ఆంధ్రప్రదేశ్‌

క్షేత్రస్థాయిలో పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: విద్యాశాఖ అధికారులు తరచూ పాఠశాలలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళితేనే సమస్యలకు పరిష్కార మార్గాలు అర్థమవుతాయన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, పూర్తయిన చోట నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవా దృక్పథం కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థలకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను అప్పగించాలని చెప్పారు. అధికారులు ఇక్కడ (కార్యాలయాలు) కూర్చుని సమస్యలకు కారణాలు వెతికితే పరిష్కారం కనిపించదని ఆయన అన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ బాగా ఉన్నచోట అనుసరిస్తున్న విధానాలను వెళ్లి పరిశీలించి, బాగాలేనిచోట అమలుచేసేలా చూడాలని చెప్పారు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. గత నెలలో మూడు జిల్లాల పరిధిలో 8 పాఠశాలలను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు. ఈ విధంగానే మిగిలిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని చెప్పారు. విద్యా ప్రమాణాలు పాటించని ఎయిడెడ్ పాఠశాలలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వాటి నుంచి భారీ స్థాయిలో అపరాధ రుసుం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు విద్యా ప్రమాణాల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని చెప్పారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో అందించే నాణ్యమైన విద్య పైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. నాలెడ్జ్ సొసైటీకి ప్రాథమిక విద్యే మూలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రైమరీలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే అప్పర్ ప్రైమరీలో 35 మందికి, సెకండరీలో 40 మందికి ఒకరు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారని అధికారులు చెప్పారు. సమీక్ష సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
ఐటిడిఏల పనితీరు మెరుగుపడాలి
ఏజెన్సీలో ఐటిడిఎల పనితీరు మెరుగుపడితేనే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని సిఎస్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని పరిస్థితులపై గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం సిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న చాపరాయి ఘటనను సిఎస్ ప్రస్తావించారు. కలుషిత నీరు తాగి పలువురు గిరిజనులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇవి పునరావృతం కాకుండా ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.