ఆంధ్రప్రదేశ్‌

సిట్‌పై ‘అధికార’ దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 1: విశాఖ భూ కుంభకోణాలపై విచారణ చేపట్టడానికి సాక్షాత్తూ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)పై అధికార పక్ష నాయకులు దుమారం లేపుతున్నారు. విశాఖ భూ కుంభకోణాలపై సిబిఐతో విచారణ జరిపించాలని విపక్షాలన్నీ ఏకమై డిమాండ్ చేసినా, ప్రభుత్వం సిట్‌ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే వ్యవస్థ కాబట్టి సిట్‌పై ముందు చాలా మందికి అనుమానాలు ఉండేవి. రానురాను నిస్పాక్షిక దర్యాప్తు జరుగుతోందని అంతా నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సిట్ దర్యాప్తును తప్పుపట్టడం వివాదాస్పదమైంది. అంతేకాదు, రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆనందపురం మండలం రామవరంలో 95 ఎకరాల భూమికి సంబంధించి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ భూమి విషయంలో ఎటువంటి దర్యాప్తు లేకుండా, కనీసం తనకు నోటీసు కూడా ఇవ్వకుండా కేసు నమోదు చేశారని పీలా గోవింద్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పీలా చెప్పినట్టు రామవరంలోని 95 ఎకరాల భూమిలో సుమారు 65 ఎకరాల భూమి తమదని స్పష్టం చేశారు. ఆ భూమిని సుమారు 40 సంవత్సరాల నుంచి తాము అనుభవిస్తున్నామని కూడా చెప్పారు. ఇటీవల విశాఖ ఆర్డీవో ఈ 95 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్లను రద్దు చేశారు. ఇందులో 48 ఎకరాలు ప్రభుత్వ భూమి కాబట్టి, దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 47 ఎకరాలు తమదంటే తమదని పీలా గోవింద్, ఆయన కుటుంబ సభ్యులు, పాకలపాటి కుటుంబీకులు పరస్పరం క్లైం చేసుకోవడంతో దీన్ని సివిల్ కోర్టులో తేల్చుకోమని ఆర్డీవో చెప్పారు. సిట్ దర్యాప్తులో ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది. దీంతో పీలా సహా 11 మందిపై పోలీస్ కేసు నమోదైంది. ఇందులో పీలా ఎ8గా ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో సిఎం చంద్రబాబును పీలా నేరుగా కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. దర్యాప్తులో అంతా తేలుతుందని ముఖ్యమంత్రి పీలాకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీలా సోమవారం సిట్‌పై, ఆర్డీవోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిట్ తనకు నోటీసులు ఇవ్వలేదని, కనీసం దర్యాప్తు కూడా జరపకుండా తనపై కేసుపెట్టిందని చెప్పుకొచ్చారు. సాక్ష్యాధారాలు లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు అధికారులు కేసు నమోదు చేయరు. కానీ తనకు అన్యాయం జరిగిందంటూ పీలా గోవింద్ చేస్తున్న వ్యాఖ్యలపై స్వపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనిపై మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వాస్తవం వేరు, ఆరోపణలు వేరు అని అన్నారు. దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలను పరిశీలించి చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. పీలా వ్యాఖ్యలపై సిట్ అధికారులు స్పందించారు. సిట్ పారదర్శకంగా విచారణ జరుపుతోందని అన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై కూడా గత అధికారులు, తహశీల్దారులు, డిప్యూటీ కలెక్టర్లు తమకు నివేదికలు ఇచ్చారని సిట్ అధికారులు పేర్కొన్నారు. సిట్ విచారణకు, పోలీస్ కేసు దర్యాప్తు విధానానికి తేడా ఉంటుందని అన్నారు. సిట్ విచారణలో ప్రాథమిక విషయాలు సేకరించి, నేరపూరిత చర్యలు గుర్తించినప్పుడు విచారణ బృందం పోలీసు దర్యాప్తునకు సిఫారసు చేస్తుందని చెప్పారు. పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ పరిధిలో దర్యాప్తు చేస్తుందని తెలిపారు. వ్యక్తులనుబట్టి తాము విచారణ చేయడం లేదని, అందరినీ సమాన దృష్టితో చూస్తున్నామని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా అవినీతి నిరోధక చట్టం 1988 13(1) (సి)(డి) రెడ్ విత్ 13(2) ప్రయోగించి దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
సిట్ ఇంత పకడ్బందీగా దర్యాప్తు చేస్తుంటే, అధికారపక్ష నాయకులే సిట్ అధికారులపై దుమారం లేపడం ఎంతవరకూ సమంజసం? సిట్ ముక్కు సూటిగా దర్యాప్తు జరిపితే, తమకు ఏం ముప్పు వాటిల్లుతుందోనని పీలా గోవింద్‌ను ముందు పెట్టి కొంతమంది అధికార పార్టీ నేతలే కథ నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మి నియమించిన సిట్‌పై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు దుమారం లేపడంపై పలువురు ఆక్షేపణ తెలుపుతున్నారు.