ఆంధ్రప్రదేశ్‌

పతాకస్థాయికి నంద్యాల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 18: నంద్యాల శాసన సభా స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచారానికి మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పోటీదారులైన టిడిపి, వైకాపా నేతలు విరామం లేకుండా పని చేస్తున్నారు. వైకాపా అధినేత గత 10 రోజులుగా నంద్యాలలో మకాం వేసి ఏకంగా ఇంటింటి ప్రచారానికి తెరదీశారు. వారం రోజులు రోడ్‌షో నిర్వహించిన ఆయన పట్టణంలోని వీధివీధి తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి విజయం కోసం కృషి చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి శనివారం నంద్యాల చేరుకోనున్నారు. ఆయన ప్రధానంగా రోడ్‌షోల ద్వారానే ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైకాపా అధినేత జగన్, ఎమ్మెల్యే రోజా చేసిన వ్యక్తిగత విమర్శలపై చంద్రబాబు ధీటుగా సమాధానం ఇస్తారని టిడిపి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా తనను కాల్చి చంపాలని, ఉరి తీసి చంపాలని విపరీత విమర్శలకు దిగిన జగన్‌పై చంద్రబాబు ఎదురుదాడికి దిగడం ఖాయమని వారు వెల్లడిస్తున్నారు. రెండు రోజుల్లో నంద్యాల పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలు, గోస్పాడు మండలంలో ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రచార కార్యక్రమంలో భాగంగా పోలింగు రోజు నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ముఖ్యమంత్రి భూమా అఖిలప్రియ, అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు పార్టీ ఇతర నేతలకు దిశానిర్ధేశ్యం చేయనున్నారు. కాగా కొత్తగా పార్టీలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి నంద్యాలకు చేరుకున్నారు. వ్యక్తిగతంగా పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం ఇప్పటికే పని ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా గోస్పాడు మండలంపై దృష్టి సారించి వైకాపాకు బలంగా ఉన్న గ్రామాల్లో తన సత్తా చూపించి అక్కడ టిడిపికి మెజారిటీ తీసుకువస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.
నాయకుల పరిస్థితి ఇలా ఉండగా వైకాపా అధినేత జగన్ ఉన్న సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబు కూడా నంద్యాలకు వస్తున్నందున శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితిపై డిజిపి సాంబశివరావు శనివారం స్వయంగా పరిశీలించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. కర్నూలు రెండవ బెటాలియన్ నుంచి రెండు ప్లాటూన్ల బలగాలు ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరగా మంగళగిరి, విశాఖపట్టణం నుంచి శనివారం ఉదయానికి మరో ఐదు ప్లాటూన్లు నంద్యాలకు చేరుకుంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎన్నికల కమిషన్ విన్నపం మేరకు కేంద్రం 7 పారా మిలిటరీ బలగాలు పంపుతోందని వారు ఆదివారం నాటికి విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. నంద్యాల ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరుకోవడంతో పాటు ఇరుపార్టీల అధినేతలు ఏకకాలంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.