ఆంధ్రప్రదేశ్‌

పురుషోత్తపట్నంనుండి 15నాటికి నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 30: నిర్దేశిత లక్ష్యం మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి మల్లగుల్లాలు పడుతున్న అధికార యంత్రాంగం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానైనా నీరివ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఆగస్టు 15 నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంతో అందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. వాతావరణం అనుకూలించక పైపులు చిత్తడిగావున్న నేలలో కూరుకుపోతున్నాయి. పైపుల కోసం తవ్విన గోతుల్లో నీరు ఊరిపోతోంది. దాదాపు వెయ్యి మీటర్ల మేర పైపులైన్ నిర్మాణం ముందుకు కదలడంలేదు. మరోవైపు పంపుహౌస్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు సబ్-స్టేషన్ నిర్మాణం పూర్తికాలేదు. ఇంకోవైపు మూడు చోట్ల వంతెనల నిర్మాణం పూర్తికాలేదు. ఈ మూడు ప్రధాన ప్రతిబంధకాలను అధిగమిస్తే తప్ప లక్ష్యం మేరకు ఒక పంపు నుంచైనా నీరు అందించే అవకాశం ఉండదు. దీనితో ముఖ్యమంత్రి ప్రకటనను నిజం చేయడానికి జలవనరుల శాఖ అధికారులు కొన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఇందులో భాగంగా తారకరామ ఆవ ప్రాంతంలో మట్టిలో కూరుకుపోతోన్న పైపులను నేల పైభాగంలోనే నిర్మించే విధంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొంది ఆ మేరకు దాదాపు 800 మీటర్ల మేర పైపులైన్‌ను నేల పైభాగంలోనే నిర్మించే ఏర్పాట్లుచేశారు. అవసరమైన విద్యుత్‌ను పుష్కర పథకం విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి గానీ, సీతానగరం సబ్ స్టేషన్ నుంచి గానీ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మూడో ప్రధాన సమస్య మూడు చోట్ల హైవే క్రాసింగ్. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామం వద్ద రహదారిని క్రాసింగ్ చేయాల్సివుంది. అయితే ఈ వంతెనల నిర్మాణం ఇపుడపుడే పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఇక్కడ పైపులైన్ ద్వారా కాలువలను బైపాస్ చేయడానికి జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేపట్టారు. ఈ ప్రత్యామ్నాయాలన్నీ సకాలంలో పూర్తి చేయగలిగితే ఆగస్టు 15 కల్లా నీటిని ఇవ్వగలమనే ధీమాతో అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి సమీక్షలో కూడా ఇదే విషయాన్ని జల వనరుల శాఖ ఇంజనీర్లు స్పష్టంచేయాలని అనుకుంటున్నారు. కాగా ఏదోవిధంగా ఏలేరు రిజర్వాయర్‌ను గోదావరి నీటితో నింప గలిగితే ఉభయ గోదావరితో పాటు, కృష్ణా జిల్లాల్లో ఇదే అతి పెద్ద రిజర్వాయర్‌గా నిలుస్తుంది. ఎందుకంటే 24 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన అతి పెద్ద రిజర్వాయర్ ఏలేరు మాత్రమే. అందుకే ఇది నింపగలిగితే ఇటు ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టుకు గానీ, అటు విశాఖ పారిశ్రామిక నీటి అవసరాలకుగానీ, ఇంకో వైపు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పరీవాహ ప్రాంతాల మంచినీటి అవసరాలకుగానీ నీటి ధీమా ఈ రిజర్వాయర్ నుంచి లభిస్తుందని జలవనరుల శాఖ అధికారులు ధీమా. ప్రస్తుతమైతే ఏలేరు రిజర్వాయర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. డెడ్ స్టోరేజీలో గడుపుతోంది. నిల్వ సామర్ధ్యం మేరకు గోదావరి జలాలతో పూనీతం చేయగలిగితే మాత్రం ప్రధానమైన అవసరాలు తీరుతాయని అంచనావేస్తున్నారు. రిజర్వాయర్ ప్రాధాన్యతను బట్టి కేవలం ఒక్కసారి 24 టిఎంసిలు నింపగలిగితే సహజ నీటి లభ్యతతో పాటు ఎఫ్‌ఆర్‌ఎల్ ను కాపాడుకుంటూ ఇక నీటిని డోకా వుండదని ఆశపడుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన మూడోసారి వాయిదా
సాగునీటి ప్రాజెక్టుల సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి నెలలో ప్రతీ మూడో సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులు వేగవంతంగా నిర్వహించడానికి అవసరమైన లక్ష్యాలను వారం వారం నిర్దేశిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మూడు వారాల క్రితం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి, పోలవరంతో పాటు పురుషోత్తపట్నం పథకం సమీక్షా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లుచేశారు. ఆ సమయంలో వర్షాలు అధికంగా ఉండటంతో హెలీకాప్టర్ దిగే పరిస్థితి లేక ముఖ్యమంత్రి పర్యటన రద్దయింది. తదనంతర సోమవారం వస్తారని వర్తమానం రావడంతో అధికార యంత్రాంగం ఆదరాబాదరా ఏర్పాటుచేసింది. జిల్లా కలెక్టర్ కూడా పురుషోత్తపట్నం పనులను పరిశీలించి వెళ్ళారు. అయితే పర్యటన రద్దయ్యింది. అదే విధంగా 31వ తేదీ సోమవారం కూడా ముఖ్యమంత్రి వస్తారని ప్రభుత్వం నుంచి వర్తమానం అందడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పురుషోత్తపట్నం వద్ద, నేలకోట వద్ద, సీతానగరం వద్ద మొత్తం మూడు చోట్ల హెలీప్యాడ్‌లు ఏర్పాటుచేసి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిముషంలో ముఖ్యమంత్రి పర్యటన రద్దయింది. అయితే ఎందుకనేది అధికారులకు కూడా అర్థం కాలేదు.