ఆంధ్రప్రదేశ్‌

పాలనపై పట్టు తప్పుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 30: మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం అధికారుల అత్యుత్సాహంతో వృథా అవుతోందా? బాబు చేస్తున్న సమీక్షలతో ఫలితాలు రావడం లేదా? పొలిటికల్ మేనేజ్‌మెంట్ లేకపోవడమే సమస్యలకు కారణమా? అధికారులను అందలమెక్కిస్తున్న సీఎం విధానాలే పార్టీ, ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేస్తున్నాయా? సీఎంకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్లిన అధికారుల పెత్తనమే పుట్టిముంచనుందా? అధికారులకు బాబు మితిమీరిన అధికారాలిస్తున్న వైనం ప్రభుత్వం, పార్టీలో అసంతృప్తి పెంచుతోందా?.. గత వారం రోజుల నుంచి జరిగిన రెండు కీలక పరిణామాలకు సంబంధించి వెలువడిన ఉత్తర్వులు ఈ ప్రశ్నలను మరింత బలపరుస్తున్నాయి. ఒకవైపు జగన్, మరోవైపు కుల ఉద్యమాలు, ఇంకోవైపు కేంద్రం నుంచి వస్తున్న ఇబ్బందులను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఒక్కో ఇటుకను పేర్చుకుంటూపోతున్న చంద్రబాబు కష్టాన్ని అధికారులు నీరుగారుస్తున్నారనే ఆందోళన పార్టీ, ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి తెలియకుండా తీసుకుంటున్న సొంత నిర్ణయాలు ప్రభుత్వం, పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయన్న ఆగ్రహం వ్యక్తవౌతోంది. కీలకమైన కాపు ఉద్యమం, ఉద్యోగుల వయోపరిమితి, వారి వివరాలు కోరుతూ ఇచ్చిన ఉత్తర్వు ముసాయిదా నిర్ణయాలు ఆ రెండు వర్గాలను పార్టీకి దూరం చేసేలా ఉన్నాయని, దీనికి తమ అధినేత అధికారులకు ఇస్తున్న అతి చనువే కారణమని పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు ఒకరోజు ముందు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్‌ఐల నుంచి తహశీల్దార్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేరోజు బీసీ కమిషన్ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరుతూ కమిషన్ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నెలరోజుల నుంచి పాదయాత్రపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసి కూడా అప్పటివరకూ వౌనంగా ఉండి ముద్రగడ పాదయాత్రకు ఒకరోజు ముందు రెండు ఉత్తర్వులివ్వటాన్ని బట్టి ముద్రగడను చూసి ప్రభుత్వం భయపడుతోంది కనుకనే వెంటనే స్పందించిందన్న సంకేతాలు ఇచ్చినట్లయిందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక రాజకీయపరమైన వ్యవహారాలున్నాయా? దానివల్ల ప్రభుత్వానికి లాభమా? నష్టమా? ఏ సమయంలో వాటిని విడుదల చేయాలన్న విషయాన్ని సమన్వయం చేసుకోవలసిన సీఎం పేషీ కొన్నాళ్లుగా ఘోరంగా విఫలమయిందని మం త్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఓ అధికారిని నమ్మి పెత్తనమిస్తే ఆయన నాన్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఉద్యోగుల వయోపరిమితి తగ్గింపు, పనితీరు మదింపు, తాజాగా ఉద్యోగుల కులం, రిటైర్మెంట్ వివరాలతో కూడిన నమూనాను రూపొందించడం.. దానిపై పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన జిల్లా అధికారులకు మెమోలు పంపిందన్న వార్తలు ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేస్తున్నాయని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తవౌతోంది. ఇది ఇప్పటివరకూ ఉద్యోగులను దరిచేర్చుకుని, వారితో ఉన్న సానుకూల వాతావరణాన్ని చెడగొట్టి, వారిలో మునుపటి వ్యతిరేకతను మళ్లీ పెంచుకోవడమే అవుతుందని అంటున్నారు. 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన సానుకూలత తెరమరుగైపోయే ప్రమాదం వచ్చిందంటున్నారు. ఇది సహజంగానే వైసీపీ, దానికి మద్దతునిస్తోన్న ఒక వర్గం ఉద్యోగ సంఘాలకు తామే ఆయుధం ఇచ్చినట్లవుతుందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇచ్చిన వివరణతో కూడిన ఖండనను ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని, తాజా పరిణామాలతో తమకు మద్దతునిస్తోన్న ఎన్జీవో సంఘం కూడా, ఉద్యోగుల దృష్టిలో ముద్దాయిగా మారితే అది చివరకు తమకే ప్రమాదంగా పరిణమిస్తుందని మంత్రులు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మెమో నెంబర్ 5373/ సిపిఆర్ అండ్ ఆర్‌డి/ జి1/ 2017; 26-7-2017 పేరుతో ఇచ్చిన కాపీలో ఉద్యోగుల వివరాలివ్వాలని బహిరంగంగా కనిపిస్తున్నా, దాన్ని కొట్టిపారేయటంతో ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు.
‘అసలు అలాంటి ఆలోచన లేకపోతే మెమో ఎందుకు విడుదల చేశారు? ఉద్యోగులకు సంబంధించిన ఇంత కీలకమైన మెమో ఎవరిని అడిగి ఇచ్చారు? బాబుకు గానీ, లోకేష్‌కు గానీ చెప్పారా? మరి సీఎంవోలో సతీష్‌చంద్ర ఏం చేస్తున్నారు? ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు సెక్షన్ల వారీగా స్పష్టంగా కనిపిస్తుంటే దాన్ని కాదని ఎలా బుకాయిస్తాం? అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందో ఊహించకుండానే పాలన జరుగుతుండటం దురదృష్టకరం’ అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇవన్నీ బాబుకు పాలనపై పట్టుతప్పుతోందని, సమీక్షల వల్ల ఫలితాలు రావడం లేదన్న సంకేతాలిస్తున్నాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

