా తమ ప్రణాళికలో భాగంగా ఉన్నాయన్నారు. వెయ్యి మంది ఆహూతులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రదర్శనలను నయనానందకరంగా చూడగలిగేలా ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని మీనా వివరించారు. కళాక్షేత్రం అంతర్గతంగా ఎలా ఉంటుందన్న దానితోపాటు పలు రకాల డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలన కోసం సిద్ధం చేసామని ఆయన సూచనలు, అంగీకారానికి లోబడి తుది ప్రణాళిక సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన ఆడిటోరియంతో రెండు మినీ సమావేశ మందిరాలు అనుబంధంగా ఉంటాయని, వీటి సామర్థ్యం 100, 200 మందికి సరిపడేలా ఉంటుందన్నారు. మొత్తంగా 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కట్టడం, అనుబంధ సౌకర్యాలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో పార్కింగ్ కీలక సమస్యగా మారనుండగా దాన్ని అధిగమించేలా 300 కార్ల పార్కింగ్ సౌకర్యం కళాక్షేత్రంలో ఉంటుందన్నారు. కళాకారుల గ్రీన్ రూమ్‌లు సాధారణ సమావేశ మందిరాలతో పాటు ఆధునిక కార్యాలయం, అల్పాహార, ఉపాహార శాలలు, బ్యాక్ స్టేజి వంటి సౌకర్యాలు ఉంటాయని ముఖ్యమైన అతిధులు వేచి ఉండేందుకు ఒక గది నిర్మిస్తామని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ విషయంలో నిధుల పరంగా ముఖ్యమంత్రి తమకు పూర్తి వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. కళాక్షేత్రం నిర్మాణ వ్యయాన్ని సాంస్కృతికశాఖ బడ్జెట్ నుండి భరిస్తామని, ఇందుకోసం రెండు ఆర్థిక సంవత్సరాల నిధులు అవసరమని భావిస్తున్నామని మీనా వివరించారు. ఆధునిక హంగులు, భారీ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నప్పటికీ సగటు కళాకారుడు కూడా దీన్ని వినియోగించుకునేలా చూస్తామన్నారు.