ఆంధ్రప్రదేశ్‌

చలో కిర్లంపూడితో సర్కారుకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 19: చలో అమరావతి పిలుపుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు చలో కిర్లంపూడి కార్యక్రమాన్ని నిర్వహించాలని కాపు జెఎసి పిలుపునిచ్చింది. చలో అమరావతి అంటూ ముద్రగడ నినదిస్తుంటే చలో కిర్లంపూడి అంటూ కాపులు కిర్లంపూడికి కదం తొక్కుతున్నారు. గత రెండురోజులుగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి ఇతర జిల్లాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వాహనాల్లో వారు వస్తుండటంతో జనసందడితో కిర్లంపూడి కిటకిటలాడుతోంది. గతనెల 26వ తేదీన తలపెట్టిన ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుండి ప్రతిరోజూ పాదయాత్రకు బయలుదేరడం, పోలీసులు అడ్డుచెప్పడంతో నిరసన తెలియజేసి వెనక్కి మళ్లడం జరుగుతోంది. గత రెండురోజులుగా ముద్రగడ తన ఇంటి గేటు వద్దే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలియజేశారు. కుర్చీలో కూర్చుని ఆయన తన నిరసన దీక్షను ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా ముద్రగడకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనను కలిసేందుకు వచ్చినవారికి పెద్దగా ఆటంకాలు కలిగించడంలేదు. కాపు జెఎసి నాయకులు కూడా తమదైన రీతిలో రోజుకోవిధంగా నిరసన తెలియజేస్తున్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనం వచ్చారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణలు ముద్రగడను కలిసి సంఘీభావం తెలియజేశారు. వారితోపాటు తోట రామకృష్ణ, దొడ్డి పార్థసారధి, బండి పట్ట్భారామ్, సుంకర వెంకటరెడ్డి, భారీ సంఖ్యలో కాపు యువత, కాపు సంఘాలు ముద్రగడను కలిశారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చేవరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టంచేస్తున్నారు. తన పాదయాత్రకు ఆటంకం కలిగించే ధోరణిని కొనసాగిస్తే తాను వేరే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన స్పష్టంచేశారు. దీన్ని కూడా పోలీసులు భగ్నం చేస్తే ఆరోజుకు ఆగి మరునాడు వెంటనే పాదయాత్రగా ముందుకు సాగుతానన్నారు. అక్కడ జరిగే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముద్రగడ హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తనదైన శైలిలో పలు విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రకు అనుమతి ఉందా అని తాను పలుసార్లు ప్రశ్నించానన్నారు. తాను కూడా పాదయాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు ఫార్మేట్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సమాధానం లేదన్నారు. ఉన్నతాధికారులు గతంలో చంద్రబాబు పాదయాత్రకు అనుమతి ఉందని చెబుతున్నారే తప్ప సంబంధిత అనుమతి పత్రాలు తనకు ఇవ్వమని కోరితే సమాధానం దాటవేస్తున్నారని ఈ సందర్భంగా ముద్రగడ అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ లేని ఇబ్బందులు కాపులు చేసే పాదయాత్రకే సృష్టిస్తుందన్నారు. కాపులకు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీనే అమలుచేయాలని రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే కాపు జాతిని పోలీసుల ద్వారా అణచివేసే కార్యక్రమం చంద్రబాబు చేపట్టారన్నారు. చంద్రబాబు తన కుమారుడ్ని దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకున్నారని, అలాగే భవిష్యత్తులో ఆయన ముద్దుల కుమారునికి ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టాలనే తపన చంద్రబాబు నాయుడు ఉండవచ్చుగానీ, బిసి రిజర్వేషన్ పొందాలనే ఆకాంక్ష, ఆరాటం కాపుజాతికి ఉండకూడదా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ నిరసన దీక్షలో కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, రౌతు స్వామి, వైవి దాసు, జి వెంకటరమణ, గోపు అచ్యుతరామయ్య, ఆరేటి ప్రకాష్, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ, ప్రత్తిపాడు, తుని, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన కాపులు పాల్గొన్నారు.

చిత్రం..కాపు జెఎసి నేతలతో నిరసన దీక్షలో మాజీ మంత్రి ముద్రగడ