ఆంధ్రప్రదేశ్‌

బంధం బలపడుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 1: తెలుగుదేశం-జనసేన బంధం బలపడుతోందా.. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో సమస్యల సుడిగుండంలో ఉన్న అధికారపార్టీకి జనసేన మరోసారి దన్నుగా నిలబడనుందా.. టిడిపిపై జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సానుకూల వైఖరి కాపుల ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీని నిరాశకు గురిచేస్తోందా.. తాజాగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్వయంగా స్పందించి, హార్వర్డ్ వైద్యబృందాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వంతో కీలక నిర్ణయాలు వెలువరించేలా చేసిన పవన్ కల్యాణ్ ఇమేజ్ పెరిగింది. ఒకవిధంగా ఆయన ఇమేజ్ పెరిగేందుకు టిడిపి ప్రభుత్వమే సహకరించినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో కూడా పవన్ రాజధాని భూముల సహా వివిధ అంశాలపై గళం విప్పిన వెంటనే చంద్రబాబునాయుడు స్పందించి, మంత్రులను అక్కడికి పంపించడం ద్వారా.. పవన్ సూచనలను తాము గౌరవించి అమలుచేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. తాజాగా సోమవారం బాబుతో పవన్ భేటీ అయిన సందర్భంలో, కిడ్నీ రోగుల ప్రయాణాలకు ఉచిత సౌకర్యం కల్పించాలని, ఆ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలను దత్తత తీసుకోవాలని చేసిన పవన్ సూచనను కూడా బాబు అంగీకరించి, అక్కడికక్కడే నిర్ణయాలు ప్రకటించడం ద్వారా తమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు. పవన్ తాజా పర్యటనకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కూడా చర్చనీయాంశమయింది. సహజంగా సచివాలయంలోని సీఎం బ్లాక్‌లో ఆయన వాహనం తప్ప, మిగిలిన వారి వాహనాలు అనుమతించరు. చివరకు లోకేష్ వాహనం కూడా సీఎం బ్లాక్ వరకే వెళుతుంది. అంత కఠినంగా ఉండే సీఎం బ్లాక్ లోపలికి పవన్ వాహనాన్ని అనుమతించడం, ఆయన వ్యక్తిగత అంగరక్షకులను ఎక్కడా ఆపకుండా సచివాలయం లోపలికి అనుమతించడం, పవన్ ఎక్కకపోయినా ఆయనకు ప్రభుత్వవాహనంతోపాటు, కాన్వాయ్ కూడా అధికారికంగా ఏర్పాటుచేయడం, ఆయన బస చేసి మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ప్రైవేట్ హోటల్ ప్రాంతాన్ని సెక్యూరిటీ జోన్‌గా మార్చి రోప్‌టీము, 100 మంది పోలీసుల భద్రతతో సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పించారు. ఫలితంగా జనసేనతో తన బంధం బలంగానే ఉందన్న సంకేతాలివ్వడంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. బాబు స్వయంగా పవన్‌ను తన చాంబరుకు తీసుకువెళ్లి, తిరిగి ఆయనను స్వయంగా సాగనంపడం ద్వారా పవన్‌కున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. దానితోపాటు కిడ్నీ రోగుల కోసం చేపట్టిన జీవన్‌దాన్ కార్యక్రమానికి పవన్‌ను అంబాసిడర్‌గా ఉండాలని బాబు కోరటం, అందుకు ఆయన కూడా అంగీకరించటం చూస్తే పవన్ కూడా టిడిపి వైపు సానుకూలంగానే ఉన్నారన్నది స్పష్టమయింది. మీడియా సమావేశంలో కూడా పవన్ ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కాపుల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరినే తప్పుపట్టారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాలలో ఎవరికి మద్దతునివ్వాలన్న అంశంపై రెండురోజుల్లో ప్రకటిస్తానని పవన్ చెప్పారు. ఆ ప్రకారంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయనపై ఎవరూ పోటీపెట్టకూడదన్న సంప్రదాయాన్ని గౌరవించి, భూమా కుటుంబాన్ని గెలిపించాలని ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. ఉద్దానం అంశంతో మళ్లీ తెరపైకికొచ్చిన పవన్.. కాపులకు రిజర్వేషన్లు త్వరగా ఇచ్చి, సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని గళం విప్పిన వైనం అటు వైస్సార్‌సీపీకి శరాఘాతంగా పరిణమించింది. ముద్రగడ పాదయాత్ర, ఉద్యమాలకు బహిరంగంగా మద్దతునిస్తున్న వైసీపీ.. ఆయన ఉద్యమం ద్వారా కాపులలో పోగయ్యే టిడిపి వ్యతిరేకతను, తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఇప్పటివరకూ భావిస్తోంది. అయితే, పవన్ తొలిసారిగా తాను కాపు కులానికి చెందిన వాడినేనని చెప్పడంతోపాటు, కులం గురించి మాట్లాడాల్సిన అవసరం, సమయం వచ్చిందని ప్రకటించారు. దీనితో సహజంగానే కాపు యువకులు, కాపునాడు వర్గాల్లో ఉత్సాహం కనిపించింది. సోమవారం గన్నవరం నుంచి హోటల్ వరకూ జరిగిన పర్యటనలో కాపు యువకులే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. పవన్ వైపు కాపువర్గం మొగ్గు చూపిస్తే, ఇప్పటివరకూ ముద్రగడ రూపంలో పెంచిన ప్రభుత్వ వ్యతిరేకత వృథా అవుతుందన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. ‘పవన్ ఇప్పటిదాకా కాపుల గురించి మాట్లాడలేదు కాబట్టి, ముద్రగడ ప్రభావంతో మా యూత్ ఈసారి మాకే ఓట్లు వేస్తారనుకున్నాం. కానీ ఆయన హటాత్తుగా తాను కాపునేనని చెప్పి మా అంచనాలు తారుమారు చేశారు. ఇది ఒకరకంగా మాకు నష్టమే. ముద్రగడంటే అందరికీ గౌరవం ఉన్నా, పవన్ ఇమేజ్ ముందు అది సరిపోదు. దీన్నిబట్టి రాబోయే ఎన్నికల్లో టిడిపితోనే పవన్ వెళతారని అర్థమవుతోంద’ని వైసీపీకి చెందిన ఓ కాపు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.