ఆంధ్రప్రదేశ్‌

అక్కడాయన..ఇక్కడీయన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 15: ప్రభుత్వం ఏటేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తరీతిలో సాగాయి. జిల్లా కేంద్రంతో ఏలూరుతోపాటు, ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరులో ఘనంగా జరిగాయి. ఏలూరులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, నియోజకవర్గ కేంద్రం కొవ్వూరు వేడుకల్లో మంత్రి కెఎస్ జవహర్ పతాకావిష్కరణ జరిపారు. పేరుకు నియోజకవర్గస్థాయిలో అని పేర్కొన్నా జిల్లా కేంద్రం ఏలూరుకు సమాంతరంగా ఈ వేడుకలు జరగడం విశేషం. జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా రెండు చోట్ల వేడుకలు నిర్వహించడంతో రాజకీయ వర్గాలు, అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఏదేమైనా జిల్లాలో మాత్రం కొత్త సంప్రదాయానికి ఈవిధంగా తెరతీసినట్లే కన్పిస్తోంది. మంగళవారంనాటి పరిణామాలను పరిశీలిస్తే జిల్లా కేంద్రం ఏలూరులో ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఆయన ముఖ్య అతిథి ప్రసంగం చేసి, జిల్లా యంత్రాంగం తరపున ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. దాదాపు అదే సమయంలో నియోజకవర్గ కేంద్రం కొవ్వూరులో రాష్ట్ర మంత్రి కెఎస్ జవహర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్న స్వాతంత్య్ర వేడుకలు కూడా వైభవంగా సాగాయి. ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగం చేశారు. అంతకుముందు పోలీసులు, ఎన్‌సిసి విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో తొలిసారిగా ఈ వేడుకలను కొవ్వూరు ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మంత్రి పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలను కూడా అందజేశారు. జిల్లా చరిత్రలో ఈవిధంగా రెండు వేడుకలు నిర్వహించటం జరగలేదని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. అధికారిక వేడుకలను సమాంతరంగా నిర్వహించటం సమంజసం కాదన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతోంది. జిల్లా యంత్రాంగం ముందస్తు అనుమతితోనే కొవ్వూరు ఆర్డీవో ఈ వేడుకలు నిర్వహించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.