ఆంధ్రప్రదేశ్‌

ఏ తరహా అణిచివేతనైనా ఎదుర్కొంటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తదితర కులాల మనుగడ కోసం, తన జాతిలో ఉన్న అణగారిన ప్రజల కోసం రాజీలేని రీతిలో పోరాటాన్ని సాగిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే తత్వం కలిగిన తాను జీవితమంతా బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసమే పాటుపడ్డానన్నారు. గృహ నిర్బంధాలే కాదని, ప్రభుత్వం ఎన్నివిధాలుగా అణిచివేత చర్యలకు పాల్పడినా ఉద్యమం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. జాతికి అన్నం పెట్టమని మాత్రమే తాను కోరుతున్నానని, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని మాత్రమే అమలుచేయమని కోరుతున్నానని, అది జరగని పక్షంలో చంద్రబాబు భవిష్యత్తును కాపుజాతి నిర్ణయించే రోజు వస్తుందని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...

(డి శ్రీనివాస్‌కృష్ణ, కాకినాడ)
కాపుజాతికి బిసి రిజర్వేషన్ల కోసం కంకణం కట్టుకుని, ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని, అహోరాత్రులు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం గృహ నిర్బంధంలో ఉండి కూడా ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు గంటన్నర సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వివరించారు.

