ఆంధ్రప్రదేశ్‌

ఈపీడీసీఎల్‌లోనూ ‘దొర’తనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: వడ్డించేవాడు మనవాడైతే ఏ వరసలో కూర్చున్నా ఫర్వాలేదన్నట్లుంది విద్యుత్ శాఖలో నియామకాల వ్యవహారం. తాజాగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా, వాటిని బేఖాతరు చేసి సీఎంఓలోని ఓ సీనియర్ అధికారి చక్రం తిప్పిన ఫలితంగా ఈపీడీసీఎల్ సీఎండి పదవి హెచ్‌వై దొరనే వరించనున్నట్లు సమాచారం. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అభ్యంతరాలే అమలు కాని పరిస్థితి తొలిసారి ఎదురయింది. తాజాగా ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చ.. సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం)లో సుదీర్ఘకాలం నుంచీ ఉన్న ఓ ఐఏఎస్ అధికారి హవాను స్పష్టం చేసింది. విశాఖ కేంద్రంగా ఈపీడీసీఎల్ (ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) సీఎండీ పోస్టు చాలారోజుల నుంచి ఖాళీగా ఉంది. గతంలో ఏపిఎస్‌పిడీసీఎల్, ఈపీడీసీఎల్, ట్రాన్స్‌కోలో వివిధ విభాగాల్లో, ముఖ్యంగా హుద్ హుద్ తుపాన్ వంటి సంక్షోభ సమయంలో ఆపరేషన్ రంగంలో అనుభవం ఉన్న లబ్ధప్రతిష్టులైన డైరెక్టర్లు కొంతమంది ఉన్నప్పటికీ, వారిని కాదని గత నెల క్రితమే ఎపిఎస్‌పిడీసీఎల్ సీఎండీగా కాలపరిమితి ముగిసిన దొరను, ఇప్పుడు మళ్లీ ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించేందుకు రంగం సిద్ధమయింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. రిటైరయినా ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్న ఆయన పనితీరుపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేసి, ఆయనను మళ్లీ మరోచోట నియమించవద్దని, తన అనంతపురం పర్యటన తర్వాత ఈపీడీసీఎల్ సీఎండి పదవిపై కసరత్తు చేద్దామని సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సీఎండి విజయానంద్‌తో చెప్పినట్లు తెలిసింది. దొరకు మూడోసారి పొడిగింపును మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా వ్యతిరేకించారని, గతంలో ఆయనకు ఏడాది పొడిగింపు ఇచ్చినందుకే క్రాంతికిరణ్ అనే వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో తలబొప్పి కట్టి, ప్రత్యేక ఉత్తర్వులతో పొడిగించాల్సి వచ్చినందున ఈసారి అంత రిస్క్ తీసుకోనవసరం లేదని, అర్హులు ఇంకా ఉన్నందున సీఎండి నియామకంలో కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే, సీఎంఓలో దొరకు చాలాకాలం నుంచి దన్నుగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పట్టుబట్టి మరీ, ఆయనకు ఉత్తర్వులిప్పించేందుకు రంగం సిద్ధం చేస్తుండటంపై ఐఏఎస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన పోస్టింగుకు సంబంధించి ఉత్తర్వులిచ్చేలా సదరు ఏఐఎస్ చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ హయాంలో నాటి మంత్రి బొత్స సత్యనారాయణ దన్ను, తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో సీఎండి స్థాయికి ఎదిగి, మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దొర అదే హవా కొనసాగించడంపై అటు పార్టీ వర్గాలూ నోరెళ్లబెడుతున్నాయి.