ఆంధ్రప్రదేశ్‌

నర్సరీలకు విద్యుత్ బిల్లుల శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, ఆగస్టు 14: నర్సరీలకు విద్యుత్తు మీటర్ల బిగింపును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు సోమవారం దేశవ్యాప్తంగా మొక్కలు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేశారు. ఏడు గంటల పాటు నిరవధిక ఆందోళనకుదిగారు. గత ప్రభుత్వాలు నర్సరీలకు ఉచిత విద్యుత్‌ను అమలుచేశాయని, ప్రస్తుత ప్రభుత్వం నర్సరీలపై విద్యుత్ బిల్లుల భారం మోపే ప్రయత్నం చేస్తోందంటూ నర్సరీ రైతులు ఈ ఆందోళనకు దిగారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వందలాది నర్సరీ రైతులు బైఠాయించి, నిరసన స్వరాలు వినిపించారు. ఆల్ ఇండియా నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, కడియం నర్సరీ రైతుల సంఘం అధ్యక్షుడు పుల్లా చంటి మాట్లాడుతూ 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉద్యానవన రంగాన్ని కూడా వ్యవసాయ రంగంగా పరిగణిస్తూ ఉచిత విద్యుత్‌ను అమలుచేశారని, ఆయన మరణానంతరం సిఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగించారన్నారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ నర్సరీ రైతులపై విద్యుత్ బిల్లుల వసూళ్లకు వత్తిడి పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో నర్సరీ రైతులంతా నేరుగా సిఎంకు విన్నవించామని, ఆయన ఆదేశాలతో మూడేళ్లపాటు ఎటువంటి వత్తిడీ లేదని, గత ఆరు నెలలుగా నర్సరీలకు మీటర్లు బిగిస్తూ పాత బకాయిలు కూడా చెల్లించాలంటూ విద్యుత్ అధికారులు వేధిస్తున్నారన్నారు. కొన్ని నర్సరీలకు విద్యుత్ శాఖ మోటార్ కనెక్షన్లు కూడా తొలగించిందన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నర్సరీ రైతులు హెచ్చరించారు. నర్సరీ రైతులకు వైసిపి గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, రూరల్ కోఆర్డినేటర్లు గిరజాల బాబు, ఆకుల వీర్రాజులు మద్దతు పలికారు. నర్సరీ రైతులు ఉదయం నుంచీ ప్రారంభించిన నిరసన కార్యక్రమాన్ని మధ్యాహ్నం భోజనాన్ని కూడా అక్కడేచేసి తిరిగి ఆందోళనకు దిగారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నర్సరీ రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. నర్సరీలకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా తానూ శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యను వివరిద్దామని, అందుకు నర్సరీ రైతులు కూడా సన్నద్ధం కావాలని గోరంట్ల సూచించారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో నర్సరీ రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, నర్సరీ రైతులు రావిపాటి రామచంద్రరావు, గట్టి నర్సయ్య, వెలుగుబంటి నాని ఉన్నారు.

చిత్రం.. కడియంలో ఆందోళన చేస్తున్న నర్సరీ రైతులు