ఆంధ్రప్రదేశ్‌

‘ఉద్దానం’ పరిష్కారానికి త్వరపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి విజృంభించింది. దీని నివారణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే, మరింతమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఈ సమస్యపై అధ్యయనం చేసిన నిపుణుల బృందం స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధి ఉద్దానాన్ని వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. జనవరి మూడో తేదీన పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడిన తరువాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. వైద్య బృందాలను అక్కడికి తరలించారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. కానీ వ్యాధి నివారణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పవన్ కళ్యాణ్ ఈమధ్య అమెరికా వెళ్లినప్పుడు హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో సమావేశమై ఈ సమస్య గురించి చర్చించారు. వారిని ఉద్దానానికి రప్పించి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపించారు. మన దేశానికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌లతో కలిసి, హార్వర్డ్ ప్రొఫెసర్లు ఉద్దానం వెళ్లి, అక్కడ బాధితుల సమస్యలు, అక్కడున్న భౌగోళిక, వాతావరణ, వనరులు, సమాజిక పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను విశాఖలో ఆదివారం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు వివరించారు.
అధ్యయన బృందంలో ఒకరైన పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉద్దానం చుట్టుపక్కల ఉన్న ఏడు మండలాల్లో కిడ్నీ వ్యాధి ఉద్ధృతంగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో 4.5 లక్షల మంది ఉంటే, 1.35 లక్షల మందికి ఈ వ్యాధి సోకిందని అన్నారు. సరాసరిన ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ బాధితుడు ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా కలుషిత నీరు తాగడం వలనే కిడ్నీ వ్యాధి వ్యాపించిందని ఆయన వివరించారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిలో స్టేజ్-4కు చేరుకున్న వారిని వెంటనే ఆదుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్టేజ్-2 బాధితుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి నివారణ కోసం వెంటనే ఉద్దానంలో రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సంకురాత్రి ఫౌండేషన్ అధినేత చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్దానంలో ప్రస్తుతం 50 ఏళ్ల వయసు ఉన్న వారిలో ఎవ్వరికీ కిడ్నీ సమస్య లేదని అన్నారు. 20 ఏళ్ళ నుంచి ఈ వ్యాధి ఉద్ధృతం కావడం వలన 40 ఏళ్ల లోపువారు ఎక్కువ మంది కిడ్నీ వ్యాధితో మంచం పట్టారని అన్నారు. కిడ్నీ వ్యాధికి గురైన వారిలో పురుషులు అధిక సంఖ్యలో ఉన్నారని, మహిళలు, చిన్నారులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకుపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన వెంకట్ సుబ్బిశెట్టి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి సమస్య దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ఉందని, వీటిలో ఉద్దానం ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ముఖ్యంగా చెరకు పరిశ్రమలో పనిచేస్తున్న మగవారికి ఈ వ్యాధి సోకిందని అన్నారు. పంటపొలాల్లో క్రిమిసంహారక మందులు చల్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోపోవడం, మద్యానికి బానిసైలైపోవడం, అవసరం లేకపోయినా, కొన్ని రకాల మాత్రలు అదే పనిగా వేసుకోవడం, అత్యధిక తీపితో కూడిన ద్రవ పదార్థాలు తీసుకోవడం వలన కిడ్నీ వ్యాధి సోకిందని చెప్పారు. ఈ వ్యాధిగ్రస్తులందరినీ ఆధార్ లింక్ చేసి, ఒకే చోటికి చేర్చి, వెంటనే వైద్యం అందించాలని వెంకట్ సూచించారు. ప్రపంచస్థాయి రిసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పాలని అన్నారు.
హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ ముఖ్యంగా భూగర్భ జలాలనే వీరు మంచినీరుగా వాడుతున్నారు. ఈ ప్రాంతంలోని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అనేక ఖనిజాలు నీటిని కలుషితం చేశాయని చెప్పారు. దీనికితోడు ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీ వ్యాధికి కారణమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణుడు డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ 1990 నుంచి కిడ్నీ వ్యాధిగ్రుస్తులు శ్రీకాకుళం జిల్లా నుంచి కెజిహెచ్‌కు వస్తుండేవారని అన్నారు. జిల్లాలో వ్యాధి పెరుగుతున్న విషయాన్ని అప్పటి ఎంపి ఎర్రన్నాయుడు పార్లమెంట్‌లో ప్రస్తావించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి అప్పట్లోనే సీక్ అనే సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు. కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు, వ్యాధి ముదరకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించామని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి ఉద్దానం దగ్గరగా ఉంది. అక్కడ నుంచి బాక్సైట్ వంటి అనేక ఖనిజాల రవాణా, తద్వారా వచ్చే కాలుష్యంతో వీరు కిడ్నీ వ్యాధిబారిన పడ్డారని రవిరాజు చెప్పారు. ఉద్దానం పరిసరాల్లోని రిమోట్ ఏరియాల్లో కూడా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ డి.బాబు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలోని సముద్రంలోని బాక్ వాటర్‌లోని సోడియం ఫ్లోరైడ్ వస్తోందని, ఇది భూమిలో నిక్షిప్తమైపోవడం వలన కిడ్నీ వ్యాధి ప్రబలిందని అన్నారు. అంతేకాదు, ఇక్కడ పశువులకు కూడా అనేక రకాల వ్యాధులు సోకాయని చెప్పారు. డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిపై రిసెర్చ్ సెంటర్‌ను ఉద్దానంలో ఏర్పాటు చేసేలోగా తన ఆసుపత్రిలో దీన్ని తాత్కాలికంగా నెలకొల్పుకోవచ్చని ఆయన చెప్పారు.

చిత్రం.. ఉద్దానం సమస్యపై వైద్యులతో చర్చిస్తున్న పవన్ కళ్యాణ్