ఆంధ్రప్రదేశ్‌

నాకే న్యాయం జరగలేదు.. ఇక సామాన్యుల మాటేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 31: ‘ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాపై ఎటువంటి విచారణ జరపకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, భూ కబ్జా, రికార్డుల టాంపరింగ్ ఆరోపణలపై సిట్ కేసు నమోదు చేసిందంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ప్రశ్నించారు. ఆనందపురం మండలం రామవరంలో 105 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, దీనికి సంబంధించిన రికార్డుల టాంపరింగ్ జరిగిందని విశాఖ భూ కుంభకోణాలపై విచారణ జరుపుతున్న సిట్ ప్రాథమిక నిర్థారణకు రావడంతో పీలా గోవింద్ సహా 11 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణను ఎ8గా చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న గోవింద్ విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించి తనకు న్యాయం చేయమని కోరారు. సిట్ దర్యాప్తు జరుపుతుందని చంద్రబాబు చెప్పడంతో వెనుదిరిగిన పీలా తనకు దఖలుపడిన భూమికి సంబంధించిన రికార్డులను, తన భూమిని విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు ఏవిధంగా తీసుకునేందుకు ప్రయత్నించారన్న అంశాలను సాక్ష్యాధారాలతో సహా పీలా గోవింద్ సోమవారం కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు అందించారు. ఆ తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రామవరం గ్రామలంలోని సర్వే నెంబర్ 127, 128, 130/1, 130/2లోని 105 ఎకరాల భూమిని పాకలపాటి బైరాగి రాజు నుంచి తన తండ్రి 1981 నుంచి 1995 వరకూ 10(1) అడంగళ్ ఆధారంగా కొనుగోలు చేశారని అన్నారు. బైరాగి రాజు పేరున 105 ఎకరాల భూమిపై వివాదం తలెత్తినప్పుడు విచారణ జరిపి, ఆ భూమి బైరాగి రాజుకు చెందిందేనని నిర్థారించి, అతని వద్ద తాము కొనుగోలు చేసిన 95 ఎకరాలకు రెండోసారి పట్టాలు ఇచ్చారని పీలా చెప్పారు. ఏడాదిన్నర కిందట విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు తన వద్దకు వచ్చి తన భూమిని డవలప్‌మెంట్‌కు ఇవ్వాలని కోరారని, ఇవ్వకపోతే, ఇబ్బంది పడతారని బెదరించారని పీలా గోవింద్ ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి తను, తన కుటుంబ సభ్యులపై సిట్‌కు కొంతమంది కావాలని ఫిర్యాదు చేశారని పీలా అన్నారు. ఎటువంటి విచారణ జరపకుండా, తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనపై కేసు నమోదు చేసిందని పీలా ఆరోపించారు. ఆర్డీఓ సూచనల మేరకు తనపై కేసు నమోదు చేసినట్టు సిట్ అధికారులు పేర్కొనడం విచిత్రంగా ఉందని అన్నారు. ఈ కేసు నమోదుకు ముందే, ఈనెల 12న తనకు దఖలుపడిన భూముల పట్టాదారు పాస్ పుస్తకాలను ఆర్డీవో రద్దు చేశారని ఆయన ఆరోపించారు. మొత్తం 105 ఎకరాల భూమిలో 95 ఎకరాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన రద్దు చేసి మిగిలిన 10 ఎకరాలను ఎందుకు వదిలిపెట్టారని పీలా గోవింద్ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపిన ఆర్డీఓ ఆ భూములకు నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ కూడా మంజూరు చేశారని పీలా ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్‌ను దెబ్బకొట్టేందుకే కొంతమంది కుట్ర పన్నుతున్నారని పీలా అన్నారు. అన్ని వివరాలు కలెక్టర్‌కు చెప్పానని, నిర్ణయం తీసుకోవలసింది ఆయనేనని అన్నారు.

చిత్రం.. తన భూములకు సంబంధించిన రికార్డులను కలెక్టర్‌కు అందచేస్తున్న ఎమ్మెల్యే పీలా