ఆంధ్రప్రదేశ్‌

ని‘బంధనాల’పై గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఫండమెంటల్, సర్వీసు నిబంధనల సవరణ ముసాయిదా వ్యవహారం గందరగోళంగా మారింది. సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ ముసాయిదా ఉత్తర్వులు సిద్ధం చేశారని జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కొరవడింది. ఇలాంటి ఉత్తర్వులే జారీ చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఫండమెంటల్ రూల్స్, పింఛను నిబంధనల్లో మార్పు చేసేందుకు సాధారణ పరిపాలనా విభాగం అధికారులు ముసాయిదా ఉత్తర్వులను సిద్ధం చేశారంటూ ప్రచారం జరుగుతోంది. సాధారణంగా 60 సంవత్సరాల వయసు వస్తే, ఆ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. కానీ సవరణ ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం 35 సంవత్సరాల వయసులో సర్వీసులో చేరితే 50 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు చేరితే 55 సంవత్సరాలకు ప్రతిభను మదింపు చేస్తారని ఆ ముసాయిదాలో పేర్కొన్నారంటూ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక కమిటీ ఉద్యోగి ప్రతిభను సమీక్షించి, ఉద్యోగంలో కొనసాగించాలని సిఫారసు చేస్తేనే కొనసాగింపు ఉంటుందని, లేదంటే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని, నివేదికల ఆధారంగా సర్వీస్ పొడిగింపునకు సిఫారసు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ముసాయిదా జీవోల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులను శనివారం ఎపి ఎన్జీవో నేతలు కలిశారు. ఫండమెంటల్ రూల్స్ సవరణ అంశంపై ఉద్యోగ వర్గాల్లో వస్తున్న ఆందోళనను సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పనితీరు ఆధారంగా బలవంతపు పదవీ విరమణ ప్రతిపాదన సరికాదని, దీనివల్ల రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయని, ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా సర్వీస్ నిబంధనలు మార్చే ప్రయత్నంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బలవంతపు పదవీ విరమణ సరికాదని ఉద్యోగ సంఘాల జెఎసి నేత విద్యాసాగర్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సవరణలకు పాల్పడితే 5లక్షల మంది ఉద్యోగులు సహించే ప్రసక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ 56(1)కు సవరణ చేసే ఆలోచన సరికాదని సిఎస్‌కు తెలిపినట్లు చెప్పారు. బలవంతపు పదవీ విరమణ చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టే ప్రసక్తి లేదని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి ప్రతిపాదనలను తిరస్కరిస్తామని చెప్పారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోమని చెప్పారన్నారు. దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ ప్రచారం ఇలావుంటే, మంత్రి యనమల స్పందిస్తూ ఉద్యోగుల వయోపరిమితిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేయడం గమనార్హం.