ప్రశ్న : ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే కుల మతాలకు అతీతంగా అందరి నాయకుడిగా పేరొందారు. ఇపుడు కాపు ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకున్న తరువాత కేవలం కాపు ఉద్యమ నేతగానే మిగిలిపోయే అవకాశం లేదా?
* నన్ను కన్నది నా తల్లిదండ్రులైతే, నన్ను ప్రేమించింది మాత్రం ప్రత్తిపాడు ప్రజానీకం. ప్రత్తిపాడులో కాపులతో పాటు అన్ని కులాల ప్రజలూ ఉన్నారు. ముఖ్యంగా దళిత, గిరిజన, బిసి కులాల్లో అణగారిన ప్రజలు తొలి నుండి నా పట్ల అపారమైన ప్రేమానురాగాలు చూపిస్తూ వచ్చారు. దళితవాడల్లోకి నేను వెళ్తే వారు చూపే ప్రేమాభిమానాలు, వెనుకబడిన వర్గాల వారు నాపై చూపే ఆదరణ ఎన్నటికీ మరువలేను. ఈ కారణంగానే నేడు నేను చేస్తున్న పోరాటానికి కాపుయేతర కులాల నుండి కూడా మద్దతు లభిస్తోంది.
ప్రశ్న : తునిలో జరిగిన కాపుల ఐక్యగర్జన అనంతర పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. తరచూ మీరు నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, గృహ నిర్బంధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడేళ్లలో జరిగిన ఉదంతాల కారణంగా కాపు నేతలు, యువతపై కేసుల వంటి పరిణామాలతో చివరకు ఉద్యమాల పేరు చెబితే విరక్తి కలిగే అవకాశం లేదంటారా?
* లేదు. కాపుల్లో పిరికితనం పోయింది. ఉద్యమాలతో ధైర్యం వచ్చింది. ఎంతగా అణగదొక్కాలని చూసినా లొంగరు. ఈరోజు గ్రామాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన యువతను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో యువత నుండి మహిళల వరకు అక్రమంగా విచారిస్తున్నారు. దీంతో మా సామాజిక వర్గానికి పోలీసులన్నా, పోలీస్ స్టేషన్లన్నా భయం పోయింది.
ప్రశ్న : మీరు దీక్షలు, గృహ నిర్బంధాలతో సాధించిందేమిటి? ఒకవేళ రానున్న రెండేళ్లలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వని పక్షంలో మీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండనుంది?
* చంద్రబాబు భవిష్యత్‌ను కాపుజాతే నిర్ణయించే రోజు వస్తుంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదని ఓ మంత్రి అన్నారు. అదే మంత్రి మళ్లీ నాకు పాదయాత్ర చేయడం ఇష్టం లేదని కూడా చెప్పారు. దమ్ముంటే పోలీసు బలగాలను వెనక్కి పంపండి. అమరావతి వరకు పాదయాత్ర చేసి చూపిస్తా. అలా చేస్తే సదరు మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా? తుని ఘటనకు సంబంధించి ఇటీవల ఛార్జిషీటు దాఖలుచేయాలని చూశారు. ప్రస్తుతం నంద్యాల ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ప్రక్రియ వాయిదా వేశారు. నంద్యాలలో కాపులు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం! ఈ ఒక్క ఉదాహరణ చాలు 2019 ఎన్నికల్లో కాపుల సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి!
ప్రశ్న : కాపు కార్పొరేషన్ ఏర్పాటు, విద్యానిధి, విదేశీ విద్య అవకాశం వంటిని ప్రభుత్వం కల్పించింది కదా? కాపుల సంక్షేమానికి చేస్తున్న కృషిపై మీ స్పందన?
* అవన్నీ పోరాటాల ద్వారా సాధించుకున్నవే! ఇపుడు కూడా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఆ క్రెడిట్ ముద్రగడకు దక్కుతుందన్న భయంతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు దృష్టిలో కాపులు దొంగోళ్లు! మట్టి, మైనింగ్, ఇసుక మాఫియాలపై చర్యలుండవు! బాక్సైట్, లాటరైట్‌లను అక్రమంగా తవ్వుకునే తరలించేవారిపై నిఘా ఉండదు. మా స్వగ్రామం కిర్లంపూడి మాత్రం పాకిస్థాన్‌లో ఉన్నట్టుగా చూస్తున్నారు. పొరుగునే ఉన్న యానాం పుదుచ్చేరి రాష్ట్రంలో ఎలాగుందో, కిర్లంపూడిని కూడా పాకిస్థాన్‌కు చెందిన గ్రామంలా మార్చేశారు.
ప్రశ్న : మీ ఉద్యమం వెనుక జగన్ ఉన్నారని అధికార పార్టీ వారంటున్నారు కదా?
* ఒక్క జగనేంటి? మోదీ కూడా నా వెనుక ఉన్నారని ప్రచారం చేస్తారు. అసలు చంద్రబాబు వెనుకే జగన్ తండ్రి వైఎస్ ఉన్నారన్న విషయాన్ని వారు గ్రహించాలి. తన బావమరిది ఇద్దరిని తుపాకీతో కాల్చి చంపినపుడు ఒక శవం మాయమయ్యింది. అపుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బావమరిదిని రక్షించుకునేందుకు అర్ధరాత్రి ఈ పెద్దమనిషి వైఎస్‌ను వేడుకోలేదా? ఇపుడు ఎవరి వెనుక ఎవరున్నట్టు?
ప్రశ్న : ముఖ్యమంత్రి స్వయంగా చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తారా?
* ఈ విషయాన్ని నేను గతంలోనే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై మాట్లాడేందుకు అధికారికంగా ఒక పత్రాన్ని పంపితే చర్చకు నేను సిద్ధం. అయితే ఆ చర్చలకు ముందుగా మా సామాజిక వర్గం నుండి ఒక బృందాన్ని పంపుతాం. ముఖ్యమంత్రికి, మా సామాజిక వర్గానికి మధ్య జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉంటే చివరకు నేను కూడా చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం. అయితే చంద్రబాబు ఈవిషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాపులే తన కాళ్ల వద్దకు రావాలనేలా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ మా సామాజిక వర్గం రాజీపడి ఆయన అపాయింట్‌మెంట్ కోసం తిరిగితిరిగి చివరకు కలిస్తే, బయటి ప్రపంచానికి దానినే ప్రచారం చేస్తారు. అంటే కాపులే కాళ్ల బేరానికి వచ్చారని, గతిలేని స్థితిలో ఆశ్రయించారంటూ తన కనుసన్నల్లో నడిచే మీడియాతో ప్రచారం చేయస్తారు.
ప్రశ్న : రాష్ట్రంలోని కాపులంతా రిజర్వేషన్ల విషయంలో ఒకే మాట మీదున్నారని అనుకుంటున్నారా?
* గత సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు చంద్రబాబు తప్పుడు హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు. అన్నం పెట్టే వారికన్నా, పదవులు ఇచ్చేవారే గొప్పవారన్న సూత్రాన్ని ప్రయోగించి చంద్రబాబు కాపులను ఆకట్టుకున్నారు. ఏదైనా ఒక ప్రజా సమస్య నుండి పక్కదారి పట్టించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. నేడు రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన కాపులను అణచివేయడం ద్వారా ఇతర కులాలకు కూడా ఆయన ఇవే సంకేతాలిస్తున్నారు. కాపులనే అణచివేస్తే ఇక మనమెంత అని ఇతర కులాల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తున్నారు. కాపులందరూ నేడు చంద్రబాబు మోసాన్ని గమనిస్తున్నారు. మా ఉద్యమంలో ఎలాంటి రాజీ లేదు! 1994లో పుట్టుస్వామి కమిషన్ శాశ్వతంగా ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయమై పరిశీలించి నాటి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. దానిపై వచ్చిన జీవో చెల్లదంటూ చంద్రబాబే హైకోర్టులో కేసు వేయించారు. అయితే ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందని హైకోర్టు చెప్పింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ జీవోను అమలుచేయకుండా కోర్టు తీర్పును బేఖాతరు చేశారు. 30 నంబర్ జీవోను 2016 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చెత్త జీవోగా అభివర్ణించారు. అది ఒకవేళ చెత్త జీవో అయితే మరో మంచి జీవో చంద్రబాబు ఇవ్వచ్చు కదా?
ప్రశ్న : రాష్ట్ర ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంపి, ఎమ్మెల్యేగా పనిచేశారు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు తేడా?
* ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ననె్నంతో ఆదరించారు. ఆరోజుల్లో నాకు తొలిసారిగా ఎక్సైజ్ మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత రవాణా శాఖ మంత్రిగా పనిచేశా. ఆ రోజుల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వేయించాను. పదోన్నతులు కల్పించా. ఆ విషయంలో ఎన్టీఆర్ ప్రోత్సాహాన్ని మరువలేను. నిఖార్సయిన రాజకీయాలు నడిపా! నేటికీ కాపు ఉద్యమంలో ఎవరి వద్దా సొమ్ము ఆశించకుండా, విరాళాల జోలికి వెళ్లకుండా, ఎక్కడా విమర్శలకు తావులేకుండా ముందుకు సాగుతున్నాం. ఈ విషయంలో కొందరు ప్రలోభపెట్టాలని చూసినా అంగీకరించలేదు. ఏదిచేసినా జాతి క్షేమం కోరి చేయడమే నాముందున్న లక్ష్యం!