ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ రాజుకున్న రాజోలి బండ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 1: ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు నీరందించే రాజోలిబండ వివాదం మళ్లీ రాజుకుంది. తెలంగాణ, కర్నాటక ప్రాంతాలకు వెళ్ళే ఎడమ కాలువ స్లూయిస్ వద్ద పూడిక తీత పనులు చేస్తున్నారంటూ సీమ ప్రాంతానికి చెందిన రైతులు మంగళవారం పనులను అడ్డుకున్నారు. గత నాలుగు రోజులుగా రాజోలిబండ వద్ద పూడిక తీత పనులు సాగుతున్నాయి. మూడు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల ఎస్‌ఇలు తీసుకున్న నిర్ణయం మేరకు పూడిక తీత పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సాగుతున్న పూడిక పనుల వల్ల తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకే మేలు జరుగుతుందని, సీమ ప్రాంతం వైపు పూడిక తీత పనులు సాగడం లేదని, ఫలితంగా నీరు వస్తే అదంతా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల వైపు ఎక్కువ సరఫరా అవుతుందని సీమ ప్రాంతం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మంత్రాలయం నియోజకవర్గం బిజెపి ఇన్‌చార్జి శివన్న, వైకాపా నాయకులు మురళీరెడ్డి రైతులతో కలిసి రాజోలిబండ ఆనకట్ట వద్దకు చేరుకుని పూడిక తీత పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది. పూడిక తీత పనులను పర్యవేక్షణ చేస్తున్న నీటి పారుదలశాఖ ఎఇ శ్రీనివాసరెడ్డితో నాయకులు వాగ్వివాదానికి దిగారు. మూడు రాష్ట్రాల ఎస్‌ఇలు కూర్చుని నిర్ణయం తీసుకున్నప్పుడు సిడబ్ల్యూసి అనుమతి ఎందుకు తీసుకోలేదని బిజెపి నాయకులు శివన్న అధికారులను నిలదీశారు. కర్నూలు జిల్లా కలెక్టర్, ఆదోని ఆర్డీఓకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పూడిక తీత పనుల వల్ల కర్నాటక, తెలంగాణకే మేలు జరుగుతుందని అందువల్లే తాము రాజోలిబండ ఆనకట్ట పూడిక తీత పనులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బిజెపి నాయకులు శివన్న స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కర్నూలు జిల్లా అధికారులతో చర్చించి మూడు రాష్ట్రాలకు నష్టం లేని విధంగా పూడిక తొలగొంచే పనులు చేపట్టాలని శివన్న డిమాండ్ చేశారు. అంతవరకు పూడిక పనులు నిలిపివేయాలన్నారు. రాత్రిపూట మాత్రమే యంత్రాలతో ఎందుకు పనులు చేస్తున్నారని అధికారులను నిలదీశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటిని సరఫరా చేసే స్లూయిస్ వద్ద మాత్రమే పూడిక తొలగించే పనులు సాగితే సీమ ప్రాంతాలకు నీటి సరఫరా జరగదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం.. రాజోలిబండ ఆనకట్ట వద్ద జరుగుతున్న పనులను అడ్డుకుంటున్న సీమ రైతులు