ఆంధ్రప్రదేశ్‌

రోగికి సెలైన్ ఎక్కించిన స్వీపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, సెప్టెంబర్ 11: ‘ముఖ్యమంత్రి గాని, నేను గాని ధ్యాస పెడితే చాలదు. క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యసిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలి. భవనాలు, వైద్యపరికరాలు ఉన్నంత మాత్రాన ఫలితం ఉండదు. పేదవారికి సరైన వైద్యం అందించినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. ఇవి ఈనెల 6వ తేది స్థానిక ఏరియా వైద్యశాలలో సుమారు రూ 9కోట్లతో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అయితే మంత్రి మాటలను ఏరియా వైద్యశాల సిబ్బంది చెవికెక్కించుకున్నట్లు కనిపించడం లేదు. చీరాల పట్టణానికి చెందిన జయప్రకాష్ మెడాల్ సంస్థలో పనిచేస్తున్నాడు. సాయంత్రం 4గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పశువులు అడ్డురావటంతో అతను కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలు అతన్ని పరీక్షించి సెలైన్ ఎక్కించాలని సిబ్బందికి సూచించింది. ఆమె సూచనలు పాటించాల్సిన నర్సు సెలైన్ ఎక్కించేందుకు వేరేవాళ్లు వస్తారంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆమె కంటే నిపుణులైన సిబ్బంది వస్తారని భావించిన సదరు పేషెంట్ స్వీపర్ రావటం చూసి అవాక్కయ్యాడు. గత్యంతరం లేక ఆమె చేతనే సెలైన్ పెట్టించుకున్నాడు. స్వీపర్ సరదాగా సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ సెలైన్ ఎక్కించటం చూసి ఇతర పేషెంట్లు సైతం విస్తుపోయారు. ఏదైనా పొరపాటు జరిగి పేషెంట్లకు ఆరోగ్యపరంగా హాని జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమైంది. ఈ వైద్యశాలలో ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. ఆసుపత్రిలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి పేషెంట్‌లకు ఇంజక్షన్ చేయటం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికైనా వైద్యాధికారులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.