ఆంధ్రప్రదేశ్‌

‘అర్జున’ గ్రహీతకు రూ.కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 31: విలువిద్యలో ‘అర్జున’ పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ప్రోత్సాహకంగా రూ.కోటి అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం పలువురు క్రీడాకారులు ముఖ్యమంత్రిని విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 70 పతకాలు సాధించిన వెన్నం జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్ పేరున నిలబెట్టిందని, ఆమె ఈ పోటీల్లో మరింత రాణించేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో అత్యంత పిన్న వయసులో అర్జున అవార్డు పొందడం, రాష్ట్ర విభజన తరువాత తొలి అర్జున పురస్కార గ్రహీత కూడా ఆమే కావడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కార్య ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా యువజన, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. క్రీడల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపి మరింత మంది విజేతలను తయారుచేసే లక్ష్యంతో పనిచేయాలని క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు. ఒలింపిక్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించి విజయవాడ పేరును ప్రపంచ పఠంపై చిరస్థాయిగా నిలపాలన్నదే తన ఆశయమని జ్యోతిసురేఖ తెలిపింది. ఆమెకు విజయవాడ, అమరావతిలో ఎక్కడైనా స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శులను ఆదేశించారు.

చిత్రం..అర్జున పురస్కార గ్రహీత జ్యోతి సురేఖను సత్కరిస్తున్న సిఎం