దుర్మార్గపు ప్రచారం నమ్మొద్దు: సిఎం

‘ఇది ఉద్యోగులతో స్నేహంగా ఉండే ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచిందే మేము. అలాంటిది ఉద్యోగ వయోపరిమితిని ఎందుకు తగ్గిస్తాం? ఈవిషయంలో జరుగుతున్న కుట్రలను నమ్మవద్దు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఉద్యోగుల సహకారం మర్చిపోలేం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చరిత్రాత్మకం. విభజనను వ్యతిరేకిస్తూ వారు చేసిన కృషి చిరస్మరణీయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది దిగజారుడుతనమని, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాధం పెంచేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, కార్పొరేషన్లలోనూ అదే విధానం అమలుచేస్తున్న ప్రభుత్వం మళ్లీ వయోపరిమితి తగ్గించి, ఆంక్షలు విధిస్తుందని ఊహించడమే తప్పన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఉద్యోగులకు ఫిట్‌మెంట్, వైద్యం, ఇతర సౌకర్యాలు ఇచ్చామని గుర్తుచేశారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల పక్క నిలిపేందుకు తాము చేస్తున్న కార్యక్రమాలకు ఉద్యోగులు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగుల మనసులో విషబీజాలు నాటుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులను ప్రభుత్వం నుంచి వేరుచేసే శక్తుల పట్ల కఠినంగా ఉంటాం. దీనిపై వాస్తవాలు ప్రజలు, ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఉద్యోగుల్లో అశాంతి నెలకొల్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు జరుగుతున్న కుట్రలు, వాటివెనుక కారణాలను గమనించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా అవసరమైతే ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేస్తామే తప్ప, భంగం కలిగించేలా వ్యవహరించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా దుర్మార్గపు ప్రచారాన్ని ఉద్యోగులు విశ్వసించవద్దని, ఉద్యోగుల సమస్యలు ఏమి ఉన్నా నేరుగా తనకు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.