రాష్ట్రీయం

సర్దార్ పటేలే నాకాదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 27: సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శమని, అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కె అద్వానీ అంటే తనకెంతో అభిమానమని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఆదివారం ఆయన వివిధ కళాశాలల విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. గతం లో కేంద్ర మంత్రిగా, ప్రస్తు తం ఉప రాష్టప్రతిగా ఇక్కడకు వచ్చినపుడు స్వర్ణ్భారతి ట్రస్ట్ భవనంలో బస చేయటంపై కొందరు ప్రశ్నించగా.. హోటళ్లలో ఉంటే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందనే ఇక్కడకు వస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. మీ విజయాలకు ఫార్ములా ఏమిటని చరిత అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో ప్రజలకు సేవచేయటమని ఉప రాష్టప్రతి చెప్పారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నా రోల్‌మోడల్. దేశంలో వివిధ సంస్థానాలను విలీనం చేసిన మహనీయుడు. వేర్పాటువాదాన్ని కఠినంగా అణచివేశారు’ అని సమాధానంలో పేర్కొన్నారు. మరో విద్యార్థిని నిషిత వివిధ సబ్జెక్టుల్లో విజ్ఞానం సంపాదించడం ఎలా అని ప్రశ్నించగా.. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారి అనుభవాలు తెలుసుకోవడం, పుస్తక పఠనం, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను సందర్శించడం, వివిధ వర్గాల సమస్యల పట్ల అవగాహన పొందటం ప్రధానమని సమాధానమిచ్చారు. అనుబంధాలు మరిచిపోతున్న ఈరోజుల్లో మీ స్పందన ఏమిటని శివగాయత్రి అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేవలం ఉద్యోగం కోసం చదువుదామనే ఆలోచన మంచిది కాదని, విజ్ఞాన సముపార్జన లక్ష్యంగా విద్యావిధానం కొనసాగాలని, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు గడచినా దేశంలో ఇంకా 30 శాతం నిరక్షరాస్యత ఉండటానికి కారణమేమిటని రేణుక అనే విద్యార్థిని ప్రశ్నించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ అనేక విధాలుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయని ఉప రాష్టప్రతి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల పిల్లలు మధ్యలోనే చదువును ఆపివేస్తుండటంపై మీ అభిప్రాయం ఏమిటని కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి ఎస్‌ఎం పర్వీన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ పేదరిక నిర్మూలన, ముద్రా యోజన వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, వీటిద్వారా పేదలకు శిక్షణ, ఉపాధి కల్పించి జీవన పరిస్థితుల్లో మార్పులు తేవడానికి కృషి చేస్తున్నారని ఉప రాష్టప్రతి అన్నారు. నైపుణ్యం, స్వయం ఉపాధితో గ్రామాలు స్వర్ణమయం అవుతాయని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, స్వర్ణ్భారతి ట్రస్ట్ విజయవాడ విభాగం చైర్మన్ మండవ ప్రభాకర్, కార్యదర్శి చుక్కపల్లి రామకృష్ణప్రసాద్, స్టార్ హాస్పిటల్ ఎండీ గోపీచంద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థినుